techie arrest
-
ఈ టెకీ మాములోడు కాదు.. సుప్రీంకోర్టుకే కన్నం..
సాక్షి, న్యూఢిల్లీ : తాము ఉన్న స్థితిలో నుంచి మరింత ఉన్నత స్థితిలోకి తీసుకెళతామని చెబితే చాలు.. ఆశ అర్రులు చాస్తుంది. వెనుకాముందు చూడకుండా దానికోసం పరుగు మొదలవుతుంది. ఆ హామీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏమిటీ అతడి వ్యవహారం అని తేల్చుకోకుండానే అతడి కలిగించిన ఊహల్లో ఊరేగి చివరకు అమాంతం పడిపోతారు. ఆ వ్యక్తి ఆట కట్టయితే తప్ప అతడి అసలు బాగోతం కొంతమంది జనాలకు అర్థం కాదు. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి కొందరి పరిస్థితి ఇదే అయింది. అయితే, అదేదో సామాన్యులకు ఎదురైన పరిస్థితి కాదు.. ఏకంగా న్యాయమూర్తులకు, సీనియర్ న్యాయవాదులకు ఎదురైన పరిస్థితి. తాను సుప్రీంకోర్టులో సీనియర్ అడిషనల్ రిజిస్ట్రార్‌ను అని చెప్పుకోవడమే కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చాలా కావాల్సిన వాడినని, తాను ఎంత చెబితే అంత అని చెప్పుకుంటూ పైన పేర్కొన్న వారిని బురిడీ కొట్టించాడు ఓ టెక్కీ. రాజస్థాన్ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో, ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా కొలువులు ఇప్పిస్తానని, సీజేఐతో మాట్లాడి వారిని మంచి హోదాల్లోకి తీసుకెళతానంటూ మాయమాటలు చెప్పాడు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే, చివరకు అతడి వ్యవహారం బట్టబయలైంది. ఢిల్లీకి చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన ప్రకారం అపరజిత్ బాసక్ అనే 52 ఏళ్ల వ్యక్తి లండన్ నుంచి ఎంటెక్ పూర్తి చేశాడు. ఇతడిది పశ్చిమ బెంగాల్ కాగా మహారాష్ట్రలో ఉంటున్నాడు. చాలా బాగా ఆంగ్లంలో మాట్లాడగలగడంతోపాటు మాటలతో ఎదుటివారిని ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాకుండా న్యాయ శాస్త్రానికి సంబంధించిన భాషను ధారాళంగా మాట్లాడతాడు. అతడు దాదాపు ఓ 20మంది సీనియర్ న్యాయమూర్తులను, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులను టార్గెట్‌గా చేసుకొని తాను సుప్రీంకోర్టులో సీనియర్ రిజిస్ట్రార్‌ను అంటూ నమ్మబలికించి ఘరానా మోసానికి దిగి చివరకు పోలీసులకు దొరికాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అతడి తెలివి తేటలు చూసి తామే ఆశ్చర్యపోతున్నామని విచారిస్తున్న అధికారులు చెబుతున్నారు. ఇక అతడి చేతుల్లో మోసపోయిన న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరనే జాబితా కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అది బయటకు వస్తే వారికి కూడా కష్టాలు తప్పవు మరి. -
అశ్లీల వెబ్సైట్లో మరదలిపై అసభ్య ప్రచారం
సాక్షి, కరీంనగర్ క్రైం: భార్య, ఆమె కుటుంబసభ్యుల వివరాలను అశ్లీల వెబ్సైట్లో ఉంచిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్లో నిందితుడి వివరాలను సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. కరీంనగర్‌లోని ముకరంపురకు చెందిన అజార్ మోహినోద్దిన్ తమీం (35) హైదరాబాద్‌లోని ఐబీఎం కంపెనీలో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 2013లో ముకరంపురకే చెందిన యువతితో వివాహమైంది. తమీంకు వివాహేతర సంబంధాలు ఉండటం.. కట్నం కోసం వేధిస్తుండటంతో భార్య 2017 జూన్ 6న పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న తమీం ఎలాగైనా ఆమె కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న మరదలిని లక్ష్యంగా నకిలీ మెయిల్ ఐడీని తయారు చేసి.. ఇంటర్నెట్లోని అశ్లీల వెబ్సైట్లలో ఓ ప్రొఫైల్‌ను సెల్‌నంబర్‌తో సహా సృష్టించాడు. సదరు నంబర్‌కు ఫోన్ చేసి శారీరకవాంఛలు తీర్చుకోవచ్చంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు ఆ మొబైల్ నంబరుకు ఫోన్ చేస్తూ అభస్యకరంగా మాట్లాడటం.. మెసేజ్‌లు చేయడం ప్రారంభించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన యువతి ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పి.. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు అశ్లీల వెబ్‌సైట్‌తోపాటు గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి సమాచారాన్ని క్రోడీకరించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్ క్రైం విభాగం సహకారం తీసుకున్నారు. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీఐ సుమారు రెండునెలలపాటు దృష్టి సారించి తమీంను నిందితుడిగా గుర్తించారు. పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఇంటివద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. అతను నిజం ఒప్పుకున్నాడు. సంఘటనకు వినియోగించిన ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్, డాటాకార్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
చీటింగ్ కేసులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
హైదరాబాద్: ఫ్రెషర్లకు శిక్షణ ఇస్తానంటూ మోసం చేసిన కేసులో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన ఎం.శ్రీకాంత్ గతంలో ఐబీఎం, డెల్లాయిట్, ఎరిక్సన్ సంస్థల్లో పని చేశాడు. ఆపై మహారాష్ట్రలోని పుణే చిరునామాతో 4వీస్ కన్సల్టింగ్ అండ్ ట్రైనింగ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ట్రైనింగ్ ఇస్తానంటూ వివిధ జాబ్ పోర్టల్స్‌లో ప్రచారం చేసుకున్నాడు. వీటిలో శ్రీకాంత్ ప్రొఫైల్ చూసిన దోమలగూడలోని ఎలాంత్ర కన్సల్టెన్సీస్ సంస్థ సంప్రదించింది. 16 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించిన శ్రీకాంత్ రూ.2.79 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఎలాంత్ర కన్సల్టెన్సీస్ నిర్వాహకుడు అషీత్ రాజ్ సక్సేనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు గురువారం శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు.