
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలను సింగరేణి కార్మికులు నిలదీయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి చెందిన పదకొండు ఏరియా కమిటీల బాధ్యులు, సెంట్రల్ కమిటీ కార్యవర్గం శనివారం టీబీజీకేఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. సింగరేణి అక్షయపాత్ర వంటిదని.. ఇప్పటికే 5,600 ఉద్యోగాలు సృష్టించామని, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఎప్పుడూ గుర్తింపు కోసం పోట్లాడుకునే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కలిసిపోయి టీబీజీకేఎస్‌ను ఓడించేందుకు కలగంటున్నాయని, ఈ సారీ సింగరేణిపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాటి ఏఐటీయూసీ నేతలు త్యాగాలు చేస్తే, నేటితరం నేతలు భోగాలు అనుభవిస్తున్నారన్నారు. సింగరేణి కార్మికులకు గుడ్డు, పాలు బంద్ చేసినప్పుడు, డిపెండెంట్ ఉద్యోగాలు తీసేసినప్పుడు, ఈ జాతీయ సంఘాలెందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం..
డిపెండెంట్ ఉద్యోగాలకు కోర్టు కొంత వెసులుబాటు కల్పించిందని, కచ్చితంగా అమలు చేస్తామని, సీఎం కేసీఆర్‌కే అది సాధ్యమని కవిత అన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీలది కార్మిక కూటమి కాదని.. సీఎం కేసీఆర్ వ్యతిరేక కూటమని విమర్శించారు. కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, జీరో వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు ఆలోచనలు జరుగుతున్నాయని, దీనిపై త్వరలో సీఎం ప్రకటన చేస్తారని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల క్వార్టర్లలో ఏసీ సౌకర్యం కల్పిస్తామని, బావుల్లో పనిచేసి ఆరోగ్య సమస్యలొచ్చిన వారికి వేతన రక్షణతో ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యసేవలు.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగుల భర్తీ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రద్దు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇల్లెందుకు పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి, కనకరాజు, సింగరేణి ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంతులు నాయక్, భూక్యా నాగేశ్వర్, ఎంపీ సీతారామ్ నాయక్ తదితరలు పాల్గొన్నారు.