ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..!! | Uber Considering India For Its Aerial Taxi Service | Sakshi
Sakshi News home page

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..!!

Published Fri, Aug 31 2018 12:28 AM | Last Updated on Fri, Aug 31 2018 12:28 AM

Uber Considering India For Its Aerial Taxi Service - Sakshi

న్యూఢిల్లీ: బటన్‌ నొక్కగానే ట్యాక్సీలాగా విమానమే ఇంటి ముంగిట్లో వాలితే..  గంటల తరబడి ట్రాఫిక్‌ జంఝాటాలేమీ లేకుండా క్షణాల్లోనే గమ్యస్థానాలకు ఎగిరిపోగలిగితే.. అచ్చం సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో సీన్‌లా అనిపిస్తోంది కదూ.. అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల దిగ్గజం ఉబెర్‌ ప్రస్తుతం దీన్ని సాకారం చేసే ప్రయత్నాల్లోనే ఉంది. త్వరలోనే ఎయిర్‌ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎలివేట్‌ పేరుతో అందించే ఈ సర్వీసుల కోసం భారత్‌ సహా పలు దేశాల్లో అవకాశాలను పరిశీలిస్తోంది. వచ్చే ఆరు నెలల్లోగా అనువైన నగరాల ఎంపిక పూర్తి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ముందుగా తొలి విడతలో అమెరికాలోని డల్లాస్, లాస్‌ ఏంజెలిస్‌లలో ఏరియల్‌ ట్యాక్సీ సర్వీసులు ప్రారంభించాలని.. అంతర్జాతీయంగా మరో నగరాన్ని ఎంపిక చేయాలని ఉబెర్‌ యోచిస్తోంది. దీనికోసం భారత్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్‌లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. వీటిల్లో ఒకదాన్ని అమెరికాకు వెలుపల ఉబెర్‌ ఎయిర్‌ సిటీగా ఎంపిక చేయనున్నట్లు ఉబెర్‌   పేర్కొంది. మార్కెట్‌ పరిమాణం, అనుకూల పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించింది. 

2020 నాటికి ప్రయోగాత్మకంగా పరిశీలన..
ప్రయోగాత్మక ఫ్లయిట్స్‌ను 2020 కల్లా ప్రారంభించాలని, 2023 నాటికి మూడు నగరాల్లో వాణిజ్యపరంగా సేవలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ఉబెర్‌ ఏవియేషన్‌ ప్రోగ్రామ్స్‌ హెడ్‌ ఎరిక్‌ అలిసన్‌ వెల్లడించారు. భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాలన్నా గంటల తరబడి సమయం పట్టేస్తుందని.. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వీసులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ఉబెర్‌ పేర్కొంది. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్‌ చేయగలిగే వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (వీటీవోఎల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఈ సేవలకు ఉపయోగించాలని సంస్థ భావిస్తోంది. ఎత్తైన భవంతుల మీద వీటికోసం హెలీప్యాడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. 

పదిహేను నిమిషాల దూరానికి 129 డాలర్లు ఉబెర్‌ ఎలివేట్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని మెరీనా, శాన్‌జోసీకి ఉబెర్‌ క్యాబ్‌లో వెడితే 1 గంట 40 నిమిషాలు (56.9 మైళ్లు), కాల్‌ట్రెయిన్‌లో వెడితే(55.4 మైళ్లు) 2 గంటల 12 నిమిషాలు పడుతుంది. అయితే, ఉబెర్‌ ఎలివేట్‌ ఎయిర్‌ ట్యాక్సీలో 15 నిమిషాలే (43.3 మైళ్లు) పడుతుంది. ప్రారంభంలో ఇందుకు చార్జీలు 129 డాలర్లు(సుమారు రూ. 9,030)గా ఉన్నా ఆ తర్వాత 43 డాలర్లకు(3,010), దీర్ఘకాలంలో 20 డాలర్లకు(1,400) తగ్గే అవకాశాలు ఉన్నా యి. ప్రస్తుతం ఇదే దూరానికి ఉబెర్‌ ఎక్స్‌ క్యాబ్‌కి 111 డాలర్లు(సుమారు రూ. 7,700), ఉబెర్‌పూల్‌ (షేరింగ్‌)కి 83 డాలర్లు(రూ. 5,810) అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement