ఏలూరు సిటీ : ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న డీఎస్సీ-14 అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారికి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో విద్యా వలంటీర్లుగా నియమిస్తామని ప్రభుత్వ ఓ ప్రకటన చేసింది. దీనిని అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే కోర్టులో ఉన్న వ్యాజ్యాలను బూచిగా చూపిస్తూ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు డొంకతిరుగుడు వ్యవహారం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో డీఎస్సీ మెరిట్‌లిస్ట్ కోసం వేలాదిమంది నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే సర్కారు విధానాలు వారిని వెక్కిరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్థిక భారం తగ్గించుకునేందుకే..
జిల్లాలో 662 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఒక్కో ఉపాధ్యాయ పోస్టుకు సగటున నెలకు రూ.25వేల వరకు వేతనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇలా నెలకు రూ.1.65 కోట్లు, ఏడాదికి రూ.19.86 కోట్లను కొత్త ఉపాధ్యాయులకు జీతాల రూపేణా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. అదే విద్యా వలంటీర్లకు అయితే గతంలో ఇచ్చిన గౌరవ వేతనం కంటే రెట్టింపు ఇచ్చినా ఒక్కొక్కరికీ రూ.7వేల చొప్పున నెలకు రూ.46.34 లక్షలు, ఏడాదికి రూ.5.56 కోట్లతో సరిపెట్టేసే అవకాశం ఉంది.
గతంలో డీఎడ్ అభ్యర్థులను విద్య వలంటీర్లుగా నియమించి నెలకు రూ.2,500, బీఎడ్ అభ్యర్థులకు రూ.3,500 గౌరవ వేతనంగా చెల్లించారు. ప్రస్తుతం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.4,500 ఇస్తున్నారు. డీఎస్సీ-14 అభ్యర్థులను విద్యా వలంటీర్లుగా నియమించి వారికి రూ.7వేల గౌరవవేతనం నిర్ణయిస్తే సరిపోతుం దనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఉపాధ్యాయులను తగ్గించేందుకు ఇలా విద్యా వలంటీర్ల పేరుతో పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించిందనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వం మోసగిస్తోంది
నిరుద్యోగ ఉపాధ్యాయ యువతను ప్రభుత్వం కావాలనే మోసం చేస్తోంది. విద్యా వలంటీర్లుగా నియమించే పక్షంలో మాకు డీఎస్సీలో మెరిట్ వచ్చినా ఉపయోగం ఏంటి. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామనే నమ్మకంతో ఉంటే నామమాత్రపు వేతనంతో విద్యా వలంటీర్ పోస్టుతో సరిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. - ఎస్‌కే మస్తాన్, డీఎస్సీ అభ్యర్థి
వృత్తి గౌరవాన్ని దిగజారుస్తోంది
ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని విద్యా వలంటీర్లుగా నియమించాలనుకోవటం దారుణం. ఉపాధ్యాయ వృత్తికి ఉండే గౌరవాన్ని ప్రభుత్వం దిగజారుస్తోంది. విద్యా వలంటీర్లుగా నియమించేందుకే అయితే మాకు ఇన్ని పరీక్షలు అవసరమా? ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలి.
- శ్రావణి, డీఎస్సీ అభ్యర్థి
ఇందుకా మేం ఇంత కష్టపడింది
విద్య వలంటీర్లుగా నియమిస్తే మాకు ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంటుంది. ఏటా ఏప్రిల్ నెల నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభించే జూన్ వరకూ వేచి ఉండాలి. చాలీచాలని జీతాలతో పనిచేసేందుకా మేం ఇంత కష్టపడింది. ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి.
- రాఘవేంద్రరావు, డీఎస్సీ అభ్యర్థి
న్యాయ పోరాటం చేస్తాం
ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 24 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పోస్టులు భర్తీ చేస్తారని ఎదురుచూసి నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది అభ్యర్థులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోరాటం చేస్తారు. - ఎస్.రాము, కన్వీనర్, డీఎస్సీ ఉద్యోగ సాధన కమిటీ
టీచర్ పోస్టుల భర్తీకి నో
Published Sat, Nov 28 2015 2:59 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement