సాంకేతిక లోపమే కారణం
► హిరాఖండ్ ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రాథమిక అంచనా
► రైలు లైన్ మారే సమయంలో విరిగిన టంగ్‌రైల్ పట్టా
► విద్రోహచర్య కాకపోవచ్చు...
సాక్షి, హైదరాబాద్: నలభై మంది ప్రాణాలు బలిగొన్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రైల్వే సెక్యూరిటీ కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరులో జరగిన ఈ ప్రమాదం వెనక విద్రోహచర్య ఉందన్న అభిప్రాయాల నేపథ్యంలో రైల్వే సేఫ్టీ కమిషన్ అభిప్రాయం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై లోతైన దర్యాప్తు జరపాల్సి ఉన్నప్పటికీ ప్రాథమిక అంచనాలో మాత్రం సాంకేతిక లోపమే కారణమై ఉంటుందన్న అభిప్రాయాన్ని రైల్వే బోర్డు ముందుంచినట్టు తెలిసింది. రైలు ట్రాక్ మారే తరుణంలో టంగ్‌రైల్ (ట్రాక్ మారేందుకు ఉపయోగపడే సన్నటి పట్టా) విరిగిపోవటంతోనే చక్రాలు పట్టాలు తప్పాయని దాదాపు నిర్ధారణకు వచ్చింది. ఆ సమయంలో టంగ్‌రైల్ పట్టాపై విపరీతమైన ఒత్తిడి, రాపిడి జరిగినట్టు భావిస్తున్నారు.
వీల్ యాక్సిల్ లోపం వల్లనా, టంగ్‌రైల్ మార్పు సరిగా జరగకపోవటం వల్లనా అన్నది తేలాల్సి ఉంది. అయితే అసలు టంగ్ రైల్ పట్టా పటుత్వంలో లోపం ఉంటే సులభంగా విరుగుతుందనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు వ్యక్తం చేశారు. దీంతో ఆ పట్టా నమూనాలను పరీక్షించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సాధారణంగా చలి తీవ్రత ఉన్న సమయంలో పట్టాలు విరిగే అవకాశం ఉంటుంది. చిన్నపాటి పగళ్లున్నా చలికి సంకోచించినప్పుడు ఒత్తిడికిలోనై విరుగుతాయి. ఈ క్రమంలో విరిగిన పట్టా నాణ్యతను కూడా అంచనా వేయనున్నారు. గత సంవత్సరం కాన్పూరు వద్ద రైలు పట్టాలుతప్పి 125 మంది మృతికి కారణమైన ఘోర ప్రమాదానికి కూడా పట్టా విరిగిపోవటమే కారణమని తాజాగా తేలిన నేపథ్యంలో... అధికారులు పేర్కొంటున్న అభిప్రాయాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
నిర్వహణ లోపం ఉన్నట్టే...
సాధారణ పట్టాల కంటే... రైలును మరో మార్గంలో మళ్లించే అతి కీలక టంగ్‌రైల్ పట్టాలపై మరింత శ్రద్ధ అవసరం. ఇది పూర్తిగా ఇంజనీరింగ్ వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తున్నందున దాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహించాల్సి ఉంటుంది. అది పటుత్వం కోల్పోయిందా, రెండు మార్గాలకు అనుసంధానించేలా అటూఇటూ కదలిక సరిగ్గా జరుగుతోందా లేదా అన్న విషయంలో నిరంతరం పరిశీలన అవసరం. అలాంటి తరుణంలో ఇంతటి భారీ ప్రమాదం జరిగిందంటే సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టేనని ఓ రైల్వే ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
రంగంలోకి ఎన్ఐఏ...
ఈ ఘోర రైలు ప్రమాదం వెనుక విద్రోహుల కుట్ర ఉందా? ఇదే కోణంలో అనుమానిస్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక దర్యాప్తు నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక బృందం సోమవారం ఘటనాస్థలికి చేరుకుంది. కాగా, ఇండోర్–పట్నా ఎక్స్‌ప్రెస్ గత ఏడాది నవంబర్ 21న పుఖర్యాన్లోని కాన్పూర్‌లో పట్టాలు తప్పి 148 మంది మరణించారు. అంతా ప్రమాదమని భావిస్తున్న తరుణంలో... దీని వెనుక విద్రోహ కోణం ఇటీవల బయటపడింది.
పాక్ నిఘా సంస్థ కనుసన్నల్లో పని చేస్తూ దుబాయ్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌ల కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న గ్యాంగ్ పనని తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్ఐఏ అధికారులు కూనేరు ప్రమాదం వెనుకా ఇలాంటి కోణాలు ఉన్నాయేమోనని ఆరా తీస్తున్నారు. నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆధారాల కోసం కూనేరులో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదస్థలికి వెళ్లినట్లు ఎన్ఐఏ పీఆర్ఓగా వ్యవహరిస్తున్న ఐజీ అలోక్ మితలానీ ధృవీకరించారు. ఈ కేసు దర్యాప్తును స్వీకరించాలా? వద్దా? అనేది ఇంకా నిర్ణయించలేదని, ప్రస్తుతం ప్రాథమిక పరిశీలన జరుగుతోందని పేర్కొన్నారు.