కొత్తవారిని ఎలా ఎంపిక చేస్తారు?
పెద్దేముల్ : స్వయం ఉపాధి పథకంలో భాగంగా గతేడాది ఎంపిక చేసిన వారికి లోన్లు ఇవ్వాల్సిపోయి తిరిగి కొత్తవారికి ఎంపిక చేయడం ఎంత వరకు సమంజసమని తెలంగాణ బహుజన శ్రామిక శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కూడ యాదయ్య మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2013 -14 సంవత్సరానికి గాను మండలంలోని రేగొండి, మారేపల్లి, జనగాం, బుద్దారం, ఖానాపూర్ గ్రామాల్లో ఎంపీడీఓ, బ్యాంక్ మేనేజర్లు, విలేజ్ సెక్రటరీ లు జాయింట్ ఐడెంటిఫికేషన్ క్యాంప్లు నిర్వహించి సుమారు 70 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారని తెలిపారు.
అయితే వారికి నేటికీ లోన్లు ఇవ్వలేదన్నారు. ఇదే విషయాన్ని గతం లో జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బీసీ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళితే.. తమకు తెలియదని, స్థానిక ఎంపీడీఓలకు సంప్రదించాలని సూచించారని తెలిపారు. వారిని అడిగితే సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి సంబంధించి మంగళవారం నుంచి ఈ క్యాంప్లు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 2013-14 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు ఇచ్చి న తరువాత కొత్త వారిని రుణాలు ఇవ్వాలన్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు బోయిని అనంతయ్య, రాములు, వీరప్ప, వెంకటప్ప, మల్లేశం, యాదప్ప, బోయిని వెంకటప్ప, బోయిని అనంతప్ప, తడుకలి అంబరప్ప, గణమోని వెంకటేశంతో పాటు పలువురు పాల్గొన్నారు.