teachers associations
-
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
ఈఎస్ఆర్ నమోదుకు గడువు మూడు రోజులే
సాక్షి, అమరావతి: గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మునిసిపల్ టీచర్ల సర్వీస్ రిజిస్టర్ అప్డేట్కు ఇటీవల మున్సిపల్ శాఖ నడుంబిగించింది. మునిసిపల్ టీచర్స్ యూనియన్ నాయకుల వినతి మేరకు సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేయడంతోపాటు, ఎంప్లాయిస్ సర్వీస్ రిజిస్టర్ (ఈఎస్ఆర్) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఈ నెల 2న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఈనెల 9 తేదీలోగా పూర్తిచేయాలని అందులో పేర్కొన్నారు. నిజానికి.. ఉద్యోగం ప్రారంభం నుంచి ఏటా పొందే ఇంక్రిమెంట్లు, పీఆర్సీ, పదోన్నతులు, సెలవులు వంటి సమగ్ర సమాచారం పొందుపరిచే అధికారిక పుస్తకమే సర్వీస్ రిజిస్టర్. దీని స్థానంలో ఈఎస్ఆర్ ఆన్లైన్ పోర్టల్ విధానాన్ని 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,115 మున్సిపల్ స్కూల్స్‌లో 13వేల మందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారు. అయితే.. చాలా మున్సిపాలిటీల్లో సర్వీస్ రిజిస్టర్ నిర్వహణను అనేక ఏళ్లుగా గాలికొదిలేశారు. ఉదా.. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 500 మందికి పైగా టీచర్లు పనిచేస్తుండగా వీరి సర్వీస్ రిజిస్టర్‌ను గత ఐదేళ్లకు పైగా అప్డేట్ చేయలేదు. ఫలితంగా ఈ నెల తొమ్మిదో తేదీలోగా సర్వీస్ రిజిస్టర్ అప్డేట్, ఈఎస్ఆర్ పోర్టల్‌లో అప్లోడ్ అసాధ్యమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. డీడీఓ పవర్ లేకనే స్కూల్ ఎడ్యుకేషన్ కింద ఉండే జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో హెడ్మాస్టర్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డీడీఓ)గా వ్యవహరిస్తారు. హెడ్ మాస్టర్ తన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సర్వీస్ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ సర్వీస్ రిజిస్టర్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే, మున్సిపల్ స్కూల్స్‌లో హెడ్మాస్టర్లు డీడీఓలుగా ఉండటంలేదు. మున్సిపాలిటీలో పనిచేసే ఓ అధికారి డీడీఓగా ఉండటం, ఇతనే మున్సిపాలిటీలో పనిచేసే అందరు ఉద్యోగులకు డీడీఓగా వ్యవహరిస్తుంటారు. ఆ అధికారిపై పనిభారం పెరిగి సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ సరిగా ఉండటంలేదనే ఆరోపణలున్నాయి. హెడ్మాస్టర్లను డీడీఓలుగా ఉంచాలి టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణలో ఉన్న సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొన్నేళ్లుగా వీటి నిర్వహణలేదు. తొమ్మిదో తేదీ గడువులోగా ఈఎస్‌ఆర్‌ల నమోదు పూర్తికాదు. కాబట్టి గడువు పెంచి, టీచర్లను భాగస్వాములుగా చేసుకుని నమోదు ప్రక్రియ చేపట్టాలి. హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలివ్వాలి. – రామకృష్ణ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు
-
‘పర్యవేక్షణ’ ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతుల గందరగోళం మొదలైంది. మండల విద్యాధికారి (ఎంఈవో), ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈవో), డైట్ లెక్చరర్, బీఎడ్ కాలేజీ లెక్చరర్ వంటి పోస్టుల్లో పదోన్నతులను ఎవరికి కల్పించాలన్న విషయంలో విద్యా శాఖ తర్జన భర్జన పడుతోంది. ఎంఈవో మినహా మిగతా పోస్టులను తమకే ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు మొదటి నుంచి డిమాండ్ చేస్తుండగా.. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించినందున, త్వరగా కోర్టులో ఉన్న కేసును పరిష్కరించి అందరికీ కలిపి పదోన్నతులు ఇవ్వాలని జిల్లా పరిషత్ టీచర్లు కోరుతున్నారు. మరోవైపు తాము జోనల్ కేడర్ టీచర్లుగానే నియమితులయ్యామని, జోనల్ కేడర్‌లోని పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో తమకే పదోన్నతులు కల్పించాలని స్కూల్ అసిస్టెంట్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. జోనల్ కేడర్‌లో నియమితులైన తమకు అదే కేడర్‌లోని పాఠశాలల పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో ఎందుకు పదోన్నతులు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమ పదోన్నతులకు సర్వీసు రూల్స్‌తో సంబంధమే లేదని, అయినా తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ కిషన్‌ను కలసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరు 1997లో జోనల్ కేడర్లోనే నియమితులయ్యారా? లేదా? అన్న వివరాలను విద్యా శాఖ ఏపీపీఎస్సీ నుంచి నివేదిక తెప్పించుకుంది. 1997లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ కేడర్లోనే భర్తీ చేసినట్లు ఏపీపీఎస్సీ తమ నివేదికలో పేర్కొంది. దీంతో పర్యవేక్షణ అధికారి పోస్టులకు ఎవరితో భర్తీ చేయాలన్న గందరగోళంలో విద్యా శాఖ పడింది. మరోవైపు ఇప్పటికే పంచాయతీరాజ్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లు, జోనల్ కేడర్ టీచర్లు డిమాండ్ చేస్తుండగా, తాము ఎప్పుడో లోకల్ కేడర్ ఆర్గనైజ్‌గా ఉన్నందున తమకూ పదోన్నతులు కల్పించాలని గిరిజన టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. అసలైన అర్హులెవరు? నాలుగు రకాల సంఘాలు, ఉపాధ్యాయులు పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతులపై డిమాండ్ చేస్తుండగా.. పదోన్నతులు పొందేందుకు అసలైన అర్హులెవరు అన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం వివిధ కోణాల్లో పరిశీలన జరుపుతోంది. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపకల్పనకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో పంచాయ తీరాజ్ టీచర్లలో ఎక్కువ మందికి పదోన్నతులు లభిస్తాయని ఆనందపడ్డారు. ఈలోగా రాష్ట్రపతి ఏకీకృత సర్వీసు రూల్స్‌కు ఎలా ఆమోదం తెలుపుతారంటూ ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కేసు విచారణకు తీసుకుంది. కొద్ది రోజుల్లో ఆ వివాదం పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో.. ఈలోగా రూల్స్‌ను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కొత్త రాష్ట్రం.. కొత్త రూల్స్!
* ఏకీకృత సర్వీస్ రూల్స్, నిబంధనల సరళీకరణపై సర్కారు దృష్టి * మండల, జిల్లా పరిషత్ టీచర్లకు స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తింపు * తద్వారా ఉపాధ్యాయులందరికీ ఒకే రూల్స్ తెచ్చే యోచన * మార్పుచేర్పులకు అవకాశమిస్తున్న రాష్ర్ట విభజన చట్టం * అధికార వర్గాల కసరత్తు, చివరగా రాష్ర్టపతి ఆమోదం తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు తీరని కోరికగానే మిగిలిపోయిన ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు రాష్ట్ర విభజన చట్టమే మార్గం చూపుతోందా? ఈ చట్టాన్ని అధ్యయనం చేస్తున్న అధికార వర్గాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏకీకృత రూల్స్ ఆచరణ సాధ్యమేనని చెబుతున్నాయి. రాష్ర్టపతి ఉత్తర్వులు అక్కర్లేకుండానే దీన్ని అమల్లోకి తీసుకురావచ్చుననీ, చివరి దశలో రాష్ట్రపతి ఆమోదం అవసరముంటుందని చెబుతున్నాయి. ఈ మేరకు కొత్త రాష్ర్టంలో కొత్త సర్వీసు రూల్స్ అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న నిబంధనల సరళీకరణపై కసరత్తు మొదలుపెట్టింది. ఉపాధ్యాయుల విషయంలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ని తెస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ర్ట విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం.. ప్రస్తుతమున్న రూల్స్‌ను యథాతథంగా లేదా సవరణలతో రెండేళ్లలో వర్తింపజేసుకోవాల్సి ఉంది. దీని ఆధారంగా ఉద్యోగుల ప్రాథమిక, విధానపరమైన, సెలవు సంబంధిత నిబంధనల సరళీకరణతోపాటు ఏకీకృత సర్వీసు రూల్స్‌పై రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మండల పరిషత్(ఎంపీ), జిల్లా పరిషత్(జెడ్పీ) టీచర్ల కేడర్‌ను స్టేట్ లోకల్ కేడర్‌గా గుర్తించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంకా బ్రిటీష్ కాలంనాటి నిబంధనలే.. బ్రిటీష్ కాలం(1933)లో అప్పటి మద్రాసు రాష్ట్రంలో అమలు చేసిన ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌నే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలోనూ పెద్దగా మార్పులు చేయలేదు. ఓక్కో శాఖలో ఒక్కో రకంగా రూల్స్ ఉండటం, అంశాలవారీగా కూడా వేర్వేరు నిబంధనలు ఉండటంతో వివాదాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం లీవ్ రూల్స్, క్రమశిక్షణా ఉల్లంఘన కేసులకు సంబంధించి సీసీఏ రూల్స్, నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వేర్వేరు రూల్స్, మినిస్ట్రియల్ సర్వీసు రూల్స్, స్టేట్ సబార్డినేట్ సర్వీసు రూల్స్, విభాగాల వారీగా మినహాయింపులు పొందిన రూల్స్ వంటివి వేర్వేరుగా అమల్లో ఉన్నాయి. దీంతో వీటిని వీలైనంతగా సరళీకరించేందుకు, ఏకీకృతం చేసేందుకు తెలంగాణ సర్కారు క సరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎంఈవో, డీఈవో పోస్టులను స్టేట్ లోకల్ కేడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా గుర్తించారు. కానీ మండల, జిల్లా పరిషత్ టీచర్లు మాత్రం స్థానిక సంస్థల పరిధిలోనే ఉన్నారు. దీంతో వీరికి వేర్వేరు రూల్స్ అమలులో ఉన్నాయి. నిజానికి వీటన్నింటినీ ఏకీకృతం చేసేందుకు 1981లోనే అప్పటి ప్రభుత్వం జీవో 168ని జారీ చేసింది. అయితే అందుకు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకోలేదు. అయితే ఎంఈవో, డీఈవో పోస్టుల్లో ఎంపీ, జెడ్పీ టీచర్లు వస్తే తమకు నష్టం జరుగుతుందని, పైగా సర్వీసు రూల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయని అడ్డు చెప్పారు. దీంతో హైకోర్టు కూడా ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించింది. ఆ తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం అక్కడే పెండింగ్‌లో ఉంది. విభజన నేపథ్యంలో మార్పులపై కసరత్తు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త సర్వీసు రూల్స్ రూపొందించుకునే అవకాశం చిక్కింది. నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మార్పులు చేయొచ్చు. అవసరమైతే కొత్తవి రూపొందించుకోవచ్చు. దీంతో ఈ అంశంపై త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇక టీచర్ల ఏకీకృత రూల్స్ విషయంలో మండల, జిల్లా పరిషత్ టీచర్ పోస్టులను కూడా రాష్ర్ట స్థాయి లోకల్ కేడర్‌గా మార్చాలని సర్కారు యోచిస్తోంది. తద్వారా టీచర్లందరికీ ఒకే సర్వీసు రూల్స్‌ని తేవచ్చునని భావిస్తోంది. దీనిపై విద్యా శాఖ అధికారులు కమిటీగా ఏర్పడి ఏకీకృత సర్వీసు రూల్స్‌పై ముసాయిదాను రూపొందించే యత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు.