కదంతొక్కిన అంగన్వాడీలు
మంకమ్మతోట, న్యూస్‌లైన్: అంగన్వాడీ వ్యవస్థను ప్రైవేటీకరించవద్దని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. కనీస వేతనం రూ.10వేలు చెల్లించాలని, పింఛన్, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలని బీఎల్ఓలు ర ద్దు చేయాలని, ఐకెపీ, సీడీఆర్ సంస్థ జోక్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.
నెలరోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చొరవచూపాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షురాలు జె.శైలజ, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి ఈ.రమేష్, వనజ, కె.హేమలత, శిరీష, సువర్ణ, రజిత, భాగ్యలక్ష్మి, పుష్ప, విమల, రమతోపాటు వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు.