కుంబ్లేకు కొత్త హోదా
టీమిండియాలో పలు మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ కోచ్ పదవిలో ఉన్న అనిల్ కుంబ్లేను మార్చి, ఆయన స్థానంలోకి రాహుల్ ద్రవిడ్‌ను తీసుకొస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అండర్ 19 జట్టును సమర్థంగా నడిపించిన ద్రవిడ్.. సీనియర్లకు కూడా పాఠాలు చెప్పగలడన్న నమ్మకంతోనే అతడిని తీసుకొస్తున్నారని భావించారు. మరి ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న అనిల్ కుంబ్లేను ఏం చేస్తారన్న ప్రశ్నలు ఈ సందర్భంలో తలెత్తాయి. కుంబ్లేను కూడా పక్కన పెట్టేది ఏమీ లేదని.. ఆయనకు టీం డైరెక్టర్ పదవి అప్పగిస్తారని తాజాగా వినవస్తోంది. టీం డైరెక్టర్‌గా రవిశాస్త్రి పదవీ కాలం 2016లోనే ముగిసిపోయింది. అప్పటినుంచి జట్టుకు డైరెక్టర్ ఎవరూ లేరు. ఆయనకు ఎక్స్‌టెన్షన్ ఇవ్వకుండా.. ఆ స్థానంలోకి ఇప్పుడు అనిల్ కుంబ్లేను తీసుకొస్తారని అంటున్నారు.
కుంబ్లే కోచింగ్‌లో 2016 సంవత్సరం మొత్తమ్మీద భారత జట్టు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూడలేదు. వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్.. ఇలా వరుసపెట్టి అన్ని దేశాలతోనూ సిరీస్‌లు గెలుచుకుంటూ వచ్చింది. అలాగే రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఇండియా అండర్ -19 జట్టు కూడా చాలా పటిష్ఠంగా తయారైంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జట్టు పాలకమండలిని పూర్తిగా మార్చాలన్న ఉద్దేశంలో బీసీసీఐ కనిపిస్తోంది. అందులో భాగంగానే కుంబ్లేను టీం డైరెక్టర్‌గా నియమిస్తారని, ద్రవిడ్‌ను సీనియర్ జట్టుకు కోచ్‌గా తీసుకొస్తారని చెబుతున్నారు.
బెంగళూరు టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా సంచలన విజయం సాధించిన తర్వాత.. అనిల్ కుంబ్లేను పిలిచి ప్రస్తుతం భారత జట్లన్నింటి పరిస్థితి మీద సమగ్ర నివేదిక ఒకటి ఇవ్వాలని కోరారు. దాంతో సీనియర్, జూనియర్ మహిళా జట్లన్నింటి గురించి సమగ్ర అవగాహన కుంబ్లేకు ఎంతవరకు ఉందో చూసే అవకాశం కూడా బీసీసీఐ పెద్దలకు వస్తుంది. కొత్త కాంట్రాక్టులు ఇచ్చే సమయానికల్లా మార్పులన్నీ చేయడం ఖాయమని అంటున్నారు. కుంబ్లే, ద్రవిడ్‌ల కొత్త నియామకాలతో పాటు.. క్రికెట్ అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఈ కమిటీలో మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌లతో పాటు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. వాళ్లంతా కలిసి కుంబ్లేను 2016లో కోచ్‌గా చేశారు.