సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతూరు : ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని దండకారణ్యంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిని అంతమొందించేందుకు మరొకరు రూపొందించుకుంటున్న పక్కా వ్యూహప్రతివ్యూహాల పుణ్యమా అని ఆ ప్రాంత గిరిజనులకు కంటినిండా కునుకు కరువైంది. శత్రువును దెబ్బతీయడమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో నిత్యం మోగుతున్న తుపాకి శబ్దాలు, బాంబుల మోతలతో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
తమకు ఆయువు పట్టుగా ఉన్నఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలోకి పారా మిలటరీ బలగాలు రావడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు అడపాదడపా ఎదురుదాడికి దిగుతూ ప్రాణనష్టానికి ఒడిగడుతుండగా, ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని ప్రాంతాలపై పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సీఆర్‌పీఎఫ్ బలగాలు దూసుకెళ్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని చింతగుహ-ఎల్మగూడ వద్ద సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు భారీ మూల్యం చెల్లించాల్సి రావడానికి మావోయిస్టుల పక్కా ప్రణాళిక కారణమని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్ జవాన్ల వైపు నుంచి కాల్పులు ప్రారంభం కాగానే వెనక్కు తగ్గిన మావోయిస్టులు వారి వైపు నుంచి కాల్పుల శబ్దం తగ్గుముఖం పట్టగానే వ్యూహాత్మకంగా సీఆర్‌పీఎఫ్ బలగాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఈ హఠాత్పరిణామాన్ని ఊహించలేక పోయిన సీఆర్‌పీఎఫ్ దళాలు వాస్తవం నుంచి తేరుకునే సరికే మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. తమకు సుస్థిర ప్రాంతాలుగా ఉన్న అంబూజ్‌మడ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలు అడుగిడటాన్ని జీర్ణించుకోలేక, వారికి ఈ ప్రాంతంలో పట్టు లభిస్తే ఎదురయ్యే పరిణామాలను అంచనా వేసి పోలీసు బలగాలపై ఆ ప్రాంతంలో ఎక్కడబడితే అక్కడ విచక్షణారహితంగా మావోయిస్టులు విరుచుకుపడుతున్నట్లు ఛత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంత చేసినా మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో మాత్రం సీఆర్‌పీఎఫ్ బలగాలు దూకుడుగానే వ్యవహరిస్తూ అరెస్ట్‌లు, లొంగుబాట్లను చేస్తూనే ఉన్నారు. సోమవారం సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కశల్‌పాడ్ వద్ద జరిగిన మావోయిస్టుల దాడిలో ఇద్దరు అధికారులతో సహా 14మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత అక్కడి పోలీసు అధికారులు ఈ సంఘటనను ఒక సవాల్‌గా తీసుకుని మావోయిస్టులకు పట్టున్న అటవీ ప్రాంతాలు, గిరిజన గూడేలలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఎక్కడ ఎవరు తారసపడినా ఎదుర్కొనేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలను అక్కడి అధికారులు సిద్ధం చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం, చింతూరు అటవీ ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను, పోలీసులను అప్రమత్తం చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా సీఆర్‌పీఎఫ్ బలగాలు పహరా కాస్తున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో గత రెండు రోజులుగా రాత్రివేళల్లో ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.
10 మంది మావోయిస్టులు మృతి..?
తమను ట్రాప్‌లో బిగించిన మావోయిస్టులు ఏకధాటిగా కాల్పులు జరపడంతో తమకు తేరుకునేందుకు కొంత సమయం పట్టిందని, ఆ తర్వాత తాముకూడా మావోయిస్టులపై కాల్పులు జరుపుతూ గట్టి జవాబిచ్చామని జగ్దల్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లు తెలిపారు. తమపై మావోయిస్టులు కాల్పులు జరిపే సమయంలో వారికి రక్షణ కవచంగా ఉన్న గ్రామస్తుల్లో కొందరి వద్ద సైతం అధునాతన ఆయుధాలు కనిపించాయని, అయినా తాము శక్తివంచన లేకుండా జరిపిన కాల్పుల్లో 10 మంది వరకు మావోయిస్టులు మృతిచెందడం చూశామని, చాలామంది మావోయిస్టులు గాయపడ్డారని వారు తెలిపారు. తాము ఓ ఖాళీ ప్రదేశంలోకి రాగానే చుట్టూ ఉన్న చెట్లపై కూర్చున్న మావోయిస్టులు అధునాత ఆయుధాలతో ఒక్కసారిగా కాల్పులు జరపడంతో తమకు తేరుకునేందుకు సమయం పట్టిందని వివరించారు.
ఆయుధాల అపహరణ...
జవాన్లపై దాడి అనంతరం మావోయిస్టులు జవాన్ల ఆయుధాలను అపహరించుకుపోయారు. 3 యూబీజీఎల్(అండర్ బారెల్ గ్రనేడ్ లాంచర్), 1 ఏకే 47, 1 ఎస్‌ఎల్‌ఆర్, 1 ఇంశాస్ రైఫిల్, 1 ఎల్‌ఎంజీ, 1 జీపీఎస్, 4 బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, ఆయుధాలకు సంబంధించిన బుల్లెట్లను అపహరించుకుపోయారు.
నివాళులర్పించిన కేంద్ర హోంమంత్రి...
సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలకు కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ రాయ్‌పూర్‌లో మంగళవారం నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ టాండన్, ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్‌సింగ్ కూడా నివాళులర్పించారు.
దండకారణ్యంలో దాగుడు మూతలు
Published Wed, Dec 3 2014 2:59 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement