ఇంటిపన్ను సవరణ కు ప్రత్యేక కార్యాచరణ
డీపీవో అల్లూరి నాగరాజువర్మ
పెంటపాడు : భూమి విలువ ఆధారంగా ఇంటిపన్ను సవరణను జూలై ఒకటో తేదీ నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి అల్లూరి నాగరాజువర్మ చెప్పారు. అపరిష్కృతంగా ఉన్న కబేళా సమస్య పరిష్కారంలో భాగంగా పెంటపాడు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిర్మాణపు విలువ, స్కేర్ఫీట్ (ఎస్ఎఫ్టి) ప్రకారం పన్నును లెక్కిస్తామన్నారు. భూముల మార్కెట్ విలువ విపరీతంగా పెరగడం వల్ల పన్ను పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగానే పన్ను ఉంటుందన్నారు. జిల్లాలోని 880 పంచాయతీలకు ఎస్ఎఫ్సీ తదితర పథకాల కింద రూ.41 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు.
పంచాయతీ భవన నిర్మాణాలకు త్వరలో మోక్షం
జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 97 పంచాయతీ భవనాల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని డీపీవో తెలిపారు. ఐదు వేలు జనాభా దాటిన పంచాయతీలకు రూ.13.5 లక్షలు, ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.12 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. డంపింగ్ యార్డులు లేని గ్రామాల్లో స్థలసేకరణ చేయాలని రెవిన్యూ శాఖను కోరామన్నారు. జిల్లాలో 120 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది 25 ఖాళీలు భర్తీ చేశామన్నారు. జిల్లాలో అనధికార లే అవుట్లపై నిఘా పెట్టామన్నారు.
నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక
జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం వచ్చే వేసవి నుంచి సరికొత్త ప్రణాళిక రూపొందించనున్నట్లు నాగరాజువర్మ వెల్లడించారు. గ్రామాల్లో ఉన్న చెరువుల పరిమాణాలు పెంచడం, ఇతర చెరువులను తాగునీటికోసం వినియోగించడం, తదితర చర్యల వల్ల తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామన్నారు. దీనివల్ల వేసవిలోనే కాక అన్ని కాలాలలో నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరందించే పాతకాల పద్ధతికి స్వస్తి పలుకుతామన్నారు. ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, ఈవోపీఆర్డీ ఆర్.లక్ష్మికాంతం, కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, షేక్ షంషుద్ధీన్ పాల్గొన్నారు.