
సాక్షి, కరీంనగర్ క్రైం: భార్య, ఆమె కుటుంబసభ్యుల వివరాలను అశ్లీల వెబ్‌సైట్‌లో ఉంచిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లో నిందితుడి వివరాలను సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. కరీంనగర్‌లోని ముకరంపురకు చెందిన అజార్ మోహినోద్దిన్ తమీం (35) హైదరాబాద్‌లోని ఐబీఎం కంపెనీలో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 2013లో ముకరంపురకే చెందిన యువతితో వివాహమైంది. తమీంకు వివాహేతర సంబంధాలు ఉండటం.. కట్నం కోసం వేధిస్తుండటంతో భార్య 2017 జూన్ 6న పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న తమీం ఎలాగైనా ఆమె కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇంజనీరింగ్ చదువుతున్న మరదలిని లక్ష్యంగా నకిలీ మెయిల్ ఐడీని తయారు చేసి.. ఇంటర్నెట్‌లోని అశ్లీల వెబ్‌సైట్లలో ఓ ప్రొఫైల్‌ను సెల్‌నంబర్‌తో సహా సృష్టించాడు. సదరు నంబర్‌కు ఫోన్ చేసి శారీరకవాంఛలు తీర్చుకోవచ్చంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు ఆ మొబైల్ నంబరుకు ఫోన్ చేస్తూ అభస్యకరంగా మాట్లాడటం.. మెసేజ్‌లు చేయడం ప్రారంభించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన యువతి ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పి.. వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు అశ్లీల వెబ్‌సైట్‌తోపాటు గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి సమాచారాన్ని క్రోడీకరించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్ క్రైం విభాగం సహకారం తీసుకున్నారు.
నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడంతో పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీఐ సుమారు రెండునెలలపాటు దృష్టి సారించి తమీంను నిందితుడిగా గుర్తించారు. పక్కా సమాచారంతో సోమవారం ఉదయం ఇంటివద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. అతను నిజం ఒప్పుకున్నాడు. సంఘటనకు వినియోగించిన ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్, డాటాకార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment