Telangana border area
-
సరిహద్దు జిల్లాల్లో తగ్గని ఉధృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోకి రాలేదని.. వాటికి సరిహద్దుగా ఉన్న మన జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోందని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. కొన్నిజిల్లాల్లో ఒక్కో రోజు ఒక్కకేసు కూడా నమోదుకాని పరిస్థితి ఉంటే.. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం వరుసగా పదులకొద్దీ కేసులు వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు ఎక్కువగా వస్తున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, మరికొందరితో కూడిన ఉన్నతస్థాయి బృందం హెలికాప్టర్లో సుడి గాలి పర్యటనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేటలలో ఉన్నతాధికారులు పర్యటించారు. స్థానిక వైద్య సిబ్బందిని, అధికారులతో సమావేశమై కరోనా నియంత్రణలోకి రాకపోవడానికి కారణాలను పరిశీలించారు. కలెక్టర్లతో కలిసి జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల బృందం ఆదివారం రాత్రి ఖమ్మంలోనే బసచేసింది. సోమవారం డోర్న కల్, హుజూరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ రాత్రి గోదావరిఖనిలో బసచేసి.. మంగళవారం సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో పర్యటించనుంది. సీఎం ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు కొనసాగుతుండటంపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షించారు. అటు వంటి ప్రాంతాలను గుర్తించి అధ్యయ నం చేయాలని.. కరోనా విస్తరణకు గల కారణాలను విశ్లేషించాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల బృందం మూడు రోజుల పాటు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించింది. ఎక్కడెక్కడ కేసుల పరిస్థితి ఏమిటి? నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో ఈ నెల ఐదో తేదీన 62 కేసులు నమోదైతే, పదో తేదీన 64 కేసులు వచ్చాయి. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. సరిహద్దు రాష్ట్రాలకు ఆనుకొని ఉండటం, స్థానిక అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం, కరోనా టెస్టులు, ట్రేసింగ్ సరిగా నిర్వహించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నా నియంత్రణపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
అన్‌లాక్.. కరోనాకు ‘ప్లస్’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మంచిర్యాల/ బోధన్ రూరల్(బోధన్)/ మద్నూర్ (జుక్కల్): కరోనా డెల్టా వేరియంట్ ఇప్పటికే దేశాన్ని అతలాకుతలం చేయగా.. ఇప్పుడు దాని నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టింది. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు రాకున్నా.. పొరుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న సరిహద్దు జిల్లాల ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. నిజానికి లాక్డౌన్ సమయంలో పోలీసు బందోబస్తు, రెవెన్యూ, వైద్య సిబ్బందితో కోవిడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చీపోయే వారిలో అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేయించి పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు పంపారు. లాక్డౌన్ ఎత్తివేశాక చెక్‌పోస్టులు తొలగించడంతో విస్తారంగా రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో కొత్త వేరియంట్ ఎక్కడ కమ్ముకుంటుందోనని స్థానికులు వాపోతున్నారు. దేశంలో నమోదైన డెల్టా ప్లస్ కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రాకపోకలు ఎక్కువ. సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ జిల్లాల్లో కేసులు భారీగా వచ్చాయి. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుంచీ రాకపోకలు మళ్లీ పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఎన్‌హెచ్ 44 భోరజ్ సరిహద్దు, నిర్మల్ జిల్లా తానూరు సరిహద్దులో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం సమీపంలో కోవిడ్ చెక్‌పోస్టు ఎత్తేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ప్రాణహిత బ్రిడ్జి సమీపం లోని రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద మాత్రం మావోయిస్టులు వైద్యం కోసం వస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు కొనసాగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర, కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జాతీయ రహదారిపై.. రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు కర్ణాటకతో సరిహద్దులు ఉన్నాయి. గద్వాల పరిధిలోని బల్గెర–ఎర్రగేర, నందిన్నె–సింగనేడి, నారాయణపేట పరిధిలో గుడెబల్లూరు–దేవసుగురు, కానుకుర్తి ద్వారా రాకపోకలు జరుగుతాయి. ఇక 44వ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. లాక్డౌన్ సమయంలో ఈ సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కట్టడి లేదు. మళ్లీ కరోనా వస్తే ఎలా? రెండేళ్లలో కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. మహారాష్ట్ర వల్ల మా గ్రామంలో చాలా కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ అని కొత్తరకం వస్తోందని చెప్తున్నారు. చాలా వాహనాలు వస్తున్నాయి. జనం వచ్చిపోతున్నారు. మహా రాష్ట్ర వల్ల మళ్లీ ఇక్కడ కరోనా కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలి. –కె.నారాయణ, రైతు, పంచాక్షరి, ప్రైవేటు లెక్చరర్ సాలూర గ్రామం, బోధన్ మండలం -
మహారాష్ట్రలో మన మద్యం పట్టివేత
బేల(ఆదిలాబాద్): బేల మండల కేంద్రానికి దగ్గర్లో ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చంద్రపూర్ జిల్లాలోని కోర్పణ పట్టణ సమీపంలోని సావల్‌హీర గ్రామ రోడ్డు మార్గంలో మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అక్కడి పోలీసులు పట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న చంద్రపూర్ జిల్లా సావల్‌హీర ప్రాంతం వైపు బేల మండలకేంద్రం నుంచి తరలిస్తుండగా తెలియవచ్చిన ఈ ఘటనపై స్థానికంగా రచ్చరచ్చ జరుగుతోంది. అక్కడి లెక్కల ప్రకారం ఈ మద్యం విలువ రూ.6,44,400 ఉంటుందట! ఆరేడు నెలల నుంచి వారంలో ఒకట్రెండుసార్లు ఈ తరలింపు మాములేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోనూ ఎన్నికల ఎలక్షన్ కోడ్ ఉండగానే ఈ అక్రమ తరలింపు జరగడం గమనార్హం! పట్టుబడ్డ మద్యం వివరాలు ఐబీ క్వాటర్లు 39 పెట్టెలు (1872క్వాటర్లు), రాయల్ స్టాగ్ ఫుల్‌బాటిళ్లు 20, ఐబీ ఫుల్‌బాటిళ్లు 24తోపాటు మరో 24 ఆఫ్ బాటిళ్ల రాయల్ స్టాగ్ మద్యాన్ని పట్టుకున్నారు. వీటి మొత్తం ఇక్కడి విలువ ప్రకారం రూ.2.86 లక్షలు కాగా, అక్కడి ప్రకారం రూ.6,44,400 ఉంటుందని ఓ మహా రాష్ట్ర పోలీసు అధికారి వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారిలా.. బేల మండల కేంద్రంలోని రెండు వైన్సుల్లో నౌకరీనామాతో పని చేస్తున్న పలువురు ఎప్పటిలాగే ఈసారి మద్యాన్ని మండలంలోని చప్రాల, చంపె ల్లి, భవానీగూడ(సి) గ్రామాల మీదుగా మహారా ష్ట్రలోని తిప్ప, మాంగల్‌హీర, సావల్‌హీర ప్రాంతా నికి ఎంహెచ్ 04 ఈఎస్ 9510 నంబరు గల ప్రత్యేక టవేరా వాహనంలో గత సోమవారం రాత్రి పకడ్బందీగా తరలించారు. అయినా, ఈ సమాచారం ఎక్కడ లీకైందో గానీ పక్కా సమాచారం తెలుసుకున్న మహారాష్ట్రలోని కోర్పణ పోలీసులు మాంగల్‌హీర ప్రాంతంలో ఈ మద్యం వాహనాన్ని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆగకుండా వేగంగా దూసుకుపోవడంతో అధికారులు ఆ వాహనాన్ని వెంబడించా రు. ఈ క్రమంలో సావల్‌హీర ప్రాంతం సమీప రోడ్డు మార్గంలో గుంతలు తవ్వి ఉండడంతో, వాహనాన్ని వదిలేసి అందులో ఉన్నవారు పరారయ్యారు. దీంతో అధికారులు వాహనంతోపాటు అందులో తరలిస్తున్న మద్యాన్ని, వాహనంలో దొరికిన ఒక సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. ఈ సంఘటనపై సదరు పోలీస్‌స్టేషన్ సీఐ కిశోర్కార్ను ‘సాక్షి’ వివరణ కోరగా అక్రమ మద్యాన్ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు స్పస్టం చేశారు. సీజ్ చేయబడిన మద్యం, సెల్‌ఫోన్, వాహనం విలువ మొత్తంగా రూ.11,45,400 ఉంటుందని ఆయన వివరించారు. ఈ మద్యం తరలింపుదారులు మా త్రం పరారయ్యారనీ, సీజ్ చేసి సెల్‌ఫోన్ డాటా అధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సీఐ వెల్లడించారు. ఫోన్ తాలుకు నిందితుడిని త్వరలోనే పట్టుకుని, తర్వాత మిగతా నిందితులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
దండకారణ్యంలో దాగుడు మూతలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతూరు : ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని దండకారణ్యంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిని అంతమొందించేందుకు మరొకరు రూపొందించుకుంటున్న పక్కా వ్యూహప్రతివ్యూహాల పుణ్యమా అని ఆ ప్రాంత గిరిజనులకు కంటినిండా కునుకు కరువైంది. శత్రువును దెబ్బతీయడమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నిత్యం మోగుతున్న తుపాకి శబ్దాలు, బాంబుల మోతలతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తమకు ఆయువు పట్టుగా ఉన్నఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలోకి పారా మిలటరీ బలగాలు రావడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు అడపాదడపా ఎదురుదాడికి దిగుతూ ప్రాణనష్టానికి ఒడిగడుతుండగా, ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని ప్రాంతాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సీఆర్పీఎఫ్ బలగాలు దూసుకెళ్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని చింతగుహ-ఎల్మగూడ వద్ద సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్ జవాన్లు భారీ మూల్యం చెల్లించాల్సి రావడానికి మావోయిస్టుల పక్కా ప్రణాళిక కారణమని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. సీఆర్పీఎఫ్ జవాన్ల వైపు నుంచి కాల్పులు ప్రారంభం కాగానే వెనక్కు తగ్గిన మావోయిస్టులు వారి వైపు నుంచి కాల్పుల శబ్దం తగ్గుముఖం పట్టగానే వ్యూహాత్మకంగా సీఆర్పీఎఫ్ బలగాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించలేక పోయిన సీఆర్పీఎఫ్ దళాలు వాస్తవం నుంచి తేరుకునే సరికే మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. తమకు సుస్థిర ప్రాంతాలుగా ఉన్న అంబూజ్‌మడ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు అడుగిడటాన్ని జీర్ణించుకోలేక, వారికి ఈ ప్రాంతంలో పట్టు లభిస్తే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేసి పోలీసు బలగాలపై ఆ ప్రాంతంలో ఎక్కడబడితే అక్కడ విచక్షణారహితంగా మావోయిస్టులు విరుచుకుపడుతున్నట్లు ఛత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంత చేసినా మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో మాత్రం సీఆర్పీఎఫ్ బలగాలు దూకుడుగానే వ్యవహరిస్తూ అరెస్ట్‌లు, లొంగుబాట్లను చేస్తూనే ఉన్నారు. సోమవారం సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కశల్పాడ్ వద్ద జరిగిన మావోయిస్టుల దాడిలో ఇద్దరు అధికారులతో సహా 14మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత అక్కడి పోలీసు అధికారులు ఈ సంఘటనను ఒక సవాల్‌గా తీసుకుని మావోయిస్టులకు పట్టున్న అటవీ ప్రాంతాలు, గిరిజన గూడేలలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఎక్కడ ఎవరు తారసపడినా ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ బలగాలను అక్కడి అధికారులు సిద్ధం చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం, చింతూరు అటవీ ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను, పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా సీఆర్పీఎఫ్ బలగాలు పహరా కాస్తున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో గత రెండు రోజులుగా రాత్రివేళల్లో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. 10 మంది మావోయిస్టులు మృతి..? తమను ట్రాప్‌లో బిగించిన మావోయిస్టులు ఏకధాటిగా కాల్పులు జరపడంతో తమకు తేరుకునేందుకు కొంత సమయం పట్టిందని, ఆ తర్వాత తాముకూడా మావోయిస్టులపై కాల్పులు జరుపుతూ గట్టి జవాబిచ్చామని జగ్దల్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లు తెలిపారు. తమపై మావోయిస్టులు కాల్పులు జరిపే సమయంలో వారికి రక్షణ కవచంగా ఉన్న గ్రామస్తుల్లో కొందరి వద్ద సైతం అధునాతన ఆయుధాలు కనిపించాయని, అయినా తాము శక్తివంచన లేకుండా జరిపిన కాల్పుల్లో 10 మంది వరకు మావోయిస్టులు మృతిచెందడం చూశామని, చాలామంది మావోయిస్టులు గాయపడ్డారని వారు తెలిపారు. తాము ఓ ఖాళీ ప్రదేశంలోకి రాగానే చుట్టూ ఉన్న చెట్లపై కూర్చున్న మావోయిస్టులు అధునాత ఆయుధాలతో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో తమకు తేరుకునేందుకు సమయం పట్టిందని వివరించారు. ఆయుధాల అపహరణ... జవాన్లపై దాడి అనంతరం మావోయిస్టులు జవాన్ల ఆయుధాలను అపహరించుకుపోయారు. 3 యూబీజీఎల్(అండర్ బారెల్ గ్రనేడ్ లాంచర్), 1 ఏకే 47, 1 ఎస్ఎల్ఆర్, 1 ఇంశాస్ రైఫిల్, 1 ఎల్ఎంజీ, 1 జీపీఎస్, 4 బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాలకు సంబంధించిన బుల్లెట్లను అపహరించుకుపోయారు. నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి... సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలకు కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ రాయ్‌పూర్‌లో మంగళవారం నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ టాండన్, ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్ కూడా నివాళులర్పించారు.