Taxi Services
-
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
ఈలాన్‌మస్క్ ఎక్కడ.. చైనా అప్పుడే మొదలెట్టింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిటికలెస్తూ ట్విటర్‌ను క్షణాల్లో కొనేసిన ఈలాన్ మస్క్‌కి ఇప్పటికీ ఓ కోరిక అలాగే ఉండిపోయింది. టెస్లా కార్లలో ఆటోపైలెట్కి అనుమతి సాధించేందుకు ఏళ్ల తరబడి ఈలాన్ మస్క్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన ఫలితం పొందలేదు. మరోవైపు చైనా చాప కింద నీరులా ఈ పని చేసేసింది. చైనాలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు ప్రపంచంలో తొలిసారిగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సేవలు చైనాలో ప్రారంభం కానున్నాయి. క్వాంజో నగరంలోని నన్షా ప్రాంతంలో 100 రోబోట్యాక్సీలు నడిపేందుకు టయోటా ప్రమోట్ చేస్తున్న పోనీ.ఏఐ అనే కంపెనీ ఈ మేరకు లైసెన్స్ దక్కించుకుంది. అలాగే బీజింగ్ నగరంలోనూ సేవలు ఆఫర్ చేసేందుకు పోనీ.ఏఐతోపాటు ఇంటర్నెట్ దిగ్గజం బైడూ లైసెన్స్ పొందింది. 2021 నవంబరు.. బీజింగ్‌లో 67 అటానమస్ (డ్రైవర్ రహిత) వెహికిల్స్ పరీక్షల కోసం పోనీ.ఏఐ 2021 నవంబర్‌లో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 7,00,000 ట్రిప్స్ పూర్తి చేసింది. 80 శాతం రైడర్స్ పాత కస్టమర్లేనని కంపెనీ తెలిపింది. క్వాంజో నగరంలోని ఇతర ప్రాంతాలతోపాటు చైనాలో ప్రథమ శ్రేణి నగరాల్లోనూ రోబోట్యాక్సీ సర్వీసులను వచ్చే ఏడాది నుంచి మొదలు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతానికి ఈ అటానమస్ వాహనంలో డ్రైవర్ కూడా ఉంటారు. ఈ రెండు కంపెనీలూ రానున్న రోజుల్లో డ్రైవర్ లేకుండానే సేవలు అందించనున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన పోనీ.ఏఐ కంపెనీని జేమ్స్ హంగ్, టించెంగ్ లూహ్ 2016లో స్థాపించారు. చదవండి: ‘దిగంతర’ స్పేస్ స్టార్టప్'.. ఇంజనీరింగ్ విద్యార్థుల సక్సెస్ స్టోరీ -
Allu Arjun : ర్యాపిడో స్టార్ క్యాంపెయిన్ షురూ
బైక్ ట్యాక్సీ యాప్ ర్యాపిడో సెలబ్రిటీ క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా రూపొందించిన వీడియోల్లో స్టార్ హీరోలు అల్లు అర్జున్, రణ్‌వీర్‌సింగ్‌లు నటించారు. స్మార్ట్హో తో ర్యాపిడో థీమ్‌తో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ర్యాపిడో అందిస్తున్న ఆఫర్లు, యూనిక్ ఫీచర్లను వివరించడం ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడంతో పాటు మార్కెట్‌ను విస్తృతి చేసుకోవడం లక్ష్యంగా ర్యాపిడో ప్రచారం చేపట్టింది. నవంబర్ 5న ఈ సెలబ్రిటీ క్యాంపెయిన్ మొదలైంది. ఆరు వారాల పాటు 14 నగరాల్లో ప్రచారం జరగనుంది. ఇందుకోసం రూపొందించిన ప్రత్యేక వీడియో యాడ్లకు ఏస్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, సిజిల్ శ్రీవాస్తవలు దర్శకత్వం వహించారు. వీటిని డ్రీమ్వాల్ట్ మీడియా చిత్రీకరించింది. ర్యాపిడో మార్కెటింగ్ హెడ్ అమిత్ వర్మ మాట్లాడుతూ .. అల్లు అర్జున్, రణవీర్ సింగ్‌లతో సెలబ్రిటీ ప్రచారం చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ర్యాపిడో ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అల్లు అర్జున్ వెల్లడించారు. 52మిలియన్లు ఫండింగ్ ర్యాపిడో దేశ వ్యాప్తంగా 100 నగరాల్లో 150,000 నుంచి 160,000 బైక్ సేవల్ని, 26 నగరాల్లో 70వేల ఆటోలు రిక్షా సేవలుల్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ర్యాపిడో సేవల్ని మరింత విస్తరించేందుకు ఇటీవల 52 మిలియన్ల ఫండింగ్‌ను రాబట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆర్టీసీ అభ్యంతరం ర్యాపిడో యాడ్‌లో తమ సంస్థ బ్రాండ్ ఇమేజ్‌కి నష్టం కలిగేలా అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ర్యాపిడో, హీరో అల్లు అర్జున్‌లకి టీఎస్ఆర్టీసీ లీగల్ నోటీసులు పంపింది. ప్రజా ప్రయోజనాలకు హానీ కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కోరింది. -
ట్యాక్సీ డ్రైవర్ ఆత్మహత్య: ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన
బెంగళూరు: డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో విమానశ్రాయంలో టాక్సీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. కర్ణాటక టూరిజం శాఖలో పని చేస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం తన కారులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు డ్రైవర్ బుధవారం ఉదయం మరణించాడు. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు ‘‘బీఎల్‌ఆర్‌ఏ విమానాశ్రయంలో ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నాం. ప్రయాణికులు బీఎంటీసీ బస్సు సేవలను, వ్యక్తిగత వాహనాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం’’ అంటూ ట్వీట్ చేసింది. Taxi services at @BLRAirport have been regularised. Passengers may opt for app-based taxis or BMTC bus services for travel to and from BLR Airport.#taxi #bengaluru #KIAB #bengaluruairport pic.twitter.com/KB55MQ9VBP — BLR Airport (@BLRAirport) March 31, 2021 రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ప్రతాప్ (32) అనే ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రతాప్ బుధవారం ఉదయం మరణించాడు. ఇందుకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయం ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరిస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ప్రతాప్ మృతికి కారణాలు తెలియదు. తీవ్రంగా గాయపడటంతో అతడి వద్ద నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేకపోయాం’’ అని తెలిపాడు. -
ట్యాక్సీ సేవల్లోకి ఇ–యానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న వీజీ అర్సెడో ఎనర్జీ.. ట్యాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇ–యానా పేరుతో తొలుత కరీంనగర్, వరంగల్‌లో ప్రవేశిస్తోంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, టూ వీలర్లతో సేవలందించడం దీని ప్రత్యేకత. ఇ–యానా యాప్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కైనెటిక్ గ్రీన్ ఫౌండర్ సులజ్జ ఫిరోదియా మోత్వానీ మంగళవారమిక్కడ ఆవిష్కరించారు. ప్రస్తుతం రెండు నగరాలకు కలిపి 50 ఆటోలు, 50 స్కూటర్లను కొనుగోలు చేశామని కంపెనీ డైరెక్టర్ సందీప్ వంగపల్లి తెలిపారు. డైరెక్టర్లు విజయ్ కుమార్, నవనీత్ రావు, శశికాంత్ రెడ్డితో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘2020 మార్చినాటికి మరో 200 స్కూటర్లు, 200 ఆటోలు కొంటాం. ఆరు నెలల్లో రూ.50 కోట్ల నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పటికే రూ.4.5 కోట్లు ఖర్చు చేశాం. దశలవారీగా ఖమ్మం, నిజామాబాద్, చెన్నై, భువనేశ్వర్‌లో అడుగు పెడతాం. కిలోమీటరుకు చార్జీ త్రీ వీలర్ అయితే రూ.10, టూ వీలర్‌కు రూ.6 ఉంటుంది’ అని చెప్పారు. -
‘ఓలా’లా..!
బెంగళూరు: ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ఓలా... ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్ బ్రాండ్స్‌నూ ప్రవేశపెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వీటిని లిస్ట్ చేయడంతో పాటు సొంతంగా రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, ఫుడ్ ట్రక్కులు, చిన్నపాటి కియోస్క్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భోజనం మొదలుకుని బిర్యానీలు, డెసర్ట్లు.. ఇలా అన్ని రకాల ఆహారాలకు సంబంధించి ప్రత్యేక బ్రాండ్స్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు.. పట్టణాల్లో కస్టమర్లకు మరింత చేరువ కావాలనేది ఓలా వ్యూహం. ‘గతంలో హోటళ్లలో భోజనం చేయడమనేది ఎప్పుడో ఒకసారిగా ఉండేది. ప్రస్తుతం ఇది రోజువారీ వ్యవహారంగా మారిపోతోంది. కాబట్టి ఆహార వ్యాపారం, సరఫరా వంటివి కూడా దానికి అనుగుణంగానే మారాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరొందిన ఫుడ్ బ్రాండ్స్ కొన్నే ఉన్నాయి. అందుకే ఈ రంగంలో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించాం‘ అని ఓలా ఫుడ్ విభాగం సీఈవో ప్రణయ్ జీవ్‌రాజ్‌కా పేర్కొన్నారు. తమ ఆహార బ్రాండ్స్‌తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ’కిచిడీ ఎక్స్పెరిమెంట్’..: ఆహార వ్యాపార విభాగంలోకి విస్తరించే క్రమంలో ’కిచిడీ ఎక్స్పెరిమెంట్’ పేరిట ఓలా సొంత బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాల్లో కిచిడీ వంటకంలో సుమారు 16 వెరైటీలు అందిస్తోంది. రుచికరమైన కిచిడీని వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారనే ఉద్దేశంతో ముందుగా దీన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. ఓలాకు ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో 50 దాకా కిచెన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో కార్యకలాపాలను 80పైగా నగరాలకు విస్తరించాలని ఓలా నిర్దేశించుకుంది. రాణించని ఫుడ్‌పాండా.... ఇతర వ్యాపారాల్లోకి విస్తరించే వ్యూహంలో భాగంగా.. ఫుడ్ డెలివరీ సేవలందించే ఫుడ్‌పాండాకు చెందిన భారత వ్యాపార విభాగాన్ని 2017 డిసెంబర్లో ఓలా కొనుగోలు చేసింది. దీనిపై 200 మిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో.. భారీగా వ్యయాలు చేసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో దీన్నుంచి ఫలితాలు రాబట్టలేకపోయింది. ఫుడ్ డెలివరీ సేవలతో పాటు.. మరింత రుచికరమైన ఆహారానికి కూడా డిమాండ్ ఉందన్న సంగతిని ఈ క్రమంలోనే గుర్తించింది. అందుకే డెలివరీతో పాటు ఆహార వ్యాపారంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. భారీగా క్లౌడ్ కిచెన్లు.. ఇటీవల క్లౌడ్ కిచెన్లు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఫుడ్ టెక్నాలజీ కంపెనీలు, ఇన్వెస్టర్లు వీటిపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉదాహరణకు ఫాసూస్, బెహ్రూజ్ బిర్యానీ వంటి బ్రాండ్స్‌ను రూపొందించిన ముంబై సంస్థ రెబెల్ ఫుడ్స్‌కు దేశీయంగా మొత్తం 18 నగరాల్లో 205 క్లౌడ్ కిచెన్స్, 1,600 ఆన్లైన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో సుమారు 500 క్లౌడ్ కిచెన్స్ స్థాయికి చేరాలని కంపెనీ నిర్దేశించుకుంది. రెబెల్ పోర్ట్ ఫోలియోలో మాండరిన్ ఓక్, ఓవెన్ స్టోరీ, స్వీట్ ట్రూత్ వంటి ఇతర బ్రాండ్లూ ఉన్నాయి. మరోవైపు, బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్విగ్గీ కూడా హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో స్విగ్గీ యాక్సెస్ పేరిట తమ క్లౌడ్ కిచెన్స్‌ను విస్తరిస్తోంది. స్విగీ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న పలు రెస్టారెంట్లు .. ఇతర ప్రాంతాల్లో తమ శాఖలను ఏర్పాటు చేయలేకపోయినా.. డిమాండ్ ఉన్న వంటకాలను అందించేందుకు, కస్టమర్లను సంపాదించుకునేందుకు ఈ క్లౌడ్ కిచెన్స్ ఉపయోగకరంగా ఉంటున్నాయి. -
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..!!
న్యూఢిల్లీ: బటన్ నొక్కగానే ట్యాక్సీలాగా విమానమే ఇంటి ముంగిట్లో వాలితే.. గంటల తరబడి ట్రాఫిక్ జంఝాటాలేమీ లేకుండా క్షణాల్లోనే గమ్యస్థానాలకు ఎగిరిపోగలిగితే.. అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్లా అనిపిస్తోంది కదూ.. అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల దిగ్గజం ఉబెర్ ప్రస్తుతం దీన్ని సాకారం చేసే ప్రయత్నాల్లోనే ఉంది. త్వరలోనే ఎయిర్‌ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎలివేట్ పేరుతో అందించే ఈ సర్వీసుల కోసం భారత్ సహా పలు దేశాల్లో అవకాశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఆరు నెలల్లోగా అనువైన నగరాల ఎంపిక పూర్తి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ముందుగా తొలి విడతలో అమెరికాలోని డల్లాస్, లాస్ ఏంజెలిస్‌లలో ఏరియల్ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించాలని.. అంతర్జాతీయంగా మరో నగరాన్ని ఎంపిక చేయాలని ఉబెర్ యోచిస్తోంది. దీనికోసం భారత్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్‌లను షార్ట్ లిస్ట్ చేసింది. వీటిల్లో ఒకదాన్ని అమెరికాకు వెలుపల ఉబెర్ ఎయిర్ సిటీగా ఎంపిక చేయనున్నట్లు ఉబెర్ పేర్కొంది. మార్కెట్ పరిమాణం, అనుకూల పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. 2020 నాటికి ప్రయోగాత్మకంగా పరిశీలన.. ప్రయోగాత్మక ఫ్లయిట్స్‌ను 2020 కల్లా ప్రారంభించాలని, 2023 నాటికి మూడు నగరాల్లో వాణిజ్యపరంగా సేవలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ఉబెర్ ఏవియేషన్ ప్రోగ్రామ్స్ హెడ్ ఎరిక్ అలిసన్ వెల్లడించారు. భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాలన్నా గంటల తరబడి సమయం పట్టేస్తుందని.. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాల్లో ఏరియల్ సర్వీసులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఉబెర్ పేర్కొంది. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలిగే వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీవోఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ సేవలకు ఉపయోగించాలని సంస్థ భావిస్తోంది. ఎత్తైన భవంతుల మీద వీటికోసం హెలీప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. పదిహేను నిమిషాల దూరానికి 129 డాలర్లు ఉబెర్ ఎలివేట్ వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని మెరీనా, శాన్జోసీకి ఉబెర్ క్యాబ్‌లో వెడితే 1 గంట 40 నిమిషాలు (56.9 మైళ్లు), కాల్ట్రెయిన్లో వెడితే(55.4 మైళ్లు) 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. అయితే, ఉబెర్ ఎలివేట్ ఎయిర్ ట్యాక్సీలో 15 నిమిషాలే (43.3 మైళ్లు) పడుతుంది. ప్రారంభంలో ఇందుకు చార్జీలు 129 డాలర్లు(సుమారు రూ. 9,030)గా ఉన్నా ఆ తర్వాత 43 డాలర్లకు(3,010), దీర్ఘకాలంలో 20 డాలర్లకు(1,400) తగ్గే అవకాశాలు ఉన్నా యి. ప్రస్తుతం ఇదే దూరానికి ఉబెర్ ఎక్స్ క్యాబ్‌కి 111 డాలర్లు(సుమారు రూ. 7,700), ఉబెర్‌పూల్ (షేరింగ్)కి 83 డాలర్లు(రూ. 5,810) అవుతోంది. -
బెంగళూరులో హెలీ ట్యాక్సీలు ప్రారంభం
శివాజీ నగర : బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడంతో పలు ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు హెలీ ట్యాక్సీలు అందుబాబులోకి వచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం– ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఈ హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను సోమవారం ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఐదుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ బయలుదేరింది. కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్ సంస్థ ప్రవేశపెట్టిన ఈ హెలీ ట్యాక్సీలతో రోజుకు మూడు ట్రిప్‌లు వేయనున్నారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు. -
నేటి నుంచి వైజాగ్‌లో ఉబర్ సేవలు
ముంబై: ఉబర్ కంపెనీ తన ట్యాక్సీ సేవలను వైజాగ్‌లో గురువారం నుంచి ప్రారంభించనుంది. వైజాగ్‌తోపాటు ఉబర్ ట్యాక్సీ సేవలు భువనేశ్వర్, కోయంబత్తూరు, ఇండోర్, మైసూర్, నాగ్‌పూర్, సూరత్ వంటి ఆరు టైర్-2 పట్టణాల్లో కూడా ప్రారంభంకానున్నాయి. దీంతో ఉబర్ సేవలు దేశంలోని 18 పట్టణాల్లో ఉన్నట్లు అవుతుంది. అలాగే ఉబర్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ ప్రాంతంగా మారుతుంది. కంపెనీ నెలవారి వృద్ధి 40 శాతంగా ఉందని ఉబర్ ఇండియా హెడ్ నీరజ్ సింఘల్ తెలిపారు. -
ట్యాక్సీ యాప్@ 1.80 లక్షల కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విస్తరిస్తున్న నగరాల్లో ప్రయాణికులను ఒక చోట నుండి వేరొక చోటికి చేరవేసే రవాణా సేవల్లో బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలుండటంతో బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయలను ఈ రంగంలో కుమ్మరిస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత ట్యాక్సీ సేవల రంగంలో పెట్టుబడులకు మించి ఎన్నో రెట్లు ప్రతిఫలం వస్తుండటంతో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆయా సంస్థల విలువలను ఎవరికీ అందని అంచనాలతో అనూహ్య స్థాయిల్లో మదింపు చేస్తున్నారు. స్థిరాస్తులు ఏమీ లేని అమెరికాకు చెందిన ఉబర్ సంస్థ విలువ 30 బిలియన్ డాలర్లు (లక్షా 80 వేల కోట్ల రూపాయలు) అంటే ముక్కున వేలేసుకోవల్సిందే. ఇండియాలో రూ. 2,400 కోట్లతో (400 మిలియన్డాలర్లు) వ్యాపారాభివృద్ధి చేసుకునేందుకు ఉబర్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్యాక్సీ క్యాబ్ రంగంలో ఈ స్థాయి పెట్టుబడులు గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉబర్ బిజినెస్ మోడల్ భిన్నమైనది. రేడియో క్యాబ్స్లా ఉబర్ సంస్థకు సొంతంగా ట్యాక్సీలు, క్యాబ్‌లు లేవు. వాటిని నడిపించే డ్రైవర్లూ దాని ఉద్యోగులు కాదు. ఇది ఒక టెక్నాలజీ యాప్. అది చేసే పని కేవలం పేరయ్య (సర్వీస్ ఫెసిలిటేటర్) పనే. అంటే ట్యాక్సీ సేవలు కావాలనుకున్న కస్టమర్‌కు కారు డ్రైవర్ లేదా ఓనర్‌తో ఆన్లైన్లో అనుసంధానించటమే దీని పని. ఈ పనికి పొందే కమీషనే దీని ఆదాయం. దేశంలో హైదరాబాద్, బెంగళూరుతో ఆరు నగరాల్లో ఈ సంస్థ సేవలు వినియోగంలో ఉన్నాయి. ఉబర్ ఎక్స్ కార్ రెంటల్ కనీస చార్జీ రూ. 150. టాక్సీ మీటర్ రూ. 50 నుంచి మొదలవుతుంది. కిలోమీటర్‌కు రూ. 15 చార్జీ చేస్తారు. నగదు చెల్లింపు ఎలా?? వినియోగదారుడు తొలుత ఉబర్ యాప్‌ను తన మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ట్యాక్సీ చార్జీలను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్...ఇలా ఏ మార్గంలో చెల్లించాలనుకుంటే ఆ వివరాలను పేటిఎం వాలెట్ ద్వారా ఉబర్‌కు లింకప్ చేసుకోవాలి. పేటిఎం వాలెట్ ఆప్షన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్( ఐఫోన్) ఆపరేటింగ్ సిస్టంలలో నడుస్తోంది. డబ్బు చెల్లించేందుకు ‘పేమెంట్’ బటన్ నొక్కాలి. తర్వాత ‘యాడ్ మనీ’ ని క్లిక్ చేయండి. వాలెట్లో రీచార్జి మొత్తం రూ. 100 కు తగ్గరాదు. ఇది మినిమం బ్యాలెన్స్. వాలెట్‌ను మన అవసరాలకు అనుగుణంగా క్రెడిట్, డెబిట్‌కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రీచార్జి చేసుకోవచ్చు. డ్రైవర్లకు అధికాదాయం... సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లకన్నా ఉబర్ నెట్వర్క్ డ్రైవర్లు అధికాదాయం పొందుతున్నారు. సొంత కారు కలిగి ట్యాక్సీ నడపాలనుకున్న ఎవరైనా ఉబర్ డ్రైవర్ కావచ్చు. ఉబర్ ఎంపిక వడపోతలో మీరు అర్హులైతే మీకు సంస్థ ఒక ఐఫోన్ ఇస్తుంది. దాంతో మీరు ఉబర్ నెట్‌వర్క్‌లో సభ్యులైపోతారు. ఆయా నగరాలను బట్టి ట్యాక్సీఫేర్ (రవాణా చార్జీ)ని ఉబర్ సంస్థ నిర్ధారిస్తుంది. ఉబర్ సంస్థ వసూలు చేసిన చార్జీలో 20 శాతం తన కమీషన్‌గా తీసుకొని మిగిలిన 80 శాతం డ్రైవర్ ఖాతాకు జమ చేస్తుంది. సాధారణ ట్యాక్సీ సంస్థలకన్నా ఉబర్ ద్వారానే డ్రైవర్లు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఉబర్ చిన్నకార్ల డ్రైవర్లు వారానికి కనీసం రూ.16 వేలు సంపాదిస్తున్నారు.