Teachers transfer counseling
-
వరంగల్ డీఈవో సస్పెన్షన్
* రేపో మాపో మెదక్ డీఈవోపైనా వేటు! * టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత బదిలీల స్థానాలను మార్పు చేసినందుకు వరంగల్ డీఈవో చంద్రమోహన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే మార్పులకు పాల్పడినట్లు.. భారీగా ముడుపులు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టిన విద్యా శాఖ బదిలీ అయినవారి స్థానాలను మార్చేసినట్లు తేలడంతో తదుపరి చర్యలకోసం సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసి జిల్లాను వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. వరంగల్ ఆర్జేడీని ఇన్చార్జి డీఈవోగా నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో 135 జారీ చేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు డీఈవోలు తెరతీయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో వరంగల్‌తోపాటు సీఎం కేసీఆర్ జిల్లా అయిన మెదక్‌లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కాగా, వరంగల్ డీఈవోను సస్పెండ్ చేయగా, మెదక్ డీఈవో రాజేశ్వర్‌రావు నేతృత్వంలో జరిగిన బదిలీల్లో అక్రమాలపైనా పాఠశాల విద్య అదనపు డెరైక్టర్ సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. హేతుబద్దీకరణ ఉత్తర్వుల ప్రకారం ఒక్క స్కూల్‌ను కూడా మూసివేయవద్దని నిబంధనలు ఉన్నా.. ఒక ఉర్దూ స్కూల్‌ను రేషనలైజే షన్లో రద్దు చేసి, అందులోని టీచర్లను హైదరాబాద్ సమీపంలోని స్కూళ్లకు పంపించిన ట్లు ఆరోపణలున్నాయి. అయా స్కూళ్లలో ఉర్దూ మీడియం లేకపోయినా కావాలనే హైదరాబాద్ సమీపానికి బదిలీ చేసినట్లు తెలుస్తోం ది. ఈ వ్యవహారంలోనూ భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. విచారణ బృందం ఆదివారం లేదా సోమవారం నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నారు. దీంతో ఆయనపైనా వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబా ద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా బదిలీల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాల్లో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత డీఈవోలపై ఎలాంటి చర్యలు చేపడతారన్నది వేచి చూడాల్సిందే. -
వేటు ఖాయం!
డీఈఓపై చర్యకు రంగం సిద్ధం టీచర్ల కౌన్సెలింగ్‌లో అక్రమాల ఫలితం ముగిసిన అధికారుల విచారణ తవ్వినకొద్దీ వెలుగుచూస్తున్న అవకతవకలు సంగారెడ్డి: ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో జరిగిన అక్రమాలకు బాధ్యుణ్ని చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్‌లో జరిగిన అక్రమాలపై ఆర్జేడీ సుధాకర్, ఓపెన్ స్కూల్ జాయింట్ డెరైక్టర్ కృష్ణారావులు శుక్రవారం ఉదయం 11గంటల నుంచి శనివారం తెల్లవారు జాము వరకు సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా పోస్టుల రేషనలైజేషన్ జీఓ 11 ప్రకారం జరగాల్సిన ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం కొంతమంది ఉపాధ్యాయులకు అనుకూలమైన స్థలాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఉపాధ్యాయ యూనియన్ నుంచి నలుగురు సంఘం బాధ్యుల పేరిట అదనపు పాయింట్లు ఇచ్చి బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. అలాగే స్పౌజ్ పాయింట్ల కేటాయింపుల్లో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, భార్యభర్తలిద్దరూ స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయినట్లు భొగట్టా. ముఖ్యంగా ఉర్దూ మీడియం టీచర్లను నిబంధనలకు తెలుగు మీడియం పాఠశాలల్లోకి బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. -
ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో గందరగోళం
నల్లగొండ రూరల్ : ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం గందరగోళం, ధర్నాలు, వాగ్వాదాలు, ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా వాతావరణం ఉత్కంఠకు దారితీసి సోమవారానికి వాయిదా పడింది. రేషనలైజేషన్‌లో ఎత్తేసిన స్కూళ్ల జాబితాలను ముందుగా ప్రకటించకపోవడంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌లో పాల్గొని అనుకూలమైన ప్రాంతాలు లభించకపోవడంతో నాట్ విల్లింగ్ పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే రేషనలైజేషన్‌లో స్కూళ్లు ఎత్తేసినట్లుగా ఆన్లైన్లో సమాచారం ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. స్పౌజ్ కేసుల్లో కూడా స్పష్టత లేకపోవడం వివాదాస్పదంగా మారింది. గంటకో నిబంధన, పూటకో రూలు అమలు చేయడం, మొత్తం మీద కౌన్సెలింగ్ గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది. తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు ఉపాధ్యాయులు పెట్రోల్ సీసాతో ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టడం ఉపాధ్యాయుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు సమాచారం ఇవ్వడంతో కౌన్సెలింగ్ హాల్లో ఉండి పర్యవేక్షించారు. పారదర్శకంగా నిబంధనల ప్రకారం ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్సీ పూల రవీందర్.. డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఏజేసీ వెంకట్రావ్‌లకు సూచించారు. ఇదే విషయమై ఆయన కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాయి. పీఆర్టీయూ, ఎస్టీయూ, ఆపస్, పీఈటీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీకి అనుకూలంగా నినాదాలు చేశాయి. ఈదశలో ఉపాధ్యాయ సంఘాలు రెండుగా చీలి పోటా పోటీ ధర్నాలకు తెర తీశాయి. ఆత్మహత్యాయత్నం.. నకిరేకల్ బాలికల హైస్కూల్‌ను రేషనలైజేషన్‌లో ఎత్తేశారు. అక్కడ పనిచేస్తున్న స్వరూప ఈ విషయం తెలియకపోవడంతో సాధారణ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. స్పౌజ్ కేసును పరిగణించాలని కేతేపల్లిలో పనిచేస్తున్న భర్త శ్రీనివాస్ డీఈఓను అభ్యర్థించారు. దీనికి డీఈఓ నిరాకరించారు. దీంతో భర్త శ్రీనివాస్ తనకు న్యాయం జరగలేదని ఆవేదనతో పెట్రోల్ సీసాతో ఎమ్మెల్సీ పూల రవీందర్ ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కాళ్లావేళ్లా పడ్డా డీఈఓ కనికరించకపోవడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రేషనలైజేషన్‌లో హైస్కూల్‌ను తొలగిస్తున్నట్లుగా ఆన్లైన్లో లేకపోవడం, ఉపాధ్యాయులకు సమాచారం లేకపోవడంతో గందరగోళానికి దారితీసింది. అదే విధంగా బాలికల హైస్కూల్ రేషనలైజేషన్‌లో ఉంది. ఈ విషయం ముందుగానే ప్రకటించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఖాళీల జాబితాను ముందుగానే ప్రకటించకపోవడంతో డీఈఓ తీరుకు నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండిపడ్డాయి. డీఈఓ వద్ద ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను బహిర్గతం చేయాలని, స్పౌజ్ జాబితాను 2008 నుంచి ప్రకటించాలని, రేషనలైజేషన్ పాఠశాల జాబితాను బహిర్గతం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీ పూల రవీందర్ అధికారులకు సూచించారు. ఆదివారం జరగాల్సిన గణితం, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారానికి వాయిదా పడింది. ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు.. ఎమ్మెల్సీ రవీందర్‌కు వ్యతిరేకంగా సభ్యులు లేని కొన్ని సంఘాలు పనిగట్టుకుని కౌన్సెలింగ్‌లో గందరగోళం సృష్టించడాన్ని ఖండిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు భిక్షపతి, నర్సిరెడ్డి, భిక్షంగౌడ్, కృష్ణమూర్తిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బదిలీల కౌన్సెలింగ్ వాయిదా
నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ వాయిదా పడింది. స్పౌజ్ కేటగిరీలో మార్పులు చేస్తూ విద్యాశాఖ డెరైక్టర్ నుంచి బుధవారం స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాయి. అదీగాక ఉపాధ్యాయుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నందున వాటిన్నింటినీ సరిచేసి తుది సీనియారిటీ జాబితాను తయారు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ముందు ప్రకటించిన ప్రకారం కాకుండా జిల్లా విద్యాశాఖ రోజువారీ తాత్కాలిక షెడ్యూల్ ఖరారు చేస్తూ బుధవారం రాత్రి 9గంటలకు ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 తేదీ నాటికి పూర్తికావాల్సిన బదిలీల ప్రకియ కాస్తా 18వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి రోజుకు వెయ్యి మంది చొప్పున బదిలీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి ఇది కష్టసాధ్యమవు తుందని అధికారులు చెబుతున్నారు. ఎస్జీటీల కౌన్సెలింగ్ విషయంలోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 20 నాటికి పూర్తియ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే బుధవారం స్కూల్ అసిస్టెంట్ 56 మందికి హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. సాయత్రం 6.30 గంటలకు మొదలైన కౌన్సెలింగ్ రాత్రి 9. 30 గంటలకు పూర్తిచేశారు. స్పౌజ్ కేటగిరీలో మార్పు.. నిన్నమొన్నటి వరకు స్పౌజ్ కేటగిరీలో భార్యభర్త ఇద్దరికి అవకాశం కల్పించారు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే స్పౌజ్ కేటగిరీకి వర్తింపజేయాలని డెరైక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ కేటగిరీలో ఇద్దరు దరఖాస్తు చేసుకున్న టీచర్లను సీనియారిటీ జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. ఈ క్రమంలో స్పౌజ్ కేటగిరీ టీచర్ల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాల్సి రావడంతో బుధ వారం ప్రకటించాల్సిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ తుది జాబితాను గురువారానికి వాయిదా వేశారు. అలాగే గురువారం జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను శుక్రవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. -
బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం
నల్లగొండ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్ శిక్షణ కేంద్రంలో మధ్యాహ్నాం 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్ఆర్టీ డెరైక్టర్ జగన్నాథ్‌రెడ్డి, డీఈఓ ఎస్.విశ్వనాథ్‌రావు పర్యవేక్షణలో కౌన్సెలింగ్ జరిగింది. తొలుత కౌన్సెలింగ్‌లో స్పౌజ్ కేటగిరీ, ప్రత్యేక కేటగిరీల హెచ్ఎంలకు ప్రాధాన్యత కల్పించారు. ఎనిమిదేళ్ల సర్వీసు దాటిన హెచ్ఎంలు 399 మందిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ కొనసాగించారు. కాగా బుధవారం స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలకు పదోన్నతి కల్పించనున్నారు. పదోన్నతి పొందే వారిలో ఎస్ఏలు 50 మంది వరకు ఉన్నారు. ఇదిలా ఉంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్ల సీనియారిటీ తుది జాబితా ఇంకా ఓ కొలిక్కిరాలేదు. దీంతోపాటు ఎస్జీటీలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా కుప్పులు తెప్పలుగా వస్తుండటంతో వాటిని పరిష్కరించేందుకు విద్యాశాఖకు ఎక్కువ సమయం పడుతోంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ దరఖాస్తు సమయంలో అనేక పొరపాట్లు దొర్లడంతో వాటిని సరిచేయడంతోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. 4,650 మంది ఎస్జీటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా...వాటిల్లో తెలుగు మీడియానికి బదులు ఇంగ్లీషు మీడియం అని ఉపాధ్యాయులు ఆన్లైన్లో ఎంటర్ చేశారు. దీంతో వాటిని సరిచేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. మంగళవారం ప్రకటించాల్సిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను బుధవారం ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. సంఘాల సందడి... చాలాకాలం తర్వాత బదిలీల కౌన్సెలింగ్ జరుగుతుండడంతో ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయా సంఘాల ఫ్లెక్సీలతో టీచర్లకు స్వాగతం పలికేవిధంగా ఏర్పాట్లు చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమ టిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు నర్సిరెడ్డి, ఎస్టీయూ, టీపీటీఎఫ్ నాయకులు జెల్లా చంద్రమౌళి, పన్నాల గోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగాలి
రామగిరి : జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నాల గోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులను కౌన్సెలింగ్ కంటే ఒకరోజు ముందే స్వీకరించాని, ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మార్పులు-చేర్పులు చేయరాదన్నారు. స్పౌజ్ ప్రాధాన్యం కలిగిన ఉపాధ్యాయుల విషయంలో నిబంధనల ప్రకారం మాత్రమే కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. 30వ తేదీ జూన్ 2015 వరకు విద్యార్థుల సంఖ్య ప్రకారం సక్సెస్ పాఠశాలలు కొనసాగించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో రేషనలైజేషన్ గుర్తించిన తర్వాత ఆ పాఠశాలలో ప్రమోషన్ పొందిన ఎస్జీటీని సర్ప్లెస్గా గుర్తించాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆర్.రాంనర్సయ్య, కె.యల్లారెడ్డి, ఎం.వెంకట్‌రెడ్డి, కె.రత్నయ్య, పి.ముత్తయ్య, బుచ్చిరెడ్డి, సైదులు, దుర్గాప్రసాద్, భిక్షం, వీరన్న, అంజయ్య పాల్గొన్నారు.