telangana education minister
-
వారంలో ఇంటర్ సిలబస్, పరీక్షల షెడ్యూలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ఎంసెట్ పరీక్ష సిలబస్ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పాఠశాల విద్యాకమిషనర్ దేవసేన పాల్గొన్నారు. 14 డిమాండ్లు పరిష్కరించండి కాగా, పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న 14 అంశాలను, సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు యాజమాన్యాలు మంత్రిని కోరాయి. ఫీజలు రాక ఏడాది నుంచి విద్యా సంస్థల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నాయి. జూన్ వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధనను విధించాలని కోరాయి. అన్ని తరగతులను కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. -
‘జనరల్ విద్యార్థులకూ గురుకులాలు’
సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్రంలో విద్యావవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సరైన సదుపాయాలు కల్పిస్తే మన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని పేర్కొన్నారు. జిల్లాలోని నెక్కొండ గురుకుల పాఠశాలలో ఆయన మంగళవారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మంచి మెనూ తయారు చేసిందని అన్నారు. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లల ఆరోగ్యం కోసం.. ఒక్కో విద్యార్థినికి 1600 రూపాయల చొప్పున ఖర్చు చేసి 6 లక్షల మందికి హెల్త్, హైజనిక్ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాల బాలికల విద్యావృద్థికి తెలంగాణలో 53 గురుకులాలను ప్రారంభించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు జనరల్ కేటగిరీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని అన్నారు. -
'మేము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు'
న్యూఢిల్లీ: చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రమే ఎంసెట్ నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మంగళవారం విద్యాశాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాము ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదని వెల్లడించారు. ఎంసెట్ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలలో ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సందిగ్థత నెలకొంది. ఈ అంశం గవర్నర్ వద్దకు చేరింది. ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమక్షంలో చర్చలు జరిపిన సమస్య ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ అంశాన్ని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. -
జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలు అన్నింటికీ సరైన సమయంలోనే పాఠ్యపుస్తకాలు అందజేశామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ... సామాజిక శాస్త్రం పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని చెప్పారు. అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని జగదీష్‌రెడ్డి సభకు హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పుస్తకాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందారు. పుస్తకాలు ధర మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో పేద విద్యార్థులపై పుస్తకాల కొనుగోళ్లలో అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు అందలేదన్నారు. నకిలీ పుస్తకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వంశీచంద్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై విధంగా సమాధాన మిచ్చారు. -
చంద్రబాబుతో చర్చకు మేము సిద్ధం
హైదరాబాద్: ప్రస్తుతం భరోసా యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతిని బయటపెడితే వారు జైలు భరో యాత్రలు చేయాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కె. జగదీశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే వారికి బంధించేందుకు తెలంగాణలో జైళ్లు కూడా సరిపోవని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖ మంత్రి షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు తెలంగాణ మంత్రులు సిద్ధంగా ఉన్నారని జగదీశ్వరరెడ్డి వెల్లడించారు. విద్యుత్ విషయంలో చట్టాలను అమలు చేయమని ఏపీ ప్రభుత్వం నిర్ణయిస్తే మా చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగిస్తామని జగదీశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నారు. భరోసా యాత్రలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.