
టెకీ అరెస్టు, ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : తాము ఉన్న స్థితిలో నుంచి మరింత ఉన్నత స్థితిలోకి తీసుకెళతామని చెబితే చాలు.. ఆశ అర్రులు చాస్తుంది. వెనుకాముందు చూడకుండా దానికోసం పరుగు మొదలవుతుంది. ఆ హామీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఏమిటీ అతడి వ్యవహారం అని తేల్చుకోకుండానే అతడి కలిగించిన ఊహల్లో ఊరేగి చివరకు అమాంతం పడిపోతారు. ఆ వ్యక్తి ఆట కట్టయితే తప్ప అతడి అసలు బాగోతం కొంతమంది జనాలకు అర్థం కాదు. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి కొందరి పరిస్థితి ఇదే అయింది. అయితే, అదేదో సామాన్యులకు ఎదురైన పరిస్థితి కాదు.. ఏకంగా న్యాయమూర్తులకు, సీనియర్ న్యాయవాదులకు ఎదురైన పరిస్థితి. తాను సుప్రీంకోర్టులో సీనియర్ అడిషనల్ రిజిస్ట్రార్‌ను అని చెప్పుకోవడమే కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చాలా కావాల్సిన వాడినని, తాను ఎంత చెబితే అంత అని చెప్పుకుంటూ పైన పేర్కొన్న వారిని బురిడీ కొట్టించాడు ఓ టెక్కీ.
రాజస్థాన్ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో, ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా కొలువులు ఇప్పిస్తానని, సీజేఐతో మాట్లాడి వారిని మంచి హోదాల్లోకి తీసుకెళతానంటూ మాయమాటలు చెప్పాడు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడు. అయితే, చివరకు అతడి వ్యవహారం బట్టబయలైంది. ఢిల్లీకి చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన ప్రకారం అపరజిత్ బాసక్ అనే 52 ఏళ్ల వ్యక్తి లండన్ నుంచి ఎంటెక్ పూర్తి చేశాడు. ఇతడిది పశ్చిమ బెంగాల్ కాగా మహారాష్ట్రలో ఉంటున్నాడు. చాలా బాగా ఆంగ్లంలో మాట్లాడగలగడంతోపాటు మాటలతో ఎదుటివారిని ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాకుండా న్యాయ శాస్త్రానికి సంబంధించిన భాషను ధారాళంగా మాట్లాడతాడు.
అతడు దాదాపు ఓ 20మంది సీనియర్ న్యాయమూర్తులను, రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులను టార్గెట్‌గా చేసుకొని తాను సుప్రీంకోర్టులో సీనియర్ రిజిస్ట్రార్‌ను అంటూ నమ్మబలికించి ఘరానా మోసానికి దిగి చివరకు పోలీసులకు దొరికాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. అతడి తెలివి తేటలు చూసి తామే ఆశ్చర్యపోతున్నామని విచారిస్తున్న అధికారులు చెబుతున్నారు. ఇక అతడి చేతుల్లో మోసపోయిన న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరనే జాబితా కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. అది బయటకు వస్తే వారికి కూడా కష్టాలు తప్పవు మరి.
Comments
Please login to add a commentAdd a comment