సాక్షి హైదరాబాద్ : సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దని, తాను అధికారులతో కూడా మాట్లాడామని, వారు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ వద్దనుకునే వారికి రూ.25లక్షలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే టీబీజీకేఎస్ పుట్టిందని గుర్తు చేశారు. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ చాన్నాళ్లు గుర్తింపు సంఘాలుగా ఉన్నాయని, వాటి వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాలు వదులుకుంటున్నట్లు సంతకాలు చేసింది ఆ సంఘాలేనన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సమస్యలను, సింగరేణిని అర్ధం చేసుకోలేకపోయాయని చెప్పారు.
కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం చేసుకోలేదని, తాము మాత్రం ఇక నుంచి కార్మికుల తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే .. 'డిపెండెంట్ ఉద్యోగాలు అర్ధం చేసుకోవడంలో కాంగ్రెస్, టీడీపీ విఫలమయ్యాయి. గతంలో పనిచేసిన కార్మిక సంఘాల వల్లే వారసత్వ ఉద్యోగాలు పోయాయి. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను గెలిపించాలి. సింగరేణిలో ఏం చేయాలనుకుంటున్నామో మేం చెప్పదలుచుకున్నాం. అండర్‌గ్రౌండ్‌లో పనిచేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారికి ఆక్సిజన్ అందదు. మొకాలి చిప్పలు అరుగుతాయి. రిటైర్డ్ అయిన సింగరేణి ఉద్యోగులు పదేళ్లకంటే ఎక్కువ బతకలేరు. వారికి వచ్చే జబ్బులు గతంలో ఎవరూ పట్టించుకోలేదు. మేం ఏ మంచి పనిచేద్దామన్నా వాటిని అడ్డుకునేందుకు, స్టేలు తెచ్చేందుకు కొన్ని ముఠాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
ఇరిగేషన్, ఉద్యోగాలు, నీళ్లు అన్నింటిని అడ్డుకునేందుకు కేసులు వేసేందుకు ఆ ముఠాలు పనిచేస్తుంటాయి. జాతీయ సంఘం సాక్షిగా సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాలు కోల్పోయారు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. ఉద్యోగం వద్దనుకునే కార్మికులకు రూ.25లక్షలు ఇస్తాం. గతంలో రూ.12వేలు ఉన్న జీతాలు ఇక నుంచి నెలకు రూ.25 వేలు అందిస్తాం. సింగరేణిలో 14 నుంచి 19 వేల మంది వేర్వేరు పేర్లతో ఉద్యోగులు ఉన్నారు. ఇక నుంచి వారిని ఒకే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం. కార్మికులకు, వారి పిల్లలకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. రూ.6లక్షల వరకు వడ్డీ లేకుండా ఇంటి లోన్లు ఇప్పిస్తాం. సింగరేణిలో లాభాలు గతంలో 16శాతం ఇచ్చేది.. దానిని 25శాతానికి పెంచాం. దసరా అడ్వాన్స్‌ను కూడా పెంచాం.
వారసత్వ ఉద్యోగాల స్థానంలో కారుణ్య నియామకాలు చేసేందుకు టీబీజీకేఎస్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిపై మిగితా సంఘాలు తమ వైఖరి చెప్పాలి. చిల్లర రాజకీయాలు చేసే ఉద్దేశం నాకు లేదు. 3527 డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే డిస్మిస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు రూ.25లక్షలకు నష్టపరిహారం పెంచాం. టీబీజీకేఎస్ గెలిచింది ఒక్కసారి మాత్రమే. వారసత్వ ఉద్యోగాలు ఎక్కడికీ పోవు. సాధ్యం కానిపనులు నేను చచ్చినా చెప్పను. యాజమాన్యం కొన్నిసార్లు కక్షపూరితంగా వ్యవహరించి డిస్మిస్ చేసింది. దాదాపు 500 మందిని తిరిగి చేర్పించాం. మేం వచ్చాకే దాదాపు 7వేల ఉద్యోగాలు ఇచ్చాం. నిన్నమొన్న కూడా 650' అని తెలిపారు.
సింగరేణి కార్మికులకు కేసీఆర్ వరాలు
Published Fri, Sep 29 2017 2:53 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement