మార్పునకు నేను సై : మిస్త్రీ
టీసీఎస్ బోర్డు నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, టాటాలపై పోరును కొనసాగిస్తానని వాగ్దానం చేశారు. టీసీఎస్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ వల్ల టాటా గ్రూప్ వారసత్వ సంపదను రక్షించాలనే తన సంకల్పానికి మరింత బలం చేకూర్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు పరిపాలనలో సంస్కరణల కోసం తాను పాటుపడతానని వాగ్దానం చేశారు.
మంగళవారం జరిగిన టీసీఎస్ అసాధారణ సర్వసభ్య ఓటింగ్ ప్రక్రియలో మిస్త్రీ తొలగింపుకు మొత్తం 93.11 శాతం మంది అనుకూలంగా, 6.89 వ్యతిరేకంగాను ఓటు వేసిన సంగతి తెలిసిందే.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆయనకు మద్దతు లభించింది. రిటైల్ ఇన్వెస్టర్లు మిస్త్రీకి మద్దతిస్తూ ఆయన తొలగింపుకు వ్యతిరేకంగా 78 శాతం మంది ఓటు వేశారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఓటింగ్ ప్రక్రియ ద్వారా మైనారిటీ వాటాదారులు టాటా గ్రూప్ పాలనలో మార్పు అవసరమని బలమైన సిగ్నల్ పంపించారని మిస్త్రీ చెప్పారు. దాన్ని అశ్రద్ధ చేయకూడదని సూచించారు. టాటా గ్రూప్లో సంస్కరణల కోసం తాను కూడా తన పోరాటం కొనసాగిస్తానని మిస్త్రీ వాగ్దానం చేశారు. గ్రూప్ సంస్కరణలతో స్టాక్హోల్డర్స్ హక్కులను, పాలనను రక్షించవచ్చని చెప్పారు.