పిల్లలే ఉపాధ్యాయుల తొలి గురువులు
సందర్భం
పాఠశాల పాలకవర్గం ఉపాధ్యాయుని కళ్ల ముందు కనపడదు. పిల్లలు అనుక్షణం కనపడతారు. అందుకే చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థుల సాంగత్యంతో తమను తాము మలుచుకుంటారు. తన తరగతిని ఉత్సాహంగా ఉంచటానికి ఉపాధ్యాయుడు ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది. దేనికోసం? రాబోయే నూతన సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయుడు నిలబడతాడు. ఉపాధ్యాయుడు కావాలనుకునేవాడు ఈ ఇబ్బందులు పడేందుకు సిద్ధపడాలి.
విద్యార్థిని ఉపాధ్యాయుడు ఎంత చెక్కుతాడో దానికన్నా రెట్టింపుగా విద్యార్థి కూడా ఉపాధ్యాయుడిని చెక్కు తాడు. విద్యార్థి ప్రతి ఉపా ధ్యాయుడు చెప్పే మాటలను వినయంగా వింటాడు. కానీ ఉపాధ్యాయుడు ప్రతి ఘడి యలో శల్యపరీక్షకు కూడా గురవుతాడు. తరగతి గదిలో ఉండే 40 మంది టీచర్‌ను చూస్తూ ఉంటారు. టీచర్ చెప్పిన మాటలను సంబంధిత టీచర్ ఆచరిస్తు న్నారా? అని తరగతి, విద్యార్థుల కళ్లు చూస్తుం టాయి. ఉపాధ్యాయుడు చెప్పిన మాటలకు ఆచర ణకు తేడా కన్పిస్తే ఈ ఉపాధ్యాయుడొక కృత్రిమ మనిషి (హిపోక్రాటిక్) అనుకుంటారు. సిగరెట్ తాగవద్దని తరగతి గదిలో పిల్లలకు బోధ చేశాక సంబంధిత టీచర్ సిగరెట్ తాగుతున్నాడా, లేదా? అని పిల్లలు కచ్చితంగా గమనిస్తుంటారు. దానికి తేడా వస్తే అయ్యగారి మాటలన్నీ మనకు చెప్పే ప్రవచనాలని అంటారు. కొంతమంది పిల్లలు బాహాటంగా అడుగుతారు. ‘‘సార్ మీరు మాకు క్లాసులో చెప్పింది ఏమిటి? చేస్తుందేమిటి?’’ అని వారు నిలదీస్తారు కూడా.
‘‘చెప్పింది మీకు రా! చేసేది మేమురా!!’’ మాటలకు, చేతలకు తేడా ఉంటుందని ఉపాధ్యా యుడు అన్నాడనుకోండి. ‘‘వినేది మేము కదా! మేం క్లాసులో కూర్చున్నందుకు డబ్బేమైనా ఇస్తున్నావా? కిరాయి మనుషులనుకుంటున్నావా?’’ అని పిల్లలు అనే అవకాశం కూడా ఉంటుంది. పైకి అలా చెప్పే ధైర్యం లేకపోయినప్పటికీ మనసులో తప్పకుండా వారికి అదే భావన ఉంటుంది.
కాబట్టి విద్యార్థికి ఉపాధ్యాయునికుండే సం బంధం చాలా సున్నితమైనది. తను చెప్పే ప్రతి మాటపై ఉపాధ్యాయులకు జవాబుదారీతనం తప్ప కుండా ఉండాలి. అలా జవాబుదారీతనం లేకుండా తరగతి గదిలో పాఠం చెప్పటం చాలా కష్టమైన పని.
నేను ప్రభుత్వ సిలబస్ చదువు చెబుతున్నానని ఉపాధ్యాయుడు అనవచ్చును. ‘‘నువ్వు చెప్పిన పాఠాన్ని నేను పరీక్షల్లో కక్కేస్తానని’’ పిల్లలూ అనవచ్చును.
కాబట్టి మనం చెప్పిన పాఠం ప్రభావం పిల్లలపై జీవితాంతం ఉండాలంటే తొలుత ఉపాధ్యాయుడు ఆచరణధారి కావాలి. సమాజంలో జరిగే ఎన్నో కార్యక్రమాలను పాఠంతో జోడించి ఉపాధ్యాయుడు ఛలోక్తులు వేస్తాడు. కొన్ని సందర్భాలలో నిరసిస్తాడు. బైటకు వెళ్లిన తర్వాత విద్యార్థి చెప్పిన పాఠాన్ని ప్రమాణంగా తీసుకుని వాటిని ఆచరిస్తాడు. కాబట్టి ఉపాధ్యాయుణ్ని ఎంతోమంది బైట నుంచి ప్రశ్నించే వారుంటారు. అందుకే ఉపాధ్యాయునికి అకడమిక్ ఫ్రీడమ్ అవసరం.
ఉపాధ్యాయుడు భవిష్యత్తును నిర్మించే మనిషి ఆవిర్భవించే సమాజాన్ని చూస్తాడు. తన పాఠానికి కొన్ని మానవతా విలువలను కూడా జోడిస్తాడు. ఆ మానవతా విలువలకు వర్తమాన కాలపు పరిస్థితులు అనుకూలించకపోతే ఉపాధ్యాయుణ్నే దోషిగా చూడ టం ఎంత వరకు న్యాయం? భవిష్యత్తును నిర్మించే వాడు ఉత్తమ పౌరుడు కావాలనే భావనతో ఉపాధ్యా యుడు సమాజంలో కనపడుతున్న దురలవాట్లను, చెడు సంప్రదాయాలను నిరసిస్తాడు. తరగతి బైట కూడా వాటిని ఖండిస్తాడు. ఉపాధ్యాయుడు తన వృత్తి జీవితంలో నిత్యం రెండు కత్తులపైన సవారీ చేయాల్సి వస్తుంది.
1) ప్రభుత్వ నిబంధనలు
2) విద్యార్థులను రాబోయే కాలానికి తయారు చేసే బాధ్యత. ఈ రెండింటి మధ్య ఉపాధ్యాయుడు సవారీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు చాలా మంది ఈ రెండింటిలో విద్యార్థుల వైపే మొగ్గుతారు. పాఠశాల పాలకవర్గం ఉపాధ్యాయుని కళ్ల ముందు కనపడదు. పిల్లలు అనుక్షణం కనపడతారు. అందుకే చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులతోడిగా తమను తాము మలుచుకుంటారు. తన మాటలకు, ఆచరణకు, ఏ మాత్రం తేడా వచ్చినా తరగతి గదిలో తన పిల్లలను దొర్లించుకోలేడు. నేను టీచర్‌గా చేరక ముందు అందరి మాదిరిగానే నాలో చిలిపి చేష్టలు చాలా ఉండేవి. నేను చెప్పే పాఠం పిల్లలకు ఆకళింపు కావాలనే ఆదుర్దాయే నన్ను సరైన బాటలో పెట్టింది. ఈ రోజు మీ కళ్ల ముందు కనపడే రామయ్య ఎంత మంది విద్యార్థులతోటి సాంగత్యంతో తన్ను తాను మల్చుకుని ఉంటాడో మీరు ఆలోచించండి.
తన తరగతిని ఉత్సాహంగా ఉంచటానికి ఉపా ధ్యాయుడు ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది. దేనికోసం? రాబోయే నూతన సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయుడు నిలబడతాడు. ఉపాధ్యాయుడు కావాలనుకునేవాడు ఈ ఇబ్బం దులు పడేందుకు సిద్ధపడాలి. ఫెరా, చామ్స్కీ ల్లాంటి ఎంతో మంది చేసిన త్యాగాలే ఉపాధ్యాయ వర్గానికి ఆదర్శం కావాలి. తాత్కాలిక లాభాల కోసమై శాశ్వ తమైన భవిష్యత్తును మనం తాకట్టుపెట్ట కూడదు. అదే ఉపాధ్యాయ వృత్తి నాకు ఈ జీవితంలో నేర్పింది.
(వ్యాసకర్త : చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు)