నయీం కేసులో టెక్ మధు అరెస్ట్
నల్లగొండ: గ్యాంగ్స్టర్ నయీం కేసులో టెక్ మధును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని ఆలేరు కోర్టులో హాజరు పరిచారు. అశోక్ అలియాస్ మధుతోనూ నయీం సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. తన దందా కొనసాగించేందుకు నయీం అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. నయీం ఎన్కౌంటర్ అనంతరం అతడి స్థావరాల నుంచి స్టెన్ గన్లు, ఏకే-47, తపంచాలు, జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక నయీం కేసుకు సంబంధించి వనస్థలిపురం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో టెక్ మధు ఏ16గా ఉన్నాడు. కాగా గతంలో మావోయిస్టులకు టెక్ మధు రాకెట్ లాంఛర్లు సరఫరా చేసిన విషయం విదితమే. మరోవైపు నయీం కేసులో తవ్వేకొద్దీ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులతో పాటు, సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అలాగే నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 26మంది బాధితులు మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించారు.