'శ్రీమంతుడూ' మా ఊరిని దత్తత తీసుకోరూ...
ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో 'శ్రీమంతుడు' మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాత్మకమైన సినిమా. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరికి సొంత ఊరిపై ఖచ్చితంగా ధ్యాస మళ్లుతుంది. సినిమాను వాణిజ్య పరమైన అంశాలతో తీసినప్పటికీ ఓ సందేశాన్ని ప్రజ ల్లోకి వదలడంలో దర్శకుడు సఫలుడయ్యాడు. ఆర్థిక అసమానతలు ఊరితో పాటే పుట్టి పెరిగిన గడపల్లో ఈ సినిమా ఒక ఓదార్పు. సంపన్నులకు సొంత ఊరి పైన మమకారం పెంచేందుకు స్ఫూర్తినిచ్చిన సినిమా శ్రీమంతుడు. సినిమా అనేది చక్కటి ప్రసార మాధ్య మం. విస్తృతంగా ప్రజల్లో వేగంగా వ్యాపిస్తుంది. కాక పోతే సినిమా చూసిన ప్రతి ఒక్కరు వెంటనే మారి పోరు. పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, బంధాలు, జనజీవన సంబంధాలతో ముడిపడి కొం తమంది స్ఫూర్తి పొందుతారు. ఈ విషయంలో ప్రజల్లో.. ప్రధానంగా బాగా డబ్బున్న సంపన్న వర్గా లలో కొంత ఆలోచన రేకెత్తించడంలో 'శ్రీమంతుడు'కొంతమేరకైనా విజయం సాధించింది.
సినిమా దర్శకుడు ఒక ఊరిని కథా వస్తువుగా ఎన్నుకుని సినిమా ద్వారా చేసిన సాహసానికి మహేశ్ బాబు చక్కటి నటనతో ప్రేక్షకుల్లో పండింది. నిర్మాత, సహ నిర్మాత, నటుడు, దర్శకుడు అందరూ మొత్తం హ్యాపీ. ఒక ఊరిని కథా వస్తువుగా ఎన్నుకుని నేటి యువతరానికి తగ్గట్టుగా సినిమా తీర్చిదిద్ది అందిం చడం వల్లే సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీమం తుడు సినిమా యూనిట్‌ను నా ఊరిపైన స్వార్థంతో మా ఊరిని దత్తత తీసుకోవాలని వేడుకుంటున్నాను. శ్రీమంతుడి సినిమాలో ఇచ్చిన ఆదర్శవంతమైన మెసేజ్‌కు మీ సహాయం తోడైతే ఇతరులకు మీరు కూడా ఆదర్శంగా నిలుస్తారనే ఆశతో మా ఊరిని దత్తత తీసుకోవాలని శ్రీమంతుడు నిర్మాత, సహ నిర్మాత, నటుడు మహేశ్‌బాబును కోరుతున్నాను.
తెలంగాణలోని వరంగల్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి మా గ్రామం. స్వాతంత్య్రం సిద్ధించి ఇం తకాలం అయినా గ్రామంలో సమస్యలు మాత్రం అం టువ్యాధిలా పట్టుకుని పీడిస్తూనే ఉన్నాయి. నేను నా ఊరికి ఏదో చేయాలని నా శక్తిమేరకు ప్రయత్నం చేశా ను. రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్న తండా వాసులకు అప్పటి వరంగల్ ఎంపీ రవీంద్రనాయక్ సహాయంతో రోడ్డు వేయించాను. స్వచ్ఛమైన తాగు నీరు లేక కలుషిత జలాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాను. ఇంత మేరకు నా శక్తి సరిపోయింది. ఇవి మాత్రమే చేయగ లిగాను. ఇప్పటికీ గ్రామంలో హైస్కూల్ లేదు. హైస్కూల్‌కు వెళ్లాలంటే 6 కిలోమీటర్లు బురద పొలా ల్లో నుంచి నడిచి వెళ్లిరావాలి. కనీసం గ్రామానికి చెరువు లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమ స్యలే ఉన్నాయి. అందుకే మా గ్రామాన్ని శ్రీమంతుడు సినిమా యూనిట్ దత్తత తీసుకోవాలి. మీరు కేవలం సినిమాలు తీసి సందేశం ప్రజల్లోకి పంపించడమే కాదు, ప్రత్యక్షంగా కూడా సహాయం చేస్తే మరింత మందికి ఆదర్శవంతులవుతారు. మీరు చేసే ఈ పని తో మరింత మంది స్ఫూర్తి పొంది గ్రామాలను దత్తత తీసుకునే వీలు కలుగుతుంది.
దొంతు రమేష్ తట్టుపల్లి, కురవి మండలం, వరంగల్ జిల్లా. మొబైల్: 9618399991