సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ సర్కార్ లేకపోతే కాంగ్రెస్ దేశాన్ని ఏడు ముక్కలు చేసేదని సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రం కోసం త్యాగం చేసిన ప్రతీ ఒక్కరినీ బీఆర్‌ఎస్ మర్చిపోయిందన్నారు. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందని చెప్పుకొచ్చారు.
కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ పార్టీలో కొత్త తరం రావాలి. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతీ కార్యకర్త భాగస్వామ్యం కావాలి. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఎంఐఎపీ లేకుండా చేయాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలి. బీజేపీ లేకుంటే దేశాన్ని కాంగ్రెస్ ఏడు ముక్కలు చేసేది. చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అన్నదే బీజేపీ పార్టీ లక్ష్యం.
కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగింది. పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతీ కార్యకర్తను బీజేపీ గుర్తుంచుకుంటుంది. సభ్యత్వం చేయాలని కోరే హక్కు బీజేపీకి మాత్రమే ఉంది. సభ్యత్వ నమోదు చేసిన వారికే భవిష్యత్ ఉంటుంది. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కోసం త్యాగం చేసిన కార్యకర్తలను ఆ పార్టీ నేతలు గుర్తించుకోరు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ బీఆర్‌ఎస్ మరిచిపోయింది. కాంగ్రెస్‌కు గుర్తుకువచ్చేది కేవలం నెహ్రూ, రాజీవ్ గాంధీలే. బీఆర్‌ఎస్‌కు గుర్తుకు వచ్చేది కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావులే. ప్రస్తుతం తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా కంపెనీ అంటూ సెటైర్లు వేశారు.
కవితకు బెయిల్ రావడం బీజేపీకి ఏం సంబంధం?. రాజకీయ నాయకులు భయపడేది కేవలం న్యాయస్థానాలకే. వ్యక్తులు చెబితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయా?. న్యాయస్థానాలను అగౌరవపరచవద్దు. కవిత బెయిల్ కోసం వాదించింది అభిషేక్ సింఘ్వీ. ఆయననే ఎందుకు రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది?. బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందనే అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాట ముచ్చట అయిపోయింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసిపోవడం ఖాయం. బీజేపీ కొట్లడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment