TBGKS workers
-
ప్రజలు చీదరించుకుంటున్నా మారరా.. కేసీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కు కట్టబెడుతున్న రికార్డు విజయాలను చూశాక అయినా.. ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. సింగరేణి ఎన్నికల్లో ఎన్నో అసత్యాలు ప్రచారం చేశారని.. కనీసం ఈ ఫలితాలతోనైనా బుద్ధి మార్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. వంద శాతం హామీలు నెరవేరుస్తానని, డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా చేపడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై.. ముఖ్యంగా కాంగ్రెస్‌పై, జేఏసీ చైర్మన్ కోదండరాంపై నిప్పులు చెరిగారు. సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘‘సింగరేణి ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను.. ముఖ్యమంత్రి హోదాలో నెరవేరుస్తా. ప్రతిపక్షాలు, కొన్ని సంఘాల మాటలు వినకుండా కార్మికులు తమ భవిష్యత్తును ఆలోచించుకొని ముందుకు నడవాలి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ప్రతిపక్షాలను జనం చీదరించుకుంటున్నారు. ప్రతిపక్షాలు, సంఘాల నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారు. పూర్తి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. ఎక్కడ ఎన్నిక జరిగినా దాని నుంచే టీఆర్ఎస్ పతనం, కేసీఆర్ పతనం ప్రారంభం అంటరు. అభివృద్ధి పనులకు అడ్డం పడుతున్నరు. కుట్రలు చేస్తున్నరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చారు. రైతుల పేర్ల మీద కేసులు వేస్తరు. ఒక రైతు రోజుకు రూ.6 లక్షల ఫీజు ఇచ్చి లాయర్‌ను పెట్టుకోగలుగుతాడా? రైతులకు అంత స్థోమత ఉంటదా?.. మాకు బీజేపీ ప్రత్యామ్నాయమా? కేంద్రంలో కార్మిక మంత్రిగా దత్తాత్రేయ ఉన్నారని, సింగరేణికి ఏడు నెలలు ఎన్నికలు జరగకుండా చేశారు. బీజేపీ అధ్యక్షుడు పొద్దున్న లేస్తే చాలు తామే ప్రత్యామ్నాయం అంటూ జబ్బలు చరుచుకుంటడు. సింగరేణి ఎన్నికల్ల వాళ్లకు వచ్చిన ఓట్లు 246. వాళ్లు ప్రత్యామ్నాయమా? ఇంత దానికి గనుల మీదకు పోయి మీటింగులు. గతంలో వాళ్లంతా పొత్తుల్లేకుంట పోటీ చేసిండ్రు. ఈసారి పార్టీలన్నీ కలసి పోటీ చేసినయి. మరి అప్పుడు మాకు 5 డివిజన్లు వస్తే.. ఇప్పుడు తొమ్మిది వచ్చాయి. అప్పుడు 36 శాతం ఓట్లు వస్తే.. ఇప్పుడు 45 శాతం ఓట్లు వచ్చినయి. ఇంత మొత్తంలో ఓట్లు రావడం సింగరేణి చరిత్రలోనే లేదు. ప్రతిపక్షాల మాటలను కార్మికులు విశ్వసించడం లేదు. అయినా ప్రతిపక్షాల నేతలకు బుద్ధి రావడం లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగిపోవద్దా? రైతులకు పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.8 వేలు ఇచ్చేందుకు.. మేం భూసర్వే చేపడితే ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి. ఏదో జరుగుతోందంటూ విష ప్రచారం చేశాయి. రైతుల ఆత్మహత్యలు ఆగిపోయేలా మేం నిర్మాణాత్మక ఆలోచనలు చేస్తుంటే ఆ ప్రచారమేంటి? స్థానిక సంస్థలు ఎందుకు నిర్వీర్యమవుతాయి? దీనికి దానికి ఏం సంబంధం? ఇంత పిచ్చిగా విమర్శలు చేస్తే జనం నవ్వుకోరా? ప్రతిపక్షాలు దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశాయి. గవర్నర్ నన్ను అడిగితే.. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించాలని ఆయనను కోరిన. గవర్నర్ స్వయంగా పరిశీలించి.. అద్భుతంగా ఉందని అభినందించారు. ప్రజలు కూడా మెచ్చుకుంటున్నరు. నా ఇల్లు గడీనా..? రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తే మళ్లీ దొరల పాలన వస్తుంది, పట్వారీ పాలన వస్తుందంటూ కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఓ చిల్లర గ్యాంగ్ నేను ఓ దొరనని. నా ఇల్లు ఓ గడీ అని విమర్శలు చేస్తున్నారు. మా ఊరి జనాలకు తెలియదా? దొరతనం చేస్తే ముప్పై ఏళ్లు సిద్దిపేటలో నెగ్గుకొస్తామా? ఇదా రాజకీయం. అసలు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ దొర. తాటిపాములలో ఆయన ఇల్లు గడీ. శ్రీనగర్ కాలనీలో వాళ్ల నాయన కట్టిన ఇల్లు గడీ. వాళ్లకు ఇంత అసహనమా? ప్రజా జీవితంలో, రాజకీయాల్లో కులాలు ఉంటాయా? ఎవడైనా రావచ్చు, రాణించవచ్చు. పాయింట్ ఫైవ్ కులపోడు పాలన ఎట్ల చేస్తడని అడ్డగోలుగ మాట్లాడుతున్నరు. మరి అదే పాయింట్ ఫైవ్ కులపోడే కదా తెలంగాణ తెచ్చింది. నేను మధ్య తరగతి నుంచి వచ్చిన.. దొర అనేది ఒక కులం కాదు. ఒక ఒరవడి. బలుపున్నోడు, డబ్బున్నోడు, భూమి ఉన్నోడు దొరైతడు. విసునూరు రామచంద్రారెడ్డి దొర. నేను మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తిని. నేను మంత్రిని కావడానికి పదమూడున్నరేళ్లు పట్టింది. ఎన్టీఆర్‌కు నేనంటే అభిమానం ఉండేది. కానీ కులం లెక్కలు అడ్డం వస్తున్నయన్నడు. నాది చాలా చిన్న కులం. సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. ఈ రాష్ట్రం బలహీన వర్గాల రాష్ట్రం. 90.65 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే.. 9.35 శాతమే ఓసీలు ఉన్నారు. తెలంగాణ ఎప్పుడూ కులంతోని ప్రభావితం కాలేదు. సోషల్ మీడియాలో హద్దు దాటితే కేసులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా, కనీస సంస్కారం లేకుండా రాతలు, కూతలు చేస్తున్నరు. వర్షాలు పడితే దానిపైనా విమర్శలు చేస్తున్నరు. అమెరికా వంటి దేశమే వర్షాలు పడితే ఆగమాగమైంది. హైదారాబాద్‌లోనే ఏదో అయిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. అసలు హైదరాబాద్‌కు ఈ గతి పట్టించింది ఎవరు? నాలాలు కబ్జా అయింది ఎవరి కాలంలో? ఇంత దిక్కుమాలిన ప్రచారమా. సోషల్ మీడియాలో నిందాపూర్వక పోస్టులు పెడుతున్న అందరినీ బుక్ చేస్తం. ఎవరినీ వదిలిపెట్టం. విమర్శలకు కూడా హద్దూ, పద్దూ ఉంటది. సద్విమర్శ చేస్తే స్వీకరిస్తం. దొరా .. గొర్రెలు, బర్రెలు మాకా అని ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నరు. కించపరిచే విధంగా రాతలు రాస్తే చర్యలు తప్పవు. కోదండరాం ఊహల్లో ఉన్నడు కోదండరాం తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నడు. ఆయన చేసిన యాత్రలో ఒక్క దగ్గరైనా 500 మంది వచ్చిండ్రా? సింగరేణి ఎన్నికల్లో ఏం మాట్లాడిండు. టీబీజీకేఎస్ గెలిస్తే సింగరేణి నాశనమైతదా? నీ సక్కదనానికి జీవితంలో ఒక్కసారన్న సర్పంచిగానైనా గెలిచినవా?.. కోదండరాం పిలుపునిచ్చిండని రాస్తరు. ఆయనెవరు పిలుపివ్వడానికి..? ముఖ్యమంత్రా.? ఏదో జాతీయ నాయకుడైనట్లు పిలుపిస్తడా? ఆయనకు జేఏసీ ఎక్కడున్నది..? అసలు జేఏసీ పేరు పెట్టిందే నేను. ఫార్ములా రూపొందించిందే నేను. ఆనాడు కేంద్రం ప్రకటనను వెనక్కి తీసుకుంటుంటే.. నేను శషభిషలు లేకుండా జానారెడ్డి ఇంటికి పోయిన. తెలంగాణ రాజకీయ నాయకత్వం అంతా ఒక్కటి కావాలని పెట్టినం. జయశంకర్ సార్‌ను అడిగితే కోదండరాంను పెట్టమన్నడు. సాగరహారం ఒక్కటే కాదు అన్ని కార్యక్రమాలు వంద శాతం టీఆర్ఎస్ పార్టీనే చేసింది. త్యాగాలు చేసింది టీఆర్ఎస్. పదవులు త్యాగం చేసి పోరాడినం. బండి కింద నడుస్తున్న కుక్క ఆ బండిని తానే మోస్తున్న అనుకుంటది. కోదండరామ్ పని ఆ తీరుగ ఉన్నది. 2001లో నేను ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎక్కడున్నరు వీళ్లంతా? కోదండరాం అనే వాడు.. టీఆర్ఎస్ పట్ల విషపూరితమైన వ్యక్తి. ఉద్యమమప్పుడే రహస్య యాత్రలు చేసి దిగ్విజయ్‌ను, సోనియాగాంధీని కలిసిండు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఇష్టం లేకుండే. నేను తయారు చేసినవారిలో ఒకడు నేను తయారు చేసిన వేల మంది నాయకుల్లో, లక్షల మంది కార్యకర్తల్లో కోదండరాం ఒకడు. ఆయన చేసిందేమీ లేదు తొక్క. నా మెదడు, నా రక్తాన్ని పెట్టి 14 ఏళ్లు పనిచేసిన. తెలంగాణ తెచ్చిన. జేఏసీ పేరు ఎట్ల పెట్టుకుంటవు. నీకు ఎట్ల అర్హత ఉంది. నీ జేఏసీలో ఎవడన్నా ఉన్నడా? దిక్కుమాలినోళ్లను పెట్టుకుని ఏదో అనుకుంటే అయితదా? లక్షా 12 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నమని ఎప్పుడో చెప్పిన. అయినా ఇంకా కొలువుల కొట్లాల ఏంది? పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా ఇన్ని రోజులు సహించిన. అమరుల స్ఫూర్తి యాత్ర అని పెట్టిండు. మొట్టమొదటి అమరుడు శ్రీకాంతాచారి తల్లిని పరామర్శించినవా? హుజూర్నగర్ ఎన్నికల్లో ఒక్కనాడన్నా ఆమె కోసం మాట్లాడినవా? అమరుల స్ఫూర్తి యాత్రనా.. రాజకీయ యాత్రనా నువ్వు చేసేది? అంతగా ఆసక్తి ఉంటే రారా బాబూ అని చెప్పిన. ఎంపీ కావాలా? ఎమ్మెల్యే కావాలా ఇస్తా అన్న. ఎంతసేపు కేసీఆర్ మీద విషం కక్కుడేనా? కోదండరాం కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. చాలా చిన్నోడు. అమాయకుడేం కాదు. కాంగ్రెస్‌తో రహస్యంగా కలిశాడు. ఆయన మాటలు నమ్మే కాంగ్రెస్ నాశనమైపోయింది. లేకపోతే మాతో పొత్తు పెట్టుకుని బాగానే ఉండేది. కత్తి వెంకటస్వామికి, అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇప్పించింది కూడా ఈయనే. ఆయన సాధించిన ఘనకార్యమేంది. వాళ్ల యాత్ర బండికి ఎవని పాలైందిరో తెలంగాణ అన్న పాట పెట్టుకున్నడు. ఎవని పాలైంది తెలంగాణ? తెచ్చినోడే ఏలుతుండు తెలంగాణను. ప్రజలే అధికారం కట్టబెట్టిండ్రు. నీకు రాజకీయ బీమారి ఉంది. అలాంటోళ్లను పట్టించుకోవద్దు.. కోదండరామ్ లాంటి వాళ్లు చాలా మంది వస్తరు. జనం వారిని పట్టించుకోవాల్సిన పని లేదని చెబుతున్న. నిరుద్యోగ సోదరులకు ఒక్కటే మనవి చేస్తున్న. గవర్నమెంటు సౌలభ్యాన్ని పట్టి ఉద్యోగాలు ఇస్తది. డీఎస్సీ అర్జంట్‌గా పెట్టాలంటున్నరు. ఎట్ల పెడతరు. తొందరేముంది. డీఎస్సీ ఆలస్యమైతే ప్రపంచం మునిగిపోతదా? ఎప్పుడు పెట్టాల్నో పరిశీలిస్తున్నం.. గింతదానికే ముఖ్యమంత్రి మీద అసత్య ప్రచారం చేసుడు ఎక్కడన్నా ఉందా? పార్టీ పెట్టుడంటే.. పాన్ డబ్బా పెట్టుడా? పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టుడా? వ్యక్తులు పెడితే నడవయ్. సమీకరణ, అనుకూల పరిస్థితులు ఉండాలె. 1969లో చెన్నారెడ్డి పోలికేక పెడితే 11 ఎంపీ స్థానాల్లో గెలిచిండు. అదే ఆయన ఎన్డీపీ పార్టీ పెడితే కరీంనగర్లో చొక్కారావుపై తన సొంత సీటునే ఓడిపోయిండు. పార్టీ అంటే గ్రౌండ్ ఉండాలి. ఈక్వేషన్, సమయం ఉండాలె. అయినా తెలంగాణ గురించి ఏనాడైనా జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలోచించారా. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అన్నప్పుడు వాళ్లు ఏం చేశారు? ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నరు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జానారెడ్డికి మంత్రి పదవి రాలేదు. మేం ప్రతిపక్షంలో ఉన్నం. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లోనే లాబీలో జానారెడ్డి కలిసిండు. తెలంగాణ ఫోరం పెడుతున్నం అన్నడు. నీలాంటి దొంగలే పెట్టాల్నా అన్న.. తర్వాత ఇరవై రోజుల్లో జానారెడ్డికి వ్యవసాయ మంత్రి పదవి వచ్చింది. ఇలా ఎన్నిసార్లు జరగలేదు. కానీ నేను సీరియస్‌గా జీవిత కాల లక్ష్యం పెట్టుకుని తెలంగాణ సాధించిన. అన్ని వర్గాలూ పోరాడాయి. సింగరేణి కార్మికులు 45 రోజులు సమ్మె చేసి దేశాన్ని గడగడ లాడించిండ్రు. ఎన్నో జరిగితే, ఎందరి కృషో ఉంటే తెలంగాణ వచ్చింది. మూడేళ్లలో అయిపోతదా? రాష్ట్రం మూడేళ్లలో బంగారు తెలంగాణ అయిపోతుందా? ఆ దిశగా ప్రయాణం మొదలవుతుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సబ్సిడీ కింద బర్రెలను అందిస్తామంటే.. వి.హన్మంతరావు గొర్లు, బర్లు అయిపోయినయ్.. ఇక గాడిదలే బాకీ ఉన్నయంటడు. గతంలో మీరు (కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం పథకాలు ప్రవేశపెట్టేటోళ్లు. సంకుచితంగా పాలన చేసిండ్రు. తెలంగాణను అన్ని రకాలుగా ముంచిన, నాశనం చేసిన పార్టీ, శనిలా పట్టింది కాంగ్రెస్. అప్పుడు నెహ్రూ ఆంధ్రలో కలిపిండు. ఇందిరా గాంధీ 1969లో కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టబెట్టుకుంది. సోనియా గాంధీ తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది. మీరు చెయ్యలే.. మమ్మల్ని చెయ్యనియ్యరు.. మా హయాంలో ఏం చేయలేదు.. మీరు ఏమీ చేయొద్దు అన్నట్లుగా ఉంది ప్రతిపక్షాల తీరు. అప్పులు లేకుండా ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి పనులు సాధ్యమా..? అయినా అప్పులు వచ్చేది కేంద్రం చేతిలో ఉంటుంది. ఎంతపడితే అంత తెచ్చుకోవడం కుదురుతుందా? అయినా అన్ని లెక్కలు బాజాప్తాగా చెబుతం. కరెంట్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తుంటే ప్రజలే వద్దనేదాకా వచ్చింది. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వాసుపత్రిలో డెలివరీలు పెద్ద ఎత్తున పెరిగాయి. దీని కోసం డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్న. అరాచకం చేస్తున్నారు.. ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన వాటిలో ఒక్క మంచి పనీ లేదా? 84 లక్షల గొర్రెలు పంచితే.. కొన్నైనా చచ్చిపోవా? ప్రతిపక్షాలకు ఇదొక ఇష్యూ. వారికి ఓర్పు, సహనం లేవు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతాం, ఎన్ని అరాచకాలైనా చేస్తామన్న ధోరణిలో ప్రతిపక్షాలున్నాయి. సింగరేణి ఎన్నికల్లో డబ్బులు పంచింది వాళ్లే.. మళ్లీ టీఆర్ఎస్ పంచిందనే ప్రచారం చేసిండ్రు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి. లేకుంటే మీ పరువే పోతుంది. సింగరేణి కోసం నెలకు రెండు గంటలు ఇక నుంచి సింగరేణి కోసం ప్రతి నెలా రెండు గంటలు కేటాయిస్తా. ఏరియాల వారీగా ఉపాధ్యక్షులను నేనే నామినేట్ చేస్తా. గతంలో జరిగిన పొరపాట్లు ఇక జరగనీయం. కేవలం బొగ్గు తవ్వకమే కాకుండా సింగరేణి అభివృద్ధికి తోడ్పడుతాం. అండర్ గ్రౌండ్ మైన్లతో వచ్చే నష్టాలను ఓపెన్ కాస్ట్‌ల ద్వారా సమం చేస్తాం. కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆర్టీసీ బోర్డులో కార్మికులకు ఎలాగైతే వాటా ఉందో.. అలా సింగరేణి బోర్డులోనూ కార్మికులకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం. సింగరేణితో ఇతర దేశాల్లో ఏం చేయగలమో కూడా ఆలోచిస్తున్నాం. త్వరలో కొత్త గనులు ప్రారంభిస్తాం. కమ్యూనిస్టు పార్టీలు ప్రగతిశీలకంగా ఆలోచించాలి. అడ్డంగా పోవడం ఆపాలి. ఓడిపోయిన రెండు ఏరియాల్లోనూ అభివృద్ధి పనులు చేపడతాం. పరిటాల నా ఆత్మీయుడు పరిటాల రవి నా ఆత్మీయుడు. ఒకే కేబినెట్లో పనిచేశాం. నేను మూడేళ్లు అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రిగా పనిచేశా. పరిటాల వాళ్లింటికి వెళ్లిన. ఇప్పుడు మంత్రిగా ఉన్న సునీత చేతి అన్నం తిన్నా. అన్నా నా కొడుకు పెళ్లి. నీ దోస్తు లేడు, నువ్వు రావాలే అని సునీత ఆహ్వానించింది. వెళ్లిన. ఇంటి పక్కనే రవి సమాధి ఉంది. శ్రద్ధాంజలి ఘటించిన. రవి హత్య సమయంలో తెలంగాణ ఉద్యమంలో ఉండి వెళ్లలేక పోయిన. దీనికీ రాజకీయం చేస్తరా? ఎన్డీయే సంగతి ఎన్నికల నాటికి.. ఎన్డీయేలో మేం ఎందుకు చేరుతం. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఇప్పుడే ఏం చెబుతం. జీఎస్టీ ఒక ప్రయోగం. ఫెయిలైందా, చెడ్డదా, మంచిదా ఇప్పుడే చెప్పలేం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు అంత తేలిక కాదు. ప్రధాని కూడా మాట్లాడిండు. యూపీలో మొన్ననే కదా ఎన్నికలైంది. వాళ్లు ఒప్పుకుంటరా? మెట్రో రైలు ప్రారంభానికి నవంబర్ 28న ప్రధాని వస్తుండు. అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఈనెల 29వ తేదీలోపు ఆరునెలలు గడిచిపోతుంది కా»బట్టి నిర్వహించుకోవాలి. -
‘సింగరేణి ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
-
‘సింగరేణి ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... బలుపును చూసి వాపు అనుకోవడం పొరపాటు అని అన్నారు. గనుల్లో టీబీజీకేఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని గండ్ర ఆరోపించారు. కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడిందని, అధికార దుర్వినియోగంపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన అన్నారు. కాగా సింగరేణి ఎన్నికల్లో మొత్తం 17 కార్మిక సంఘాలు పోటీ పడగా, టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ల మధ్యే ప్రధాన పోటీ ఏర్పడింది. 11 డివిజన్లకుగానూ 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకుంది. ఏఐటీయూసీ రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది. -
సింగరేణి కార్మికులకు కేసీఆర్ వరాలు
-
సింగరేణి కార్మికులకు కేసీఆర్ వరాలు
సాక్షి హైదరాబాద్ : సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దని, తాను అధికారులతో కూడా మాట్లాడామని, వారు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ వద్దనుకునే వారికి రూ.25లక్షలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్లో మాట్లాడిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీబీజీకేఎస్ పుట్టిందని గుర్తు చేశారు. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ చాన్నాళ్లు గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, వాటి వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లు సంతకాలు చేసింది ఆ సంఘాలేనన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సమస్యలను, సింగరేణిని అర్ధం చేసుకోలేకపోయాయని చెప్పారు. కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం చేసుకోలేదని, తాము మాత్రం ఇక నుంచి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే .. 'డిపెండెంట్ ఉద్యోగాలు అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్, టీడీపీ విఫలమయ్యాయి. గతంలో పనిచేసిన కార్మిక సంఘాల వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయి. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించాలి. సింగరేణిలో ఏం చేయాలనుకుంటున్నామో మేం చెప్పదలుచుకున్నాం. అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారికి ఆక్సిజన్ అందదు. మొకాలి చిప్పలు అరుగుతాయి. రిటైర్డ్ అయిన సింగరేణి ఉద్యోగులు పదేళ్లకంటే ఎక్కువ బతకలేరు. వారికి వచ్చే జబ్బులు గతంలో ఎవరూ పట్టించుకోలేదు. మేం ఏ మంచి పనిచేద్దామన్నా వాటిని అడ్డుకునేందుకు, స్టేలు తెచ్చేందుకు కొన్ని ముఠాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇరిగేషన్, ఉద్యోగాలు, నీళ్లు అన్నింటిని అడ్డుకునేందుకు కేసులు వేసేందుకు ఆ ముఠాలు పనిచేస్తుంటాయి. జాతీయ సంఘం సాక్షిగా సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాలు కోల్పోయారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఉద్యోగం వద్దనుకునే కార్మికులకు రూ.25లక్షలు ఇస్తాం. గతంలో రూ.12వేలు ఉన్న జీతాలు ఇక నుంచి నెలకు రూ.25 వేలు అందిస్తాం. సింగరేణిలో 14 నుంచి 19 వేల మంది వేర్వేరు పేర్లతో ఉద్యోగులు ఉన్నారు. ఇక నుంచి వారిని ఒకే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం. కార్మికులకు, వారి పిల్లలకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. రూ.6లక్షల వరకు వడ్డీ లేకుండా ఇంటి లోన్లు ఇప్పిస్తాం. సింగరేణిలో లాభాలు గతంలో 16శాతం ఇచ్చేది.. దానిని 25శాతానికి పెంచాం. దసరా అడ్వాన్స్‌ను కూడా పెంచాం. వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేసేందుకు టీబీజీకేఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై మిగితా సంఘాలు తమ వైఖరి చెప్పాలి. చిల్లర రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. 3527 డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే డిస్మిస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.25లక్షలకు నష్టపరిహారం పెంచాం. టీబీజీకేఎస్ గెలిచింది ఒక్కసారి మాత్రమే. వారసత్వ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు. సాధ్యం కానిపనులు నేను చచ్చినా చెప్పను. యాజమాన్యం కొన్నిసార్లు కక్షపూరితంగా వ్యవహరించి డిస్మిస్ చేసింది. దాదాపు 500 మందిని తిరిగి చేర్పించాం. మేం వచ్చాకే దాదాపు 7వేల ఉద్యోగాలు ఇచ్చాం. నిన్నమొన్న కూడా 650' అని తెలిపారు. -
జాతీయ సంఘాలను నిలదీయండి
-
జాతీయ సంఘాలను నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను సింగరేణి కార్మికులు నిలదీయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి చెందిన పదకొండు ఏరియా కమిటీల బాధ్యులు, సెంట్రల్ కమిటీ కార్యవర్గం శనివారం టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. సింగరేణి అక్షయపాత్ర వంటిదని.. ఇప్పటికే 5,600 ఉద్యోగాలు సృష్టించామని, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఎప్పుడూ గుర్తింపు కోసం పోట్లాడుకునే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసిపోయి టీబీజీకేఎస్‌ను ఓడించేందుకు కలగంటున్నాయని, ఈ సారీ సింగరేణిపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాటి ఏఐటీయూసీ నేతలు త్యాగాలు చేస్తే, నేటితరం నేతలు భోగాలు అనుభవిస్తున్నారన్నారు. సింగరేణి కార్మికులకు గుడ్డు, పాలు బంద్ చేసినప్పుడు, డిపెండెంట్ ఉద్యోగాలు తీసేసినప్పుడు, ఈ జాతీయ సంఘాలెందుకు నోరు మెదపలేదని నిలదీశారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం.. డిపెండెంట్ ఉద్యోగాలకు కోర్టు కొంత వెసులుబాటు కల్పించిందని, కచ్చితంగా అమలు చేస్తామని, సీఎం కేసీఆర్‌కే అది సాధ్యమని కవిత అన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీలది కార్మిక కూటమి కాదని.. సీఎం కేసీఆర్ వ్యతిరేక కూటమని విమర్శించారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, జీరో వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని, దీనిపై త్వరలో సీఎం ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల క్వార్టర్లలో ఏసీ సౌకర్యం కల్పిస్తామని, బావుల్లో పనిచేసి ఆరోగ్య సమస్యలొచ్చిన వారికి వేతన రక్షణతో ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యసేవలు.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇల్లెందుకు పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి, కనకరాజు, సింగరేణి ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంతులు నాయక్, భూక్యా నాగేశ్వర్, ఎంపీ సీతారామ్ నాయక్ తదితరలు పాల్గొన్నారు. -
సీఅండ్ఎండీ కార్యాలయంలో డెరైక్టర్ల నిర్బంధం
శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్ , న్యూస్‌లైన్ : యూనియన్ల గొడవలో తలదూర్చి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రాజిరెడ్డి వర్గం నేత లు మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఆందోళనకు దిగారు. సీఅండ్ఎండీ కార్యాలయంలో డెర్టైక్టర్లను నిర్బంధించారు. డెరైక్టర్(పా) విజయ్‌కుమార్, డెరైక్టర్(ఆపరేషన్స్) బి.రమేశ్‌కుమార్, జీఎం(పర్సనల్) చంద్రమౌళిలను సీఅండ్ఎండీ రూంలో నిర్బంధించి ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ యూనియన్ అధ్యక్షుడు ఎ.కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి, నాయకులు మేడిపల్లి సంపత్, ఆగయ్య, సారంగపాణి, 11 డివిజన్ల నుంచి ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డెరైక్టర్(పా) ఇతర అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా గెలిచిన తమతో చర్చలు జరపకుండా ఓడిపోయిన వారితో చర్చలు జరపడానికి సిద్ధపడుతున్నారని దుయ్యబట్టారు. మల్లయ్య వర్గం నేతలపై పక్షపాతం వహిస్తున్నారని విమర్శించారు. గతంలో జాయింట్ మెమో ఇచ్చి 11 మందితో కూడిన అడ్‌హక్ కమిటీతో చర్చలు జరపాలని లెటర్ ఇచ్చినా కూడా చర్చలు జరపకుండా నాన్చివేత ధోరణి అవలంభించారని, ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్చలు జరపకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. వారికి అవసరం లేకున్నా యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే విధంగా వ్యవహరిస్తూ మల్లయ్య వర్గానికి కొమ్ము కాస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ రవిందర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు ఫోన్లో తెలిపారు. స్పందించిన యాజమాన్యం టీబీజీకేఎస్ ఆందోళనతో యాజమాన్యం స్పందించిందని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి తెలిపారు. ఆందోళన అనంతరం తమ యూనియన్ నేతలను ఇన్చార్జి సీఅండ్ఎండీ పిలిచి మాట్లాడారని పేర్కొన్నారు. ఇందులో డెరైక్టర్లు కూడా పాల్గొన్నారని వివరించారు. డివిజన్ స్థాయిలో జరపాలనుకున్న సమావేశాలను జరపరాదని నిర్ణయించారు. డివిజన్ స్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా కార్పోరేట్‌కు పంపిస్తే అక్కడ యాజమాన్యం వీటిని పరిష్కరించి ఓ నిర్ణయం తీసుకుంటుందని, దీంతో ఎప్పటికప్పుడు డివిజన్ సమస్యలపై కార్పొరేట్ అధికారులు దృష్టిసారించి పరిష్కరిస్తారని తెలిపారు. ఏ డివిజన్ కమిటీతో చర్చలు జరగడం లేదని పేర్కొన్నారు. -
16 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపు
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ఆశలు చిగురిస్తున్నాయి. కోల్‌బెల్ట్ ఏరియాలో ఎక్కడ విన్నా ఇదే చర్చ. పదహారేళ్లుగా నిలిచిన ఈ హక్కు మళ్లీ సిద్ధిస్తుందని కార్మికులు ఆశపడుతున్నారు. దీన్ని సాధించి తీరుతాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన గుర్తింపు సం ఘం టీబీజీకేఎస్‌కు ఇది సవాల్‌గా మారింది. కార్మికుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో 2014ను ‘డిపెండెంట్ సాధన సంవత్సరం’గా ఆ యూనియన్ ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 4 నుంచి 7 వరకు సింగరేణి వ్యాప్తంగా గనులు, డిపార్టుమెంట్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టింది. సింగరేణి యాజమాన్యానికి ఐదు జాతీయ సంఘాలకు 1998 జూన్‌లో జరిగిన ఒప్పందం వల్ల వారసత్వ ఉద్యోగాలు నిలిచాయి. ఈ ఒప్పందం ప్రకారం 1997 జూలై నాటికి 1,150 మంది డిపెండెంట్లు వెయిటింగ్లో ఉన్నారు. వీరిలో 575 మందిని ప్రతి నెల 30 మంది చొప్పున తీసుకుంటూ మిగిలిన వారికి ఉద్యోగం బదులు 24 నెలల వేతనాన్ని ఒకేసారి చెల్లిస్తూ ఒప్పందం జరిగింది. కొత్త ప్రాజెక్టులు వస్తేనే కొత్త వారిని తీసుకుంటామని ఈ ఒప్పందంలో రాసుకున్నారు. దీనిపై 5 జాతీయ సంఘాల నేతలు సంతకాలు చేశారు. అప్పటి నుంచి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్ పడింది. దీంతో తండ్రుల ఉద్యోగాలను న మ్మకున్న చాలామంది పిల్లలు నిరుద్యోగులుగా మారి రోడ్డున పడ్డారు. వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని కావున ఉద్యోగాలు రావని జాతీయ సంఘాలు నేతలు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చారు. ఈ హక్కుపైనే గెలిచిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అన్ని సంఘాలు వారసత్వ హక్కును నెత్తినెత్తుకొని ప్రచారం చేశాయి. తాము గెలిస్తే మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలపైనే చేస్తామని టీబీజీకేఎస్ కార్మికులకు హామీ ఇచ్చింది. దీంతో కార్మికులు జాతీయ సంఘాలను కాదని గంపెడాశతో ప్రాంతీయ సంఘమైన టీబీజీకేఎస్‌ను గెలిపించారు. కాని వారు గెలిచి ఏడాదిన్నర అవుతున్నా దానిపై సాధించింది శూన్యం. ఏమిటని అడిగితే యాజమాన్యంతో కమిటీ వే యించాం.. డిపెండెంట్ హక్కుపై అధ్యయనం జరుగుతోంది అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మొదటి కార్పొరేట్ స్ట్రక్చరల్ సమావేశంలో టీబీజీకేఎస్ వారసత్వ ఉద్యోగాల అంశం లేవనెత్తింది. దీంతో యాజమాన్యం ముందు ముందు గనులను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో నడపాలి కాబట్టి టెక్నాలజీ చదువులు కార్మికుల పిల్లల వద్ద లేవని తెలిపింది. కార్మికుల పిల్లలు డిప్లొమా, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువుల్లో ఉన్నారని టీబీజీకేఎస్ నేతలు సూచించారు. దీంతో కార్మికుల పిల్లల చదువుల వివరాలు సేకరించడానికి సీఅండ్ఎండీ కమిటీ వేయించారు. కమిటీ రిపోర్టు కూడా తయారు చేసింది. ఇంతలోనే గుర్తింపు సంఘం విబేధాలు రావడంతో వారు వారు తన్నుకోవడానికి కాలం సరిపోతోంది. ఇక పట్టించుకునే వారు లేరు. పెద్ద ఎత్తున రిటైర్మెంట్.. సింగరేణిలో పెద్ద ఎత్తున కార్మికులు రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నారు. ప్రస్తుతం 61,654 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లలలో సుమారు 20 వేల మంది రిటైర్మెంట్ కానున్నారు. ప్రస్తుతం సింగరేణి ఖాళీలు ఉన్నా వాటిని యాజమాన్యం భర్తీ చేయడం లేదు. కారణం మున్ముందు యంత్రీకరణ పెంచుకోనున్న దృష్ట్యా రిక్రూట్మెంట్ జోలికి పోవడం లేదు. దీనితోపాటు ఎలక్ట్రీషియన్లు, జేఎంఈటీ, ఓవరమన్లు, క్లర్కులు ఇలా కొన్ని ఉద్యోగాలు ఇటీవల భర్తీ చేస్తున్న కూడా అందులో అర్హత ఉన్న ఇంటర్నల్ వారిని కాదని భయటి వారిని తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. వారసత్వ ఉద్యోగాలు వస్తే ఈ ద్యోగాల్లోనైనా తమ కొడుకులు ఉండే వారిని కార్మికులు మధనపడుతున్నారు. మెడికల్ రూల్స్‌ను సరళతరం చేయాలి.. వారసత్వ ఉద్యోగాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని యాజమాన్యం, కార్మిక సంఘాలు చెప్పుతున్నాయి. కావున ఈ హక్కు ఎలా సాధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ రూల్స్‌ను పూర్తిగా మార్చి వీటిని సరళతరం చేస్తే అన్‌ఫిట్ ద్వారానైన ఉద్యోగాలు ఇప్పించవచ్చని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వయస్సు మీద పడ్డ తరువాత కార్మికులు జబ్బులు పడి డ్యూటీలు చేయలేని స్థితిలో ఉంటే వారిని మెడికల్ గ్రౌండ్లో అన్‌ఫిట్ చేయాలని, దీనికి కొత్తగూడెంలో కాకుండా ఎక్కడిక్కడ ఏరియా ఆస్పత్రుల్లో మెడికల్ బోర్డు సమావేశం పెట్టి అన్‌ఫిట్ చేయాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పని లేకుండా కార్మికులకు ఇలాగైన డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిన వారుతారని పలువురు భావిస్తున్నారు.