అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్
-
సరండర్ చేయడానికి వెనకాడను
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
ప్రభుత్వ భూముల విషయంలో అవకతవకలకు పాల్పడే వారిని సస్పెండ్ లేదా సరండర్ చేయడానికి వెనకడబోనని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తహసీల్దార్లను హెచ్చరించారు. గురువారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశం(ఆర్‌ఓస్ కాన్ఫరెన్స్)లో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ భూములకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చి ఉన్నాయన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఒక నెల్లో ప్రభుత్వ భూములుగా ఉంటున్నాయని, మరుసటి నెల్లో పట్టాభూములుగా మారుతున్నాయన్నారు. అవి మళ్లీ ప్రభుత్వ భూములుగా ఎలా మారుతున్నాయని తహసీల్దార్లను ప్రశ్నించారు. పొరపాటు జరిగిన తరువాత మాకు సంబంధం లేదు.. డిజిటల్ కీ కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉంటుందని కుంటి సాకులు చెబితే సహించేదిలేదని హెచ్చరించారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారన్నారు. స్మార్ట్ ఫోన్లు వినియోగించే విషయంలో మీకు ఎవరు శిక్షణ ఇచ్చారని ప్రశ్నించారు. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇ–ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఇకపై ప్రతిదీ కలెక్టరేట్‌కు ఇ–ఆఫీస్‌లో పంపించాలన్నారు. పాతపద్ధతిలో పంపితే తిరిగి పంపుతామని హెచ్చరించారు. భూ సేకరణ, భూ వ్యవహరాలకు సంబంధించిన విషయాలు నా దృష్టికి రాలేదనే సాకులు చెప్పవద్దన్నారు. భూ సేకరణకు సంబంధించి కోర్డు ఆర్డర్ ఉంటే సేకరణ నిలుపుదల చేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించి, అందరి చేత సంతకాలు సేకరించి మినిట్స్ రికార్డులో నమోదు చేయాలన్నారు. స్మార్ట్ పల్స్‌సర్వేను వేగవంతం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రేషన్‌కార్డుల యూనిట్లు తొలగిపోతున్నాయన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో పరిశీలించి కారణాలు సేకరించాలన్నారు. వాటిని ప్రభుత్వానికి పంపించి అటువంటి తొలగింపులు జరగకుండా ప్రజాపంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం స్మార్ట్ పల్స్‌సర్వే, ప్రభుత్వ భూములు, ఇ–ఆఫీస్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఆర్‌డీఓలు వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, నరసింహన్, శివనాయక్, డీఎస్‌ఓ టి.ధర్మారెడ్డి, డీఎం కొండయ్య వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.