ట్యాక్సీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం!
ముంబై: ఉబర్ డ్రైవర్ అత్యాచార ఉదంతం తర్వాత తీవ్ర నియంత్రణలో ఉన్న ట్యాక్సీ కంపెనీలన్నీ ఒక ఆసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయి. ‘మేమంతా కలిసే ఉన్నాం అని ప్రభుత్వానికి తెలిపేందుకు ఓ అసోసియేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ‘ఉబెర్’ ఘటన తర్వాత చాలా టాక్సీ కంపెనీల మీద ప్రభుత్వం నిషేధం విధిం చింది. అన్ని కంపెనీల యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. పరిశ్రమకు న్యాయం చేయాలంటే ఏకీకృత జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఆర్టీవోలతో కాదు’ అని టాక్సీ ఫర్ ష్యూర్(టీఎఫ్ఎస్) వ్యవస్థాపక డెరైక్టర్ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు.
తమ కంపెనీ టాక్సీలు అంత సురక్షితం కాదనే ఆరోపణలను ఆయన ఖండించారు. డ్రైవర్లు, టాక్సీ సమాచారం అంతా మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. బెంగళూరులో ఆటోలు, నానో కార్లతో విజయవంతంగా కంపెనీ సేవలు ప్రారంభించామని, త్వరలో ముంబైలో మొదలు పెడతామని ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 100 నగరాల్లో తమ సేవలు విస్తరించనున ్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 40 వేల ట్రిప్పులు, 47 కన్నా ఎక్కువ నగరాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు. సొంతంగా కార్లు లేకున్నా 22 వేల ఆపరేటర్లను 10 శాతం చార్జ్‌తో నడుపుతున్నామని ఆయన వివరించారు. కాల్ సెంటర్ ద్వారానే సర్వీసులు నడుపుతున్నా.. ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్స్ చేస్తున్నామని ఆయన చెప్పారు.