నల్లగొండ: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ వాయిదా పడింది. స్పౌజ్ కేటగిరీలో మార్పులు చేస్తూ విద్యాశాఖ డెరైక్టర్ నుంచి బుధవారం స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాయి. అదీగాక ఉపాధ్యాయుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నందున వాటిన్నింటినీ సరిచేసి తుది సీనియారిటీ జాబితాను తయారు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ముందు ప్రకటించిన ప్రకారం కాకుండా జిల్లా విద్యాశాఖ రోజువారీ తాత్కాలిక షెడ్యూల్ ఖరారు చేస్తూ బుధవారం రాత్రి 9గంటలకు ప్రకటించింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 తేదీ నాటికి పూర్తికావాల్సిన బదిలీల ప్రకియ కాస్తా 18వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చింది.
ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కలిపి రోజుకు వెయ్యి మంది చొప్పున బదిలీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి ఇది కష్టసాధ్యమవు తుందని అధికారులు చెబుతున్నారు. ఎస్‌జీటీల కౌన్సెలింగ్ విషయంలోనే గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 20 నాటికి పూర్తియ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే బుధవారం స్కూల్ అసిస్టెంట్ 56 మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించారు. సాయత్రం 6.30 గంటలకు మొదలైన కౌన్సెలింగ్ రాత్రి 9. 30 గంటలకు పూర్తిచేశారు.
స్పౌజ్ కేటగిరీలో మార్పు..
నిన్నమొన్నటి వరకు స్పౌజ్ కేటగిరీలో భార్యభర్త ఇద్దరికి అవకాశం కల్పించారు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే స్పౌజ్ కేటగిరీకి వర్తింపజేయాలని డెరైక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ కేటగిరీలో ఇద్దరు దరఖాస్తు చేసుకున్న టీచర్లను సీనియారిటీ జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. ఈ క్రమంలో స్పౌజ్ కేటగిరీ టీచర్ల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాల్సి రావడంతో బుధ వారం ప్రకటించాల్సిన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ తుది జాబితాను గురువారానికి వాయిదా వేశారు. అలాగే గురువారం జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్‌ల బదిలీలను శుక్రవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
బదిలీల కౌన్సెలింగ్ వాయిదా
Published Thu, Jul 9 2015 3:13 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement