Teacher jobs Appointment
-
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
టీచర్ పోస్టుల భర్తీకి నో
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న డీఎస్సీ-14 అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారికి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో విద్యా వలంటీర్లుగా నియమిస్తామని ప్రభుత్వ ఓ ప్రకటన చేసింది. దీనిని అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే కోర్టులో ఉన్న వ్యాజ్యాలను బూచిగా చూపిస్తూ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు డొంకతిరుగుడు వ్యవహారం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో డీఎస్సీ మెరిట్లిస్ట్ కోసం వేలాదిమంది నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే సర్కారు విధానాలు వారిని వెక్కిరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్థిక భారం తగ్గించుకునేందుకే.. జిల్లాలో 662 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక్కో ఉపాధ్యాయ పోస్టుకు సగటున నెలకు రూ.25వేల వరకు వేతనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇలా నెలకు రూ.1.65 కోట్లు, ఏడాదికి రూ.19.86 కోట్లను కొత్త ఉపాధ్యాయులకు జీతాల రూపేణా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. అదే విద్యా వలంటీర్లకు అయితే గతంలో ఇచ్చిన గౌరవ వేతనం కంటే రెట్టింపు ఇచ్చినా ఒక్కొక్కరికీ రూ.7వేల చొప్పున నెలకు రూ.46.34 లక్షలు, ఏడాదికి రూ.5.56 కోట్లతో సరిపెట్టేసే అవకాశం ఉంది. గతంలో డీఎడ్ అభ్యర్థులను విద్య వలంటీర్లుగా నియమించి నెలకు రూ.2,500, బీఎడ్ అభ్యర్థులకు రూ.3,500 గౌరవ వేతనంగా చెల్లించారు. ప్రస్తుతం అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ.4,500 ఇస్తున్నారు. డీఎస్సీ-14 అభ్యర్థులను విద్యా వలంటీర్లుగా నియమించి వారికి రూ.7వేల గౌరవవేతనం నిర్ణయిస్తే సరిపోతుం దనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఉపాధ్యాయులను తగ్గించేందుకు ఇలా విద్యా వలంటీర్ల పేరుతో పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మోసగిస్తోంది నిరుద్యోగ ఉపాధ్యాయ యువతను ప్రభుత్వం కావాలనే మోసం చేస్తోంది. విద్యా వలంటీర్లుగా నియమించే పక్షంలో మాకు డీఎస్సీలో మెరిట్ వచ్చినా ఉపయోగం ఏంటి. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామనే నమ్మకంతో ఉంటే నామమాత్రపు వేతనంతో విద్యా వలంటీర్ పోస్టుతో సరిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. - ఎస్కే మస్తాన్, డీఎస్సీ అభ్యర్థి వృత్తి గౌరవాన్ని దిగజారుస్తోంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని విద్యా వలంటీర్లుగా నియమించాలనుకోవటం దారుణం. ఉపాధ్యాయ వృత్తికి ఉండే గౌరవాన్ని ప్రభుత్వం దిగజారుస్తోంది. విద్యా వలంటీర్లుగా నియమించేందుకే అయితే మాకు ఇన్ని పరీక్షలు అవసరమా? ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి. - శ్రావణి, డీఎస్సీ అభ్యర్థి ఇందుకా మేం ఇంత కష్టపడింది విద్య వలంటీర్లుగా నియమిస్తే మాకు ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుంది. ఏటా ఏప్రిల్ నెల నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించే జూన్ వరకూ వేచి ఉండాలి. చాలీచాలని జీతాలతో పనిచేసేందుకా మేం ఇంత కష్టపడింది. ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. - రాఘవేంద్రరావు, డీఎస్సీ అభ్యర్థి న్యాయ పోరాటం చేస్తాం ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 24 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసి నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది అభ్యర్థులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోరాటం చేస్తారు. - ఎస్.రాము, కన్వీనర్, డీఎస్సీ ఉద్యోగ సాధన కమిటీ