బాలికకు అరుదైన వైద్యం
గొల్లపూడి (విజయవాడ రూరల్) : మూడు నెలల కిందట కొండపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెడ్డిగూడేనికి చెందిన బాలిక తేజశ్రీకి గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స చేశారు. శనివారం హాస్పిటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి వెల్లడించారు. పది సంవత్సరాల బాలిక మే 16వ తేదీ కొండపల్లి వద్ద రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో గాయపడింది. ఆ బాలికను బతికించడానికి కుడికాలు మోకాలును తొలగించాల్సి వచ్చిందన్నారు. ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్, న్యూరో సర్జన్స్, పిల్లల సర్జన్, జనరల్ సర్జన్, పల్స్నాలజిస్ట్ ఇంటెన్సివ్ కేర్ వైద్యులు ఆరువారాల పాటు వెంటిలేటరు పై ఉంచి అరుదైన వైద్య చికిత్సలు నిర్వహించి, ఆపరేషన్లు చేయడం వలన ఇప్పుడు బాలిక పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్తుందన్నారు. ఖర్చులను ఆర్టీసీ సంస్థ అందించిందని ఆర్టీసీ వైద్యాధికారి స్వర్ణకుమారి చెప్పారు. సమావేశంలో డాక్టర్లు పివి.రామారావు, రవీంద్రనాథ్, సునీల్, శ్రీధర్ పాల్గొన్నారు.