సాక్షి, న్యూఢిల్లీ: క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ సేవలు ఇక ఇండియాలో నిలిచిపోనున్నాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ప్రత్యర్థి క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్ రెండూ విలీనం దిశగా పావులు కదుపుతున్నాయి. చైనాలో మాదిరిగానే.. భారత్‌లోకూడా ఉబెర్ ప్రధాన ప్రత్యర్థి ఓలాతో విలీనం కానుందనే అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. రెండు సంస్థల్లోనూ ఉమ్మడి పెట్టుబడిదారుగా ఉన్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఉబెర్‌లో 9.3 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ద్వారా ఇటీవల కీలక సంకేతాలు అందించింది. దీనికి తోడు త్వరలో ఉబెర్ బోర్డులో చేరనున్న టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు ఊతమిచ్చాయి.
సాఫ్ట్‌బ్యాంక్ బోర్డు సభ్యుడు, త్వరలోనే ఉబెర్ బోర్డులో చేరనున్న రాజీవ్ మిశ్రా శుక్రవారం ఈ కీలక వ్యాఖ్య చేశారు. భారత్‌లో ఉబెర్ క్యాబ్ సేవలనుంచి ఇక తప్పుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎందుకంటే ఓలా ఉబెర్ మధ్య విలీన చర్చలు కొలిక్కి రానున్నట్టు పేర్కొన్నారు. ఈ విలీనం సాధ్యమైతే కాంపిటీషన్ దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. నష్టాలను తగ్గించుకునే ఉద్దేశంతో కాకపోయినప్పటికీ.. అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, అస్ట్రేలియా లాంటి మార్కెట్లకు మళ్లితే లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. అలాగే భారత టాక్సీ రంగం సాంప్రదాయిక ఆపరేటర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉబెర్ కు భారత్‌లో ఆదాయం తక్కువ. దీంతో అధిక ఆదాయ వనరుగా ఉన్న ఇతర మార్కెట్లపై దృష్టిపెట్టడం సబబే అని విశ్లేషిస్తున్నారు. సంస్థ ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు, ఆదాయం ఎక్కువగా ఉండే అమెరికా, యూరప్ మార్కెట్లపై దృష్టి కేంద్రీ కరించినట్టు భావిస్తున్నారు.
ఉబెర్ ఇండియా ప్రతినిధి ఈ విలీన వార్తలను నిరాధారమైన ఊహాగానాలుగా కొట్టిపారేశారు. భారత్‌లో తమ వ్యాపారాలు ఎప్పటికన్నా బలంగా ఉన్నాయని, ఇక్కడి రైడర్లు, డ్రైవర్ల భాగస్వామ్యాలకు 100 శాతం తాము కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ఓలా భారత్‌లో తమతో పోటీకారణంగా ఉబెర్ తన ప్రధాన మార్కెట్లకు మారే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రధానంగా డ్రైవర్లను, కస్టమర్లును ఆకట్టుకోవడానికి బిలియన్ల డాలర్ల ప్రోత్సాహకాలు, డిస్కౌంట్ల వల విసిరిందనీ ఆరోపించింది. అయితే, గత సంవత్సరకాలంగా రెండు సంస్థలు వ్యూహాత్మకంగా ప్రోత్సాహకాలు, తగ్గింపురేట్లు ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు 2019 సంవత్సరం తమకు మంచి లాభదాయకంగా ఉటుందని ఇటీవల ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఒక బిలియన్ డాలర్ల మేర విస్తరణ చేపడుతున్నామనీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు , సైకిళ్లు లాంటి నూతన సేవలను త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు.
కాగా రైడింగ్ అంచనాల ప్రకారం సుమారు 110 నగరాల్లో సేవలు అందిస్తున్న ఓలా ప్రస్తుతం మార్కెట్ లీడర్‌గా ఉంది. రోజుకు రెండు మిలియన్లకుపైగా రైడ్లను నమోదు చేస్తోంది. ఉబెర్ 25 నగరాల్లో రోజుకు ఒక మిలియనుకు పైగా రైడ్స్ సాధిస్తోంది. అమెరికా సంస్థ ఉబెర్‌లో ఉబెర్‌లో మెజారిటీ వాటాను మరో ప్రత్యర్థి కంపెనీ, రైడ్ షేరింగ్ చైనా దిగ్గజం దీదీ చుక్సింగ్స్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment