భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా నివేదిక
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన భానురేఖ(23).. బెంగళూరు అండర్‌పాస్ వరదలో చిక్కుకుని మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. రాజకీయంగానూ విమర్శలకు దారి తీసిన ఈ ఘటనపై.. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించగా, ఇంటర్నల్ రిపోర్టులో విస్తుపోయేలా విషయాలను చేర్చింది బెంగళూరు మహానగరపాలక సంస్థ.
భానురేఖ మృతికి.. ఆమె స్వీయతప్పిదమే కారణమంటూ నివేదికను సిద్ధం చేసింది బీబీఎంపీ(బృహత్ బెంగళూరు మహానరగ పాలిక)!.‘‘ ఆ సమయంలో కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ కింద నీరు చేరింది. డ్రైవర్ అక్కడే ఉన్న బారికేడ్లను పట్టించుకోకుండా ముందుకు పోనిచ్చారు. ఆ సమయంలో కొందరు అక్కడే ఉండి కేకలు వేస్తూ వద్దని వారించారు. డ్రైవర్‌ను అడ్డుకునే అవకాశం ఉన్నా.. భానురేఖ ఆ పని చేయలేదు’’ అని బీబీఎంపీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భానురేఖ మృతికి తమ పౌర సేవల విభాగం ఏమాత్రం కారణం కాదని, ఇందులో తమ తరుపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదని బీబీఎంపీ పేర్కొంది.
అలాగే.. ఘటన నాడు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి ఎండుటాకులు, చెట్ల కొమ్మలు నేలరాలాయని, వర్షంతో కలిసి అవి కేఆర్ అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడానికి కారణం అయ్యాయని తెలిపింది. అండర్‌పాస్‌ల కింద వాననీరు నిలిచిపోకుండా ఉండేందుకు అక్కడ డ్రైనేజీలను నిర్మించాల్సిన అవసరం ఉందని నివేదికలో అభిప్రాయపడింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. అయితే కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ.. దాని కెపాసిటీకి మించి నీరు రావడం, ఆకులు.. కొమ్మలు అడ్డుపడడంతో నీరు నిలిచిపోయిందని తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఈ నివేదికకు సంబంధించిన కాపీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఘటనకు ముమ్మాటికీ నగరపాలక సంస్థనే కారణమంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనపై భానురేఖ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీబీఎంపీ తోపాటు డ్రైవర్ హరీష్ గౌడ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని హలసూరు గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది భానురేఖ కుటుంబం.
సాక్షి, కృష్ణా: బెంగళూరులో ఊహించని రీతిలో ప్రాణం పొగొట్టుకున్న భానురేఖకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మృతదేహం డీకంపోజ్ కాకుండా భద్రపరిచి.. స్వస్థలం తేలప్రోలుకు తరలించగా.. ఇవాళ(మంగళవారం) ఉదయం అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు భానురేఖ మృతదేహానికి ఏపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు, పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.