team director
-
కుంబ్లేకు కొత్త హోదా
టీమిండియాలో పలు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ కోచ్ పదవిలో ఉన్న అనిల్ కుంబ్లేను మార్చి, ఆయన స్థానంలోకి రాహుల్ ద్రవిడ్‌ను తీసుకొస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అండర్ 19 జట్టును సమర్థంగా నడిపించిన ద్రవిడ్.. సీనియర్లకు కూడా పాఠాలు చెప్పగలడన్న నమ్మకంతోనే అతడిని తీసుకొస్తున్నారని భావించారు. మరి ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న అనిల్ కుంబ్లేను ఏం చేస్తారన్న ప్రశ్నలు ఈ సందర్భంలో తలెత్తాయి. కుంబ్లేను కూడా పక్కన పెట్టేది ఏమీ లేదని.. ఆయనకు టీం డైరెక్టర్ పదవి అప్పగిస్తారని తాజాగా వినవస్తోంది. టీం డైరెక్టర్‌గా రవిశాస్త్రి పదవీ కాలం 2016లోనే ముగిసిపోయింది. అప్పటినుంచి జట్టుకు డైరెక్టర్ ఎవరూ లేరు. ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా.. ఆ స్థానంలోకి ఇప్పుడు అనిల్ కుంబ్లేను తీసుకొస్తారని అంటున్నారు. కుంబ్లే కోచింగ్‌లో 2016 సంవత్సరం మొత్తమ్మీద భారత జట్టు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూడలేదు. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్.. ఇలా వరుసపెట్టి అన్ని దేశాలతోనూ సిరీస్‌లు గెలుచుకుంటూ వచ్చింది. అలాగే రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఇండియా అండర్ -19 జట్టు కూడా చాలా పటిష్ఠంగా తయారైంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జట్టు పాలకమండలిని పూర్తిగా మార్చాలన్న ఉద్దేశంలో బీసీసీఐ కనిపిస్తోంది. అందులో భాగంగానే కుంబ్లేను టీం డైరెక్టర్‌గా నియమిస్తారని, ద్రవిడ్‌ను సీనియర్ జట్టుకు కోచ్‌గా తీసుకొస్తారని చెబుతున్నారు. బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా సంచలన విజయం సాధించిన తర్వాత.. అనిల్ కుంబ్లేను పిలిచి ప్రస్తుతం భారత జట్లన్నింటి పరిస్థితి మీద సమగ్ర నివేదిక ఒకటి ఇవ్వాలని కోరారు. దాంతో సీనియర్, జూనియర్ మహిళా జట్లన్నింటి గురించి సమగ్ర అవగాహన కుంబ్లేకు ఎంతవరకు ఉందో చూసే అవకాశం కూడా బీసీసీఐ పెద్దలకు వస్తుంది. కొత్త కాంట్రాక్టులు ఇచ్చే సమయానికల్లా మార్పులన్నీ చేయడం ఖాయమని అంటున్నారు. కుంబ్లే, ద్రవిడ్‌ల కొత్త నియామకాలతో పాటు.. క్రికెట్ అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ కమిటీలో మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లతో పాటు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. వాళ్లంతా కలిసి కుంబ్లేను 2016లో కోచ్‌గా చేశారు. -
'రవిశాస్త్రి రోల్ అమోఘం'
న్యూఢిల్లీ: టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిపై మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి పాత్ర అమోఘమని కొనియాడాడు. ప్రస్తుతం జట్టు డైరెక్టర్ గా రవిశాస్త్రికి తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. పూర్తి స్థాయి బాధ్యతలను అప్పచెబితే బాగుంటుందన్నాడు. కాగా, వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ నిష్క్రమణపై మాత్రం రాహుల్ ఏ విధమైన స్పందనా తెలియజేయలేదు. ' ఆ ఓటమిపై మీడియాలో వచ్చిన వార్తలపై మాట్లాడదలుచుకోలేదు. అయితే వరల్డ్ కప్ లో టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పాత్ర మాత్రం నిజంగా వెలకట్టలేనిది. అతని అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు' అని రాహుల్ తెలిపాడు. ఇటీవల రాహుల్ ద్రవిడ్ ఇండియా -ఎ , అండర్ -19 జట్టులకు కోచ్ గా ఎంపికయ్యాడు. -
కోహ్లి శైలి ప్రత్యేకం
సిడ్నీ: టెస్టు క్రికెట్లో భారత జట్టు మంచి ఫలితాలు సాధించాలంటే మరింత శ్రమించాల్సి ఉందని టీమ్ డెరైక్టర్, మాజీ ఆటగాడు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రెగ్యులర్‌గా 20 వికెట్లు తీయగల బౌలర్లను గుర్తించి తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఒక్కో కెప్టెన్‌కు ఒక్కో రకమైన శైలి ఉంటుందని, కోహ్లి కూడా తన తరహాలో జట్టును నడిపిస్తాడని శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ధోని రిటైర్మెంట్, జట్టులో వివాదాలు, టెస్టు జట్టు భవిష్యత్తుపై ఈ మాజీ ఆల్‌రౌండర్ ‘క్రిక్ఇన్ఫో’ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ధోని రిటైర్మెంట్ ప్రకటన ఎలా అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ అతని ప్రవర్తనలో గానీ దీనికి సంబంధించి ఏమైనా సూచనలు కనిపించాయా? అస్సలు లేదు. నిజంగా మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆకాశం నుంచి ఊడి పడ్డట్లు నిర్ణయం వెలువడింది. మ్యాచ్ ప్రజెంటేషన్ నుంచి తిరిగొచ్చాకే నాతో పాటు సహచరులకు ఈ మాట చెప్పాడు. అతను తన కుటుంబసభ్యులతో కూడా మాట్లాడలేదని నాకు తెలిసింది. తన ఆటకు, జట్టుకు న్యాయం చేయలేకపోతున్నానని అతను భావించాడు. అందుకే ఆటగాడిగా కూడా తప్పుకున్నాడు. కానీ సిరీస్ మధ్యలో తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది కదా? రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే అత్యుత్తమ ఆటగాళ్లకు తాము ఎప్పుడు వెళ్లిపోవాలో తెలుసు. దీనిని ఎవరూ ప్రశ్నించలేరు. ఇది అనూహ్య నిర్ణయమే కావచ్చు కానీ చాలా ధైర్యంతో కూడుకున్నది. ఈ విషయంలో అతను చాలా మంది కంటే ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 100 టెస్టులు పూర్తి చేయడం లాంటి అర్థంపర్థం లేని గణాంకాల కోసం ధోని ఎదురు చూడలేదు. అభిమానుల మధ్య వీడ్కోలు లాంటివి కోరుకోలేదు. అతను ఎంత ప్రత్యేకమైన వ్యక్తో దీన్ని బట్టి చెప్పవచ్చు. కానీ కోహ్లికి పెరుగుతున్న ఆదరణ, మీ బహిరంగ మద్దతు వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి ఆధిపత్యం పెరిగిందని, అదే రిటైర్మెంట్కు కారణమని వినిపిస్తోంది? ఆ వదంతుల గురించి నేనూ విన్నాను. కానీ అవన్నీ కేవలం చెత్త కబుర్లు మాత్రమే! క్రికెట్ అంశాలపై కూడా ధోని, కోహ్లి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అసలు ధోని మాటకు ఎంత గౌరవం, విలువ ఉంటుందో మీకెవ్వరికీ తెలీదు. విరాట్ ఒక్కడే కాదు, జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మొత్తం అతడిని చాలా గౌరవిస్తారు. ధోని ఇంకా జట్టుతోనే ఉన్నాడా? ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు కానీ జట్టుతో కాదు. సాహాకు గాయంలాంటిది అయితే సమస్య అవుతుందని కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే స్టాండ్‌బైగా ఉండమన్నాం. ఒక టెస్టు క్రికెటర్‌గా ధోని గురించి ఏం చెబుతారు? అతను భారత అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడు కాదని వాదోపవాదాలు ఉన్నాయి. అయితే అతను ఎవరికీ తక్కువ కాడనేది నా అభిప్రాయం. అదృష్టవశాత్తూ కెప్టెన్సీ నుంచి సూపర్ స్టార్డం తెచ్చుకోవడం వరకు, ఎలాంటి అహం లేకుండా జట్టును నడిపించిన తీరు, అంకితభావంలాంటివి అతడి ప్రత్యేకతను, స్వభావాన్ని సూచిస్తాయి. అయితే అప్పుడే ఏమైంది. ఇంకా వన్డేల్లో అతను మహారాజులాగా చాలా కాలం ఆడగలడు. కెప్టెన్‌గా కోహ్లి తన ముద్ర వేసే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అంతా మార్చేయడు కదా? ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటివారు కావచ్చు కానీ నాకు తెలిసి అలాం టిది జరగదు. నా కెరీర్లో చాలా మంది కెప్టెన్ల నేతృత్వంలో ఆడాను. అం దరూ ఒకేలా ఉండరు. ఎవరి శైలిలో వారు పని చేస్తారు. పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను మలచుకొని జట్టుకు ఉపయోగపడేలా చేయడమే ముఖ్యం. కానీ దుందుడుకు స్వభావం ఉంటే నడిపించడం కష్టం కదా. బ్రిస్బేన్ టెస్టు తర్వాత అసలు కోహ్లి, ధావన్ మధ్య ఏం జరిగింది? మీలాంటి వాళ్లు ఈ కథకు స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. అసలు అదంతా అర్థం లేనిది. వారిద్దరు కనీసం ఒక్క మాట కూడా అనుకోలేదు. కోహ్లి ఐదేళ్లుగా జట్టు సభ్యుడు. అందరికీ అతనేంటో బాగా తెలుసు. కొంత మంది అండర్-19 స్థాయిలో కూడా కోహ్లి కెప్టెన్సీలో ఆడారు. దూకుడుగా ఉండటం సరే, కానీ ఆస్ట్రేలియన్లపై అతను చేసిన వ్యాఖ్యలు సరైనవా? అలా చేసినా సిరీస్ చేజారింది కదా? కోహ్లి అలాంటివాడే. అతను దూకుడుగా ఉండటాన్ని ఇష్ట పడతాడు. ఏ మాటకైనా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. అతని వయసు 26 ఏళ్లు. ఇంకా కెప్టెన్సీ అలవాటు కాలేదు కదా. సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించలేదు. కాస్త అదృష్టం కలిసొస్తే ఫలితం భిన్నంగా ఉండేది. ఈ కుర్ర జట్టు అప్పుడే అందరిలో నమ్మకాన్ని పెంచగలిగింది. భవిష్యత్తులో భారత టెస్టు క్రికెట్ ఎలా ఉండబోతోంది? ఇంకా చాలా శ్రమించాల్సి ఉందనడంలో సందేహం లేదు. ప్రాథమికంగా మంచి బౌలర్లను వెతికి పట్టుకోవాల్సి ఉంది. నిలకడగా టెస్టులో 20 వికెట్లు తీయగల సత్తా ఉండాలి. దూకుడుగా, దూసుకుపోయే తత్వం కూడా జట్టుకు రావాలి. ఫలితాల కోసం మరో ఏడాది పాటు వేచి చూడాల్సిందే. అయితే ఈ విషయంలో నేను చాలా ఆశాభావంతో ఉన్నాను. జట్టు భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన పని లేదు. -
జట్టు బాధ్యత నాదే!
* ఆటగాళ్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపాలి * రవిశాస్త్రి ఇంటర్వ్యూ లండన్: ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పైనే. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ అధికారాలను కత్తిరించి.. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని నియమించడంతో ఈ భారత మాజీ కెప్టెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 25న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో రవిశాస్త్రి పోషించబోయే పాత్ర ఏమిటి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు? ఆయన ముందున్న లక్ష్యాలేమిటి? తదితర అంశాలతో రవిశాస్త్రి ఇంటర్వ్యూ క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడం వెనుక ఏం జరిగింది? భారత క్రికెట్‌కు ఇది చాలా ముఖ్యమైన సమయం. టీమ్ డెరైక్టర్‌గా ఉండమని బోర్డు నుంచి పిలుపొచ్చింది. క్లిష్టమైన ఈ సమయంలో నా వంతు సహకారం అందించాలనుకున్నా. అందుకే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీసీసీఐ. తొలుత రాష్ట్రానికి, ఆ తర్వాత దేశానికి భారత జట్టు తరఫున సేవలందించా. కష్టాల్లో ఉన్న జట్టుకు అండగా నిలుస్తా. పూర్తిస్థాయి కోచ్‌ను నియమించే వరకు జట్టుతో కొనసాగుతారా? ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ వరకే జట్టుకు డెరైక్టర్‌గా కొనసాగుతా. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేను ఈ సిరీస్ కోసం ప్రసారకర్తల నుంచి అనుమతి కూడా తీసుకున్నా. సిరీస్‌లో మీ పాత్ర ఏమిటి? కోచ్ ఫ్లెచర్ స్థానం మారిందా? జట్టు బాధ్యతలన్నీ నేనే చూస్తా. అయితే డంకన్ ఫ్లెచర్ పాత్రలో మార్పేమీ లేదు. ఆయన చీఫ్ కోచ్‌గా కొనసాగుతారు. మంగళవారం ఫ్లెచర్‌తో పాటు ధోనితో మాట్లాడా. ఫ్లెచర్ చాలా కాలం నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్నారు. ఆయనపై ఆటగాళ్లకు గౌరవం ఉంది. వన్డే సిరీస్‌లో ఫ్లెచర్ ఆధ్వర్యంలో ఇద్దరు సహాయక కోచ్‌లు పనిచేస్తారు. టెస్టు సిరీస్‌లో ఘోర వైఫల్యం తర్వాత జట్టు కోల్పోయిన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావడమే మా లక్ష్యం. తద్వారా ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో బాగా ఆడగలుగుతారు. సహాయ కోచ్‌లుగా భారత్‌కు చెందిన వారిని నియమించడానికి కారణమేంటి? ఇప్పుడున్న సపోర్టింగ్ స్టాఫ్‌ను మార్చి భారత్‌కు చెందిన వారిని సహాయ కోచ్‌లుగా నియమించాలన్న ఆలోచన నాదే. ఈ పర్యటనలో సహాయ కోచ్‌లు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. అందుకే కొత్త వారిని నియమించాల్సి వచ్చింది. టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత జట్టులో తీవ్ర భయాందోళన నెలకొన్నట్లుంది? అలాంటిదేమీ లేదు. అసలు భయాందోళన చెందాల్సిన అవసరమేముంది. గెలుపోటములు సహజమే. జట్టులో ప్రతిభావంతమైన ఆటగాళ్లున్నారు. ఇది యువ ఆటగాళ్లతో కూడిన జట్టనే విషయం మర్చిపోవద్దు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం భారత జట్టులో సంధికాలం కొనసాగుతోంది. కుదురుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అందరూ ఓపిక పట్టాలి. అప్పుడే ఆటగాళ్లు తమ సత్తా ఏంటో చూపగలుగుతారు. లార్డ్స్‌లో సంచలనం సృష్టించిన భారత జట్టు ఆ తర్వాత ఎందుకు నీరుగారిపోయింది? క్రికెట్‌తో నాకు 35 ఏళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఇప్పటిదాకా విదేశాల్లో భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయం లార్డ్స్ టెస్టే. ఇంతటి ఘనత సాధించిన జట్టును వరుస పరాజయాలు వెక్కిరించాయి. ఇందుకు కారణం అనుభవలేమేనని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇదే ఈ సిరీస్‌లో భారత జట్టును ముంచింది. సిరీస్‌లో వెనకబడి ఉన్న దశలో ఇంగ్లండ్ స్వింగ్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేసింది భారత్‌ను దెబ్బకొట్టింది.. దీనిపై మీ అభిప్రాయమేంటి? సహజంగానే విదేశాల్లో జీవం ఉన్న పిచ్‌లు ఉంటాయి. ఆటగాళ్ల అనుభవలేమీ భారత్‌ను దెబ్బతీసింది. ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిస్వింగ్, పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు తయారు చేశారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న అండర్సన్, బ్రాడ్ భారత్‌ను పేకమేడలా కూల్చారు. వోక్స్, జోర్డాన్ తమవంతు సహకారం అందించారు. వచ్చే ఏడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్‌కు ఇలాంటి పిచ్‌లనే తయారు చేయమనండి. అప్పుడు వారికి అసలు సంగతేంటో తెలిసొస్తుంది. ఈ పిచ్‌లపై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడం గ్యారంటీ. అదే జరిగితే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. ఇంగ్లండ్ చేతిలో ఓటమిని అభిమానులు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? లార్డ్స్‌లో విజయం తర్వాత భారత జట్టుపై అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ సిరీస్ ముగిసే సరికి పరిస్థితి మారిపోయింది. 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే... ఇంగ్లండ్ చేతిలో పోరాడకుండానే ఓడిపోయారనే బాధ అభిమానుల్లో ఉంది. అందుకే వాళ్లు దారుణ పరాజయాల్ని జీర్ణించుకోలేకపోతున్నారు.