విలువలు నేర్పాల్సింది టీచర్లే
రాష్ట్రపతి ప్రణబ్ ఉద్ఘాటన
జాతీయ ఉత్తమ టీచర్ల అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో విలువలు పెంచే బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుల అవసరం దేశానికి ఎంతగానో ఉందని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. త్యాగం, సహనం, కరుణ, బహుళత్వం లాంటి ఉన్నత విలువలతో విద్యను బోధించి కుల, మత, లింగ వివక్ష లాంటి హద్దులను వారి మనసుల నుంచి చెరిపేయాలని పిలుపునిచ్చారు. నేటి విద్యాసంస్థలు.. తక్షశిల, నలంద, విక్రమశిల లాంటి ప్రాచీన విద్యా సంస్థలను ఆదర్శంగా తీసుకొని నాటి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడారు. విలువలతో కూడిన, లక్ష్యం వైపు తీసుకెళ్లే, స్వయంప్రేరణతో, ఫలితం సాధించగలిగే సామర్థ్యమున్న వ్యక్తే స్ఫూర్తిమంతమైన ఉపాధ్యాయుడని ఆయన అభివర్ణించారు. బాధ్యతాయుతమైన టీచర్ ఒక్కో విద్యార్థి వ్యక్తిగత లక్ష్యాలను సమాజ, దేశ లక్ష్యాలకు అనుసంధానం చేయగలడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన.. 2014 సంవత్సరానికిగాను 300 మందికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను ప్రదానం చేశారు. వెండి పతకం, ధ్రువపత్రంలోపాటు రూ.50 వేల చొప్పున నగదు అందజేశారు.