సీపీఎస్‌తో ఉద్యోగులకు తీవ్ర నష్టం
తెలంగాణ గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ డిమాం డ్ చేశారు. శనివారం ఇక్కడ ప్రధాన కార్యదర్శి డి.హనుమంతుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి సీపీఎస్ అమలు చేస్తున్నారని, ప్రమాదవశాత్తు మర ణిస్తే ఈ పథకం కింద ఆర్థిక భరోసా లేదని చెప్పారు. డెత్, రిటైర్మెంట్ గ్రాట్యుటీ అసలే లేవన్నారు. కొత్త విధానంలో ప్రభుత్వం కొంత డబ్బు, ఉద్యోగి జీతంలో కొంత డబ్బు షేర్ మార్కెట్ మూచ్యువల్ ఫండ్‌లో పెడుతు న్నారని, రిటైర్మెంట్ తర్వాత ఆ మొత్తం తీసు కోవాలనే నిబంధన పెట్టారన్నారు.
అప్పుడు షేర్ మార్కెట్ పతనం అయితే రావాల్సిన డబ్బు తగ్గుతుంద న్నారు. కొత్త పెన్షన్ విధానంలో ప్రభుత్వం ప్రతి నెలా రూ.300 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయాల్సి వస్తోందని, కొత్త విధానం రద్దు చేస్తే ప్రతి నెల రూ.300 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే అవకాశం వస్తుందని వారు తెలిపారు. ఈ నెల 26న అసోసియేషన్ హైదరాబాద్‌లో తలపెట్టిన శంఖారావం సభకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త విధానం రద్దు చేస్తూ పాత విధానం పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షులు కె.శశికిరణాచారి, వి.శరత్ చంద్ర, ప్రచార కార్యదర్శి సి.హెచ్.సోమశేఖర్, జాయింట్ సెక్రటరీలు రామ్‌కిషన్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.