పోలీసుల తీరుపై ప్రజాగ్రహం
రేపల్లె : మాయమాటలు చెప్పి రూమ్‌కు తీసుకువెళ్లి విద్యార్థిని తేజశ్విని హత్య చేస్తే ఆత్మహత్యగా కేసు నమోదు చేయటం ఏమిటని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో రోడ్డుపై ధర్నా చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం గుంటూరుకు చెందిన ప్రత్యేక వైద్య బృందంతో తేజశ్విని మృతదే హానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తేజశ్వని మృతిని పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేయడంతో బంధువులు, ప్రజాసంఘాల నాయకులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేశారు.
ఈ విషయం ముందుగా తెలుసుకున్న సీఐ మల్లికార్జునరావు, పోలీసులు స్టేషన్ వద్ద భారీగా మోహరించారు. ఆందోళనకారులను స్టేషన్ అడ్డుకున్నారు. దీంతో వారు తాలూకాసెంటర్‌లో రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. తన కుమార్తెను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి రూముకు తీసుకెళ్లి చిప్పల నాగరాజుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని వారు పోలీసులకు తెలియజేశారు. అయితే తేజశ్విని ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు చేయడం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు పోలీసులను నిలదీశారు.
సీఐ మల్లిఖార్జునరావుపై తేజశ్విని తల్లిదండ్రులు రాజేశ్వరి, సాంబశివవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి యజమాని తాను నాగరాజుకు అద్దెకు ఇచ్చిన రూమ్‌లో ఓ బాలిక పడి ఉందని ఇచ్చిన ఫిర్యాదుపై సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ మల్లిఖార్జునరావు శవం కింద పండుకోబెట్టి ఉండటాన్ని గమనించి ఎలా ఆత్మహత్యగా కేసు నమోదు చేశారని పోలీసుల తీరును తప్పుపట్టారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాపట్ల డీఎస్పీ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నివేదిక అందిన వెంటనే నిర్భయ చట్టం వర్తింప చేసి హత్యకేసు నమోదు చేస్తామని తెలియజేశారు.
ఇప్పటికే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. తేజశ్విని మృతిపై సమగ్ర విచారణ చేస్తామని హామీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృత దేహాన్ని 14వ వార్డులోని సాంబశివవరప్రసాద్ ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.