అమ్మ లేదు.. నాన్న రాడు
కెరమెరి : మండలంలోని కెరమెరి గ్రామ పంచాయతీలోని బాబేఝరి(కొలాంగూడ) గ్రామానికి చెందిన టేకం లేతుబాయి-భీంరావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు లలిత(రెండున్నరేళ్లు), లక్ష్మి(ఏడాదిన్నర), ఐదు నెలల బాబు భీంరావు ఉన్నారు. ఆగస్టులో తల్లి లేతుబాయి జ్వరంతో మృతిచెందింది. కానీ ఆ పిల్లల ఆలనా, పాలనా చూసుకోవాల్సిన తండ్రి త్రాగుడుకు బానిసయ్యాడు. ఆయన ఉన్నా లేనిదాని కిందే లెక్కని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్య మృతిచెందినప్పటి నుంచి నేటి కీ ఆయనకు మత్తు దిగడం లేదు. దీంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. అన్న పట్టించుకోవడం లేదని తెలుసుకున్న తమ్ముడు టేకం గంగారాం ఆ చిన్నారుల బరువు బాధ్యతలు, తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అమ్మతో కలిసి తల్లిదండ్రులు చేసే సపర్యాలు ఆయన చేస్తున్నారు. స్నానం చేయించడం, బట్టలు వేయించడం, అన్నం తినిపించడం, రాత్రి పడుకోబెట్టడం.. జోల పాడడం, ఇతరత్రా సపర్యలు చేస్తున్నారు.
పాపం పసివాడు.. భీంరావు
భీంరావు ఐదు నెలల చిన్నారి. పుట్టిన 30 రోజులకే తల్లి మృతి చెందడంతో చిన్నారిని చూసిన వారందరు బతక డం కష్టమన్నారు. కానీ ఇప్పటికైతే క్షేమంగానే ఉన్నాడు. తల్లి పాల కోసం పెడుతున్న కేకలు చూపరుల ను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆవు పాలు తాగిస్తున్నారు.
చలించిన అధికారులు
మంగళవారం బాబేఝరి(కొలాంగూడ) గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ చిన్నారుల పరిస్థితిని చూసి కెరమెరి మండల ప్రత్యేకాధికారి ఎ.ఇనేశ్, తహశీల్దార్ సిడాం దత్తు చలించిపోయారు. తల్లిదండ్రుల్లా సపర్యాలు చేస్తున్న గంగారాంను అభినందించారు. పిల్లల కోసం కావల్సిన సహాయం అందిస్తామన్నారు. కాగా, టేకం లలితకు జ్వరం రాగా మంగళవారం గ్రామంలోనే వైద్య సిబ్బంది వైద్యం అందించారు.