సస్పెండ్ అయినట్టా..విధుల్లో ఉన్నట్టా..?
సస్పెండ్ అయినట్టా..విధుల్లో ఉన్నట్టా..?
Published Thu, Sep 1 2016 11:23 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ముప్పాళ్ళ (గుంటూరు): మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి.ఉషారాణి సస్పెన్షన్ వ్యవహారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు తరచూ గైర్హాజరవడంతో పాటుగా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం,ప్రభుత్వం నిర్వహించే ప్రజా సాధికార సర్వే నిర్వహణ కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వంటి చర్యలపై కలెక్టర్ ఆగ్రహానికి గురై సస్పెన్షన్ కు ఆదేశించారు. అభివృద్ధి పథకాల అమలులో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అందిన ఫిర్యాదుల మేరకు జెడ్పీ సీఈఓ ఎస్.వెంకటసుబ్బయ్యను విచారణకు పంపించారు. విచారణలో భాగంగా ఆయన కార్యాలయానికి వచ్చి సిబ్బందిని వివరాలు నమోదు చేసుకొని సంబంధిత రికార్డులను తనతోపాటుగా తీసుకెళ్లారు. ఎంపీడీవో ఉషారాణికి ప్రజాప్రతినిధుల అండ మెండుగా ఉండడంతో రాత్రికి రాత్రే సస్పెన్షన్ రద్దయినట్టుగా స్థానిక నేతలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె విధులకు హాజరయ్యారు. సస్పెండ్ అంటూ పత్రికలలో వార్త వచ్చినరోజే విధులకు
హాజరవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఎంపీడీవో సస్పెండ్ అయినట్టా...విధుల్లో ఉన్నట్టా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటు ఉద్యోగవర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంపీడీవోను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని అధికార పార్టీ నేతలు బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనార్హం.
సస్పెన్షన్‌పై నాకెలాంటి ఆదేశాలు అందలేదు : ఎంపీడీవో
తనను సస్పెండ్ చేసినట్టు గాని, చర్యలు తీసుకుంటున్నట్టు గాని తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, రోజువారీ విధుల్లో బాగంగానే స్మార్ట్ సర్వేను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో టి.ఉషారాణి తెలిపారు.
Advertisement