Tax Officials
-
సమోసా, కచోరీలతో కోట్లకు కొలువుతీరి..
లక్నో : యూపీలోని అలీగఢ్‌లో సమోసాలు, కచోరీలు అమ్ముకునే చిరు వ్యాపారికి ఐటీ నోటీసులు అందాయి. అది చూసేందుకు చిన్న షాపే అయినా అమ్మకాలు మాత్రం ఏటా రూ 60 లక్షల నుంచి రూ కోటి వరకూ ఉండటంతో జీఎస్టీ కింద నమోదు చేసుకుని పన్ను చెల్లించాలని పేర్కొంటూ వ్యాపారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖేష్ కచోరి పేరుతో సీమా సినిమా హాల్ సమీపంలో ఉన్న ఈ దుకాణాన్ని రోజూ ఉదయాన్నే తెరిచి రాత్రి పొద్దుపోయేదాకా నడిపిస్తారు. ఇక్కడ వండివార్చే సమోసాలు, కచోరీలకు స్ధానికుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. రోజూ కస్టమర్ల తాకిడితో కౌంటర్ కళకళలాడటంతో అంతా బాగానే ఉన్నా ఈ షాప్‌పై వచ్చిన ఫిర్యాదుపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. షాప్ ఎదురుగా ఉన్న మరో దుకాణంలో కూర్చున్న అధికారులు అక్కడ జరిగే తంతును గమనించారు. ముఖేష్ కచోరీలు, సమోసాలపై ఏటా రూ 60 లక్షల నుంచి రూ కోటికి పైగానే ఆర్జిస్తాడని అంచనా వేశారు. అధికారులు ఆరా తీయడంతో కంగుతిన్న ముఖేష్ తనకు ఇవేమీ తెలియవని, గత 12 ఏళ్లుగా తాను ఈ షాపును నడిపిస్తున్నా ఈ లాంఛనాలు ఉంటాయని తనకు ఎవరూ చెప్పలేదని చెప్పుకొచ్చాడు. తాను బతికేందుకు చిన్న స్ధాయిలో ఈ వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ముఖేష్ తన వ్యాపారం గురించి పూర్తిగా చెప్పాడని, ఎంత ఆదాయం వస్తుంది నూనె, సిలిండర్ వంటి ముడి సరుకులకు ఎంత ఖర్చవుతుందనేది చెప్పాడని ఈ కేసును విచారించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) సభ్యుడు తెలిపారు. రూ 40 లక్షల వార్షిక టర్నోవర్‌ను మించిన వారంతా జీఎస్టీ రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని, సిద్ధం చేసిన ఆహారంపై 5 శాతం పన్ను విధిస్తారని చెప్పారు. ముఖేష్‌కు నోటీసు జారీ చేసిన అధికారులు అతనితో జీఎస్టీ రిజిస్ర్టేషన్ చేయించి పన్ను వసూలు చేసే ప్రక్రియను చేపట్టారు. అసంఘటిత రంగంలో ఇలాంటి వ్యాపారులు ఎందరో అవగాహన లేమితో జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారని, వారందరినీ పన్ను వ్యవస్ధలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
15 మంది కస్టమ్స్ ఆఫీసర్లపై వేటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోమారు అధికారులపై కొరడా ఝళిపించింది. అవినీతి, అధికార దుర్వినియోగం వంటి కారణాలతో ఇటీవల ఆదాయపన్ను అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం ఇప్పుడు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులపై వేటువేసింది. అవినీతి, ముడుపులు అందుకున్నారన్న ఆధారాలతో ప్రభుత్వం మంగళవారం 15 మంది సీనియర్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించింది. అందులో ఒకరు ప్రిన్సిపల్ కమిషనర్ హోదా ఉన్న అధికారి కావడం గమనార్హం. వీరిలో కొందరు ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ముడుపులు అందుకోవడం, ప్రభుత్వ సొమ్మును కాజేయడం, ఆదాయానికి మించిన ఆస్తులు ఉండడం వంటి అభియోగాలతో సీబీఐ ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేసిందని ఆర్థిక శాఖాధికారులు పేర్కొన్నారు. వీరిలో ప్రిన్సిపల్ ఏడీజీగా పనిచేస్తున్న అనూప్ శ్రీవాస్తవపై 1996లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఓ సొసైటీకి భూమిని కొనుగోలు చేయడానికి సహకరించారని సీబీఐ కేసు నమోదు చేసింది. జాయింట్ కమిషనర్ నళిన్ కుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఫండమెంటల్ రూల్స్, క్లాస్ జే లోని 56వ నిబంధనను ఉపయోగించి రాష్ట్రపతి వీరిని తొలగించారు. రానున్న మూడు నెలలపాటు యధావిధిగా వేతనాలు అందుతాయని తెలిపారు. మూడు నెలల ముందు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ అధికారులను తొలగించే హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చెన్నై కమిషనర్ జీ శ్రీ హర్షలను సీబీఐ వలపన్ని పట్టుకుంది. వీరితో పాటు కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్లు అతుల్ దీక్షిత్, వినయ్ బ్రిజ్ సింగ్‌లు ఉన్నారు. ఢిల్లీ జీఎస్టీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్ అమ్రేశ్ జైన్, భువనేశ్వర్ జీఎస్టీ జోన్‌కు చెందిన ఎస్ఎస్ బిష్త్, ముంబై జీఎస్టీ జోన్‌కు చెందిన వినోద్ సంగా, వైజాగ్ జీఎస్టీ జోన్‌కు చెందిన రాజు శేఖర్, అలహాబాద్ జీఎస్టీ జోన్‌కు చెందిన మొహమ్మద్ అల్తాఫ్‌లు ఉన్నారు. వీరితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ డిప్యూటీ కమిషనర్ అశోక్ అశ్వాల్ కూడా ముందస్తు పదవీవిరమణ చేయాలని ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది. -
జీఎస్టీ కౌన్సిల్‌కి మరో తలనొప్పి
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్‌కు మరో తలనొప్పి ఎదురుకాబోతుంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు పరోక్ష పన్ను అధికారుల అసోసియేషన్లు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగేందుకు సిద్ధమయ్యారు.. శుక్రవారం జరుగబోయే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేను జరుపుకోమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అంతేకాక జనవరి 30న జరుగబోయే అమరుల దినోత్సవం రోజు కూడా బ్లాక్ బ్యాడ్జ్‌లను ధరించి బ్లాక్ డేను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జనవరి 16న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఎక్కువగా నిరాశపరిచే నిర్ణయాలు తీసుకుని మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 12 నాటికల్ మైళ్ల పరిధిలో ఉన్న ప్రాదేశిక జలాల ఆర్థిక వ్యవహారాలపై లెవీ ట్యాక్స్ అధికారాలను కౌన్సిల్ రాష్ట్రాలకు ఇచ్చింది. రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కిందనున్న పన్ను చెల్లింపుదారుల హక్కులూ 90 శాతం రాష్ట్రాలకే ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం కేవలం రెవెన్యూ ఆఫీసర్ల కెరీర్‌పైనే కాదని, ఇది అసలు జాతీయ ప్రయోజనం కాదని ఉద్యోగులు పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్రం బలహీన పడడమే కాక, ఆర్థిక వ్యవస్థపై, రెవెన్యూ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డులోని ఏ,బీ,సీ గ్రూప్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే స్టాండింగ్ కమిటీ అసోసియేషన్ మీటింగ్ అనంతరం ఈ నిర్ణయాలను వారు ప్రకటించారు. మొత్తం 70వేల మంది అధికారులు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగనున్నట్టు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. -
ఆ వేధింపుల భయాల్ని తొలగించండి
న్యూఢిల్లీ : పన్ను ఓ పెనుభూతంలా భావించే పన్నుచెల్లింపుదారులకు ఆ భయాన్ని తొలగించాలని అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారుల మైండ్ లోంచి ఆ వేధింపుల భయాన్ని తుడిచివేయాలని సూచించారు. పరిపాలనలో ఐదు పిల్లర్స్ గా ఉన్న రెవెన్యూ, అకౌంటబిలిటీ, ప్రొబిటీ, ఇన్ ఫర్మేషన్, డిజిటైజేషన్ పై ఎక్కువగా దృష్టిసారించాలని పేర్కొన్నారు. రెండు రోజుల 'రాజస్వ జ్ఞాన సంఘం' సమావేశాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. పన్నుల విధానంలో డిజిటైజేషన్ పై అధికారులు ఎక్కువగా దృష్టిపెట్టి, పన్నుల పరిపాలనను మంచిగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. పన్ను వేధింపుల భయాన్ని పోగొట్టినప్పుడే పన్ను చెల్లింపుదారుల ప్రవర్తన మృదువుగా, తెలివిగా ఉంటుందని అధికారులకు మోదీ సూచించారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఈ సమావేశ అనంతరం వివరాలను జయంత్ సిన్హా మీడియాకు వెల్లడించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు , కేంద్ర ఎక్సేంజ్, కస్టమ్స్ బోర్డు సీనియర్ పన్ను అధికారులు ఈ రెండు రోజుల వార్షిక కాన్ఫరెన్స్ కు పాల్గొంటున్నారు.