కొలిక్కివచ్చిన బదిలీల తంతు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించి ఏర్పడిన గందరగోళం కొలిక్కివచ్చింది. ప్రభుత్వం పలుమార్లు ఇచ్చిన జీఓలు, వాటి అమలు షెడ్యూళ్లను ఉపాధ్యాయవర్గాలు వ్యతిరేకించడంతో వాటిని రద్దుచేస్తూ వచ్చింది. తాజాగా జరిగిన చర్చలు ఫలించడంతో హేతుబద్ధీకరణ, బదిలీల కోసం తాజా గా 42, 43 జీఓలు, అమలు షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యాశాఖాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇటీవల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు జరిపిన చర్చల ప్రకారం పలు అంశాలకు మినహాయింపు ఇచ్చారు. మెజార్టీ ఉపాధ్యాయుల కోరిక మేరకు సాధారణ విధానంలోనే బదిలీలు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బదిలీ షెడ్యూల్ ఇలా....:
బదిలీలకు సంబంధించి పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి సోమవారం విడుదల చేసిన షెడ్యూల్ ఇలా ఉంది. జీఓ 42 ప్రకారం ఉపాధ్యాయులు, పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను ఈ నెల 8వ తేదీలోగా పూర్తి చేయాలి. సవరించిన అంశాల జీఓ 43 ప్రకారం ఉపాధ్యాయులకు లభించే ఎంటైటిల్మెంట్ పాయింట్లను ఈ నెల 6 లోగా పునర్నిర్మాణం చేయాలి. ఎంటైటిల్మెంట్ పాయింట్ల ధ్రువపత్రాలను సంబంధిత అధికారులు ఈ నెల 7 నుంచి 10 మధ్యలో ధ్రువీకరించాలి.
అలాగే వీటిని జిల్లా స్థాయిలో 11,12 తేదీల్లో ధ్రువీకరించాలి. 13, 14వ తేదీలలో సీనియార్టీ జాబితా విడుదల చేసి 14నుంచి 16 లోగా అభ్యంతరాలు స్వీకరించాలి. సీనియార్టీ తుది జాబితాను ఈ నెల 17న విడుదల చేస్తారు. జిల్లాలోని వివిధ కేటగిరీ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ఈ నెల 14న గాని తర్వాత గాని ప్రకటించాల్సి ఉంది. మాన్యువల్ విధానంలోనే జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో తొలుత ఈ నెల 18న ప్రధానోపాధ్యాయులకు.. 19, 20వ తేదీలలో స్కూల్ అసిస్టెంట్లు(లాంగ్వేజెస్) ..21, 22 తేదీలలో స్కూల్ అసిస్టెంట్లు (నాన్ లాంగ్వేజెస్)..22 నుంచి 26 వరకు పీఈటీలు, ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ఉంటుంది.
పోస్టుల కేటాయింపులకు ప్రమాణాలు
తాజా జీఓల హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది, ఉన్నత పాఠశాలలో ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున అదనపు పోస్టును కేటాయిస్తారు. దీని ప్రభావం వల్ల జిల్లాలో అన్ని కేటగిరీలు కలుపుకొని 75 మంది టీచర్ల మిగులు పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా 10 ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడే అవకాశాలున్నాయి. ప్రాథమిక పాఠశాలల విలీనం విషయంలో గతంలో జారీచేసిన మార్గదర్శకాల్లో ఏవిధమైన మార్పులు లేకపోవడంతో జిల్లాలో ఏ ఒక్క పాఠశాలా మూతపడదు.
ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ప్రవేశాలతో కలిసి నమోదు 80 మంది అంతకంటే ఎక్కువ ఉండే ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలు పరిగణించి ఎస్జీటీ పోస్టులను మంజూరు చేస్తారు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు హిందీ పండిట్ పోస్టు తప్పనిసరి చేశారు. ప్రతిభా పాయింట్ల తగ్గింపుపై ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖపై ఒత్తిడి తీసుకురావడంతో స్పందించిన అధికారులు వాటిని 30 శాతానికి తగ్గించారు.