శ్రీరామరెడ్డి బాటలో నడుద్దాం
మడకశిర : స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత శ్రీరామరెడ్డి బాటలో నడుద్దామని కర్ణాటక న్యాయశాఖా మంత్రి టీబీ జయచంద్ర అన్నారు. మండలంలోని నీలకంఠాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం శ్రీరామరెడ్డి 108వ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్ణాటక మంత్రి టీబీ జయచంద్ర హాజరయ్యారు.
అంతకు ముందు టీబీ జయచంద్రతో పాటు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.సుధాకర్, శ్రీరామరెడ్డి కుటుంబ సభ్యులు సెల్వమూర్తి, డాక్టర్ జయరామ్, శ్రీరామ్, అనిల్‌కుమార్ తదితరులు శ్రీరామరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్ణాటక మంత్రి మాట్లాడుతూ శ్రీరామరెడ్డి మరణించినా ఆయన ఆశయాలు బతికే ఉన్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని కోరారు. శ్రీరామరెడ్డి వారసుడిగా ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. మడకశిర, శిర నియోజకవర్గాలు కవలపిల్లలాంటివన్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం ప్రసంగిస్తూ శ్రీరామరెడ్డి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ మాట్లాడుతూ శ్రీరామరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పీఏబీఆర్ తాగునీటి పథకానికి శ్రీరామరెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు.
రఘువీరారెడ్డి సోదరుడు సెల్వమూర్తి, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి తదితరులు ప్రసంగిస్తూ శ్రీరామరెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను కర్ణాటక మంత్రి చేతుల మీదుగా అందించారు. పాఠశాలలకు వంద శాతం హాజరైన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు.