గజ్వేల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
- నివేదికలతో రావాలంటూ అన్ని శాఖల అధికారులకు కేసీఆర్ ఆదేశం
- కసరత్తులో అధికారుల బిజీబిజీ
- 4న సంగారెడ్డిలో సమీక్షా సమావేశం
గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ అభివృద్ధిపై సీరియస్‌గా దృష్టి సారించారు. జూన్ 2న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే... 4న సంగారెడ్డిలో గజ్వేల్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేయనున్నట్లు తె లుస్తోంది.
శాఖల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికలతో రావాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించిన తరుణంలో ఆయా శాఖల అధికారులు కసరత్తులో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు రెండ్రోజులుగా నివేదికలను రూపొందించే పనిలో మునిగిపోయారు. గజ్వేల్ పట్టణం చుట్టూ చేపట్టాల్సిన రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించే పని వేగంగా సాగుతున్న సంగతి తెల్సిందే.
ఇక ఇరిగేషన్ శాఖ అధికారులు నియోజకవర్గంలోని జలాశయాల సామర్థ్యం పెంపు, చెరువులు, కుంటల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గంలో కొత్తగా వేయాలనుకున్న రోడ్లు, భవనాలు, గ్రామీణ ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌళిక వసతులపై పంచాయతీరాజ్ శాఖ నివేదికలు రూపొందిస్తోంది.మిగితా శాఖలు కూడా నివేదికల రూపకల్పనలో బీజీబీజీగా ఉన్నాయి.