వేటు ఖాయం!
డీఈఓపై చర్యకు రంగం సిద్ధం
టీచర్ల కౌన్సెలింగ్‌లో అక్రమాల ఫలితం
ముగిసిన అధికారుల విచారణ
తవ్వినకొద్దీ వెలుగుచూస్తున్న అవకతవకలు
సంగారెడ్డి: ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో జరిగిన అక్రమాలకు బాధ్యుణ్ని చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిపై సస్పెన్షన్ లేదా బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్‌లో జరిగిన అక్రమాలపై ఆర్జేడీ సుధాకర్, ఓపెన్ స్కూల్ జాయింట్ డెరైక్టర్ కృష్ణారావులు శుక్రవారం ఉదయం 11గంటల నుంచి శనివారం తెల్లవారు జాము వరకు సుదీర్ఘ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా పోస్టుల రేషనలైజేషన్ జీఓ 11 ప్రకారం జరగాల్సిన ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం కొంతమంది ఉపాధ్యాయులకు అనుకూలమైన స్థలాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణలున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఉపాధ్యాయ యూనియన్ నుంచి నలుగురు సంఘం బాధ్యుల పేరిట అదనపు పాయింట్లు ఇచ్చి బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. అలాగే స్పౌజ్ పాయింట్ల కేటాయింపుల్లో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, భార్యభర్తలిద్దరూ స్పౌజ్ పాయింట్లు వినియోగించుకుని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అయినట్లు భొగట్టా. ముఖ్యంగా ఉర్దూ మీడియం టీచర్లను నిబంధనలకు తెలుగు మీడియం పాఠశాలల్లోకి బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది.