ఐసీఐసీఐకి తప్పని బ్యాడ్ లోన్ల బెడద
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలను సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసిక ఫలితాల నికర లాభాల్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేసినా మొండిబకాయిల కష్టాలు మాత్రం ఈ బ్యాంకుకు కూడా తప్పలేదు.. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో బ్యాంక్ నికర లాభం 2.4 శాతం స్వల్ప వృద్ధితో రూ. 3102 కోట్లగాను, ఇతర ఆదాయం రూ.9,119కోట్లు గా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) కూడా నామమాత్రంగా పెరిగి రూ. 5253 కోట్లకు చేరింది. ఇక ప్రొవిజన్లు రూ. 942 కోట్ల నుంచి ఏకంగా రూ. 7083 కోట్లకు దూసుకెళ్లాయి. ఇది గత క్వార్టర్ లో రూ. 2,515ఉండగా, గత ఏడాదితో పోలిస్తే ఇది ఏడు రెట్లు అధికమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇతర ఆదాయం రూ. 3007 కోట్ల నుంచి రూ. 9119 కోట్లకు జంప్చేసింది. దీనిలో రూ. 5,682 కోట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్లో వాటా విక్రయం ద్వారా లభించినట్లు బ్యాంకు పేర్కొంది.
అలాగే త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.87 శాతం నుంచి 6.82 శాతంపెరుగుదలను నమోదు చేయగా, నికర ఎన్పీఏలు కూడా 3.35 శాతం నుంచి 3.57 శాతానికి పెరిగాయి. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) 16.67 శాతంగా నమోదైంది.