అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అనుమతుల్లేని లేఅవుట్లు, అందులో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయించాలని హైకోర్టు సోమవారం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి తక్షణమే నోటీసులు జారీ చేసి నిర్మాణాల నిలుపుదలకు అన్ని చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆయా లేఅవుట్లలో ఒక్క నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే వాటి విషయంలోనూ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్ గ్రామంలో అనుమతుల్లేని లేఅవుట్లలో నిర్మాణాలు చేపడుతున్న తేజశ్రీ రియల్ ఎస్టేట్స్, భవానీ రియల్ ఎస్టేట్స్, శ్రీనిధి రియల్ ఎస్టేట్స్, లక్ష్మీ నర్సింహ బిల్డర్స్, రాఘవేంద్ర రియల్ ఎస్టేట్స్, సప్తగిరి రియల్ ఎస్టేట్స్లతోపాటు హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాదర్గుల్ గ్రామ పరిధిలో తేజశ్రీ రియల్ ఎస్టేట్స్ తదితరులు హెచ్ఎండీఏ అనుమతుల్లేకుండానే లేఅవుట్లు వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సోమవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్ల వాదనలు విన్నది.
తేజశ్రీ రియల్ ఎస్టేట్స్ తదితరులు పెద్ద మొత్తంలో అక్రమ లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదని, అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది పి. తిరుమలరావు పేర్కొన్నారు. తరువాత హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ అక్రమ లేఅవుట్ల విషయం తమకు దృష్టికి వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తాము నాదర్గుల్ గ్రామానికే పరిమితం కాకుండా హెచ్ఎండీఏ పరిధి మొత్తానికీ కలిపి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది.