కోహ్లి శైలి ప్రత్యేకం
సిడ్నీ: టెస్టు క్రికెట్‌లో భారత జట్టు మంచి ఫలితాలు సాధించాలంటే మరింత శ్రమించాల్సి ఉందని టీమ్ డెరైక్టర్, మాజీ ఆటగాడు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రెగ్యులర్‌గా 20 వికెట్లు తీయగల బౌలర్లను గుర్తించి తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఒక్కో కెప్టెన్‌కు ఒక్కో రకమైన శైలి ఉంటుందని, కోహ్లి కూడా తన తరహాలో జట్టును నడిపిస్తాడని శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ధోని రిటైర్మెంట్, జట్టులో వివాదాలు, టెస్టు జట్టు భవిష్యత్తుపై ఈ మాజీ ఆల్‌రౌండర్ ‘క్రిక్‌ఇన్ఫో’ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...
ధోని రిటైర్మెంట్ ప్రకటన ఎలా అనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ అతని ప్రవర్తనలో గానీ దీనికి సంబంధించి ఏమైనా సూచనలు కనిపించాయా?
అస్సలు లేదు. నిజంగా మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆకాశం నుంచి ఊడి పడ్డట్లు నిర్ణయం వెలువడింది. మ్యాచ్ ప్రజెంటేషన్ నుంచి తిరిగొచ్చాకే నాతో పాటు సహచరులకు ఈ మాట చెప్పాడు. అతను తన కుటుంబసభ్యులతో కూడా మాట్లాడలేదని నాకు తెలిసింది. తన ఆటకు, జట్టుకు న్యాయం చేయలేకపోతున్నానని అతను భావించాడు. అందుకే ఆటగాడిగా కూడా తప్పుకున్నాడు.
కానీ సిరీస్ మధ్యలో తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది కదా?
రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే అత్యుత్తమ ఆటగాళ్లకు తాము ఎప్పుడు వెళ్లిపోవాలో తెలుసు. దీనిని ఎవరూ ప్రశ్నించలేరు. ఇది అనూహ్య నిర్ణయమే కావచ్చు కానీ చాలా ధైర్యంతో కూడుకున్నది. ఈ విషయంలో అతను చాలా మంది కంటే ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 100 టెస్టులు పూర్తి చేయడం లాంటి అర్థంపర్థం లేని గణాంకాల కోసం ధోని ఎదురు చూడలేదు. అభిమానుల మధ్య వీడ్కోలు లాంటివి కోరుకోలేదు. అతను ఎంత ప్రత్యేకమైన వ్యక్తో దీన్ని బట్టి చెప్పవచ్చు.
కానీ కోహ్లికి పెరుగుతున్న ఆదరణ, మీ బహిరంగ మద్దతు వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి ఆధిపత్యం పెరిగిందని, అదే రిటైర్మెంట్‌కు కారణమని వినిపిస్తోంది?
ఆ వదంతుల గురించి నేనూ విన్నాను. కానీ అవన్నీ కేవలం చెత్త కబుర్లు మాత్రమే! క్రికెట్ అంశాలపై కూడా ధోని, కోహ్లి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అసలు ధోని మాటకు ఎంత గౌరవం, విలువ ఉంటుందో మీకెవ్వరికీ తెలీదు. విరాట్ ఒక్కడే కాదు, జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది మొత్తం అతడిని చాలా గౌరవిస్తారు.
ధోని ఇంకా జట్టుతోనే ఉన్నాడా?
ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు కానీ జట్టుతో కాదు. సాహాకు గాయంలాంటిది అయితే సమస్య అవుతుందని కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే స్టాండ్‌బైగా ఉండమన్నాం.
ఒక టెస్టు క్రికెటర్‌గా ధోని గురించి ఏం చెబుతారు?
అతను భారత అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో ఒకడు కాదని వాదోపవాదాలు ఉన్నాయి. అయితే అతను ఎవరికీ తక్కువ కాడనేది నా అభిప్రాయం. అదృష్టవశాత్తూ కెప్టెన్సీ నుంచి సూపర్ స్టార్‌డం తెచ్చుకోవడం వరకు, ఎలాంటి అహం లేకుండా జట్టును నడిపించిన తీరు, అంకితభావంలాంటివి అతడి ప్రత్యేకతను, స్వభావాన్ని సూచిస్తాయి. అయితే అప్పుడే ఏమైంది. ఇంకా వన్డేల్లో అతను మహారాజులాగా చాలా కాలం ఆడగలడు.
కెప్టెన్‌గా కోహ్లి తన ముద్ర వేసే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అంతా మార్చేయడు కదా?
ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాంటివారు కావచ్చు కానీ నాకు తెలిసి అలాం టిది జరగదు. నా కెరీర్‌లో చాలా మంది కెప్టెన్ల నేతృత్వంలో ఆడాను. అం దరూ ఒకేలా ఉండరు. ఎవరి శైలిలో వారు పని చేస్తారు. పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లను మలచుకొని జట్టుకు ఉపయోగపడేలా చేయడమే ముఖ్యం.
కానీ దుందుడుకు స్వభావం ఉంటే నడిపించడం కష్టం కదా. బ్రిస్బేన్ టెస్టు తర్వాత అసలు కోహ్లి, ధావన్ మధ్య ఏం జరిగింది?
మీలాంటి వాళ్లు ఈ కథకు స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. అసలు అదంతా అర్థం లేనిది. వారిద్దరు కనీసం ఒక్క మాట కూడా అనుకోలేదు. కోహ్లి ఐదేళ్లుగా జట్టు సభ్యుడు. అందరికీ అతనేంటో బాగా తెలుసు. కొంత మంది అండర్-19 స్థాయిలో కూడా కోహ్లి కెప్టెన్సీలో ఆడారు.
దూకుడుగా ఉండటం సరే, కానీ ఆస్ట్రేలియన్లపై అతను చేసిన వ్యాఖ్యలు సరైనవా? అలా చేసినా సిరీస్ చేజారింది కదా?
కోహ్లి అలాంటివాడే. అతను దూకుడుగా ఉండటాన్ని ఇష్ట పడతాడు. ఏ మాటకైనా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. అతని వయసు 26 ఏళ్లు. ఇంకా కెప్టెన్సీ అలవాటు కాలేదు కదా. సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించలేదు. కాస్త అదృష్టం కలిసొస్తే ఫలితం భిన్నంగా ఉండేది. ఈ కుర్ర జట్టు అప్పుడే అందరిలో నమ్మకాన్ని పెంచగలిగింది.
భవిష్యత్తులో భారత టెస్టు క్రికెట్ ఎలా ఉండబోతోంది?
ఇంకా చాలా శ్రమించాల్సి ఉందనడంలో సందేహం లేదు. ప్రాథమికంగా మంచి బౌలర్లను వెతికి పట్టుకోవాల్సి ఉంది. నిలకడగా టెస్టులో 20 వికెట్లు తీయగల సత్తా ఉండాలి. దూకుడుగా, దూసుకుపోయే తత్వం కూడా జట్టుకు రావాలి. ఫలితాల కోసం మరో ఏడాది పాటు వేచి చూడాల్సిందే. అయితే ఈ విషయంలో నేను చాలా ఆశాభావంతో ఉన్నాను. జట్టు భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన పని లేదు.