జిల్లాల్లోనూ థర్డ్ పార్టీ ఫీడ్‌బ్యాక్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ విధానాన్ని జిల్లాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విధానం ద్వారా ఉత్తమమైన సేవలు అందించి ప్రజలు సంతృప్తి చెందేలా చేశామని తెలిపారు. జిల్లాల్లో పోలీస్ శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటి విధి విధానాలపై ఎస్పీలతో డీజీపీ సోమవారం పోలీస్ ముఖ్యకార్యాలయంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాల్లో నేరాల నియంత్రణ, సిబ్బంది మానిటరింగ్, నూతన ఒరవడులు, టెక్నాలజీ వినియోగం, రోడ్‌సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ తదితర అంశాలన్నింటిని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీలకు సూచనలు చేశారు.
అన్ని పోలీస్స్టేషన్లలో టీఎస్ కాప్ యాప్ ఉపయోగం పెరగాలని డీజీపీ సూచించారు. అదేవిధంగా సిబ్బందికి ఒత్తిడి లేకుండా పని విభజన జరగాలని, దీనివల్ల పూర్తి స్థాయిలో, అంకితభావంగా సిబ్బంది పని చేయగలరని డీజీపీ సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని, దీనికి ఉదాహరణేగా హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ అని గుర్తుచేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అమలుచేసిన విప్లవాత్మక కార్యక్రమాలన్నింటిని జిల్లా పోలీస్ వ్యవస్థలోనూ తీసుకువచ్చి యూనిఫాం సర్వీసెస్ డెలివరీ విధానాన్ని సరళీకృతం చేయాలని మహేందర్‌రెడ్డి సమావేశంలో స్పష్టంచేశారు.