ఆలిండియా చెస్ టోర్నీ ప్రారంభం
రాయదుర్గం: ‘నిథమ్’ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని నిథమ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) ప్రాంగణంలో ఆరు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) నిర్వహిస్తోన్న ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 లక్షలు. తెలంగాణతోపాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, హరియాణా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, కేరళ, గోవా, తమిళనాడు, రైల్వేస్, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన మొత్తం 360మంది క్రీడాకారులు ఈ టోర్నీలో తలపడుతున్నారు.
అంతర్జాతీయ మాస్టర్లు రాహుల్ సంగ్మా (రైల్వేస్), చక్రవర్తి రెడ్డి (తెలంగాణ), ఆర్. బాల సుబ్రమణియం (తమిళనాడు) ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు ఐదుగురు ‘ఫిడే’ మాస్టర్లు, టాప్ సీడ్ జె. సాయి అగ్ని జీవితేశ్ పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి భాగ్యనగరం స్పోర్ట్స్ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిథమ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. చిన్నం రెడ్డి, టీఎస్‌సీఏ కార్యదర్శి కె.ఎస్. ప్రసాద్, ఉపాధ్యక్షులు శివప్రసాద్, కోశాధికారి అంజయ్య, కార్య నిర్వాహక కార్యదర్శి సయ్యద్ ఫయాజ్, నిథమ్ అధికారులు, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.