Telangana investments
-
‘సింగపూర్ హబ్’కు మేం రెడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులతో ముందుకు వచ్చే సింగపూర్ కంపెనీల కోసం ప్రత్యేక జోన్ లేదా ‘సింగపూర్ హబ్’ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రతిపాదించారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే వందల ఏళ్లుగా హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతూ వస్తోందన్నారు. భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ మంగళవారం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వివిధ దేశాలతోపాటు ఇతర రాష్ట్రాలు తెలంగాణలో తమ కంపెనీలు ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. టీఎస్–ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక విధానాలతోపాటు అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించగలిగామన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, వస్త్ర పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. సమావేశం తర్వాత సిమోన్ వాంగ్, చెన్నైలోని సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్, కాకి టియన్లను మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించారు. నూతన రంగాల్లో పెట్టుబడులకు అవకాశం: సిమోన్ వాంగ్ తెలంగాణలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సింగపూర్ కంపెనీలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని అవకాశాలను పరిచేయం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన డీబీఎస్ వంటి కంపెనీలు ఇక్కడి పెట్టుబడుల అనుకూల వాతావరణంపై తమకు సమాచారం ఇచ్చాయన్నారు. ఐటీ, ఆవిష్కరణలు, ఐటీ అనుబంధ రంగాలకు చెందిన బ్లాక్‌చైన్ వంటి నూతన సాంకేతికతపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ వాతావరణం, ఆవిష్కరణలకు అనేక సానుకూలతలు ఉన్నాయని, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు చొరవచూపుతున్న విషయాన్ని సిమోన్ వాంగ్ గుర్తుచేశారు. సింగపూర్ పెట్టుబడుల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వాంగ్ స్వాగతించారు. సింగపూర్‌తో బంధాలు బలోపేతమవ్వాలి: గవర్నర్ వివిధ రంగాల్లో సింగపూర్‌తో బంధాలు బలోపేతమవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. మంగళవారం సింగపూర్ హైకమిషనర్ హెచ్.ఈ.సైమన్ వాంగ్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై తమిళిసైతో చర్చించారు. -
వాహ్... చైనా!
* బీజింగ్‌లోని చారిత్రక స్థలాల్లో కేసీఆర్ పర్యటన * చైనా గ్రేట్ వాల్, తియానన్మెన్ స్క్వేర్ సందర్శన * అక్కడి అందాలను ఆస్వాదించిన ముఖ్యమంత్రి * ఆదివారం సాయంత్రం షెంజెన్ చేరుకున్న సీఎం బృందం * నేడు పారిశ్రామికవాడను సందర్శించనున్న కేసీఆర్ * సాయంత్రం హాంకాంగ్‌కు పయనం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అక్కడి చారిత్రక స్థలాలను సందర్శించి ముగ్ధులయ్యారు. రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని వెంట బెట్టుకొని కేసీఆర్ ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యమిచ్చారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గల బీజింగ్ నగరం ఆధునిక వాస్తుకళ (ఆర్కిటెక్ట్) నైపుణ్యంతోపాటు చారిత్రక ప్రదేశాలకు నిలయంగా కీర్తి గడించింది. నగరంలోని ప్రఖ్యాత తియానన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటించి కేసీఆర్ వాటి అందాలను ఆస్వాదించారు. తొలుత ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద కూడలిలో ఒకటిగా గుర్తింపు పొందిన తియానన్మెన్ స్క్వేర్ను సందర్శించారు. చైనా రాజరిక నగరమైన ‘ఫర్బిడెన్ సిటీ’ని వేరుచేస్తున్న తియానన్మెన్ గేట్‌కు గుర్తుగా ఈ కూడలికి తియానన్మెన్ స్క్వేర్ అనే పేరు స్థిరపడింది. చైనా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన విప్లవ వీరుల స్మారక స్తూపాలు, గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్, చైనా జాతీయ మ్యూజి యం, మావో జెడాంగ్ స్మారక హాల్ తదితర చారిత్రక నిర్మాణాలను ఈ స్క్వేర్ వద్ద కేసీఆర్ తిలకించారు. అనంతరం బీజింగ్‌లో మరో ముఖ్య పర్యాటక ప్రదేశమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించారు. విదేశీ దాడులు, దండయాత్రల నుంచి రక్షణ కోసం దేశ ఉత్తర సరిహద్దుల్లో తూర్పు నుంచి పశ్చిమ దిశ వైపు రక్షణ కవచంగా నిర్మించిన ఈ గోడకు విశేష చరిత్ర ఉంది. రాళ్లు, ఇటుకలు, మట్టి మిశ్రమం, చెక్క ఇతర పదార్థాలను దీని నిర్మాణంలో వినియోగించారు. ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం కూడా ఇదే. గ్రేట్ వాల్లోని సింహ భాగం మింగ్ రాజవంశం హయాంలో నిర్మితమైంది. సరిహద్దుల రక్షణ, వస్తు రవాణాపై పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యానికి ప్రోత్సాహంతోపాటు వలసల నియంత్రణ అవసరాల కోసం ఈ గోడ ఉపయోగపడింది. కేసీఆర్ కొన్ని గంటల సమయాన్ని తియానన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ సందర్శన కోసం కేటాయించారు. ఈ రెండు చారిత్రక ప్రాంతాల విశేషాలను ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు. సాయంత్రం సీఎంతోపాటు వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకుంది. నేడు పారిశ్రామికవాడ సందర్శన సీఎం కేసీఆర్ బృందం సోమవారం షెంజెన్‌లోని హైటెక్ పారిశ్రామికవాడను సందర్శించనుంది. దాదాపు 4 గంటల పాటు ఈ పారి శ్రామికవాడలో గడిపిన అనంతరం హాంకాంగ్ కు పయనం కానుంది. కేసీఆర్ మంగళవారం హాంకాంగ్‌లో పారిశ్రామికవేత్తలతో చర్చలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బుధవారం ఉదయం 11 గంటలకు హాంకాంగ్ నుంచి స్వదేశానికి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. -
ఫర్బిడెన్ సిటీని సందర్శించిన కేసీఆర్
బీజింగ్: చైనాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బీజింగ్‌లో చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. బీజింగ్‌లోని ఫర్బిడెన్ సిటీని కేసీఆర్ బృందం సందర్శించింది. చైనా పర్యటనలో భాగంగా శనివారం కేసీఆర్ తీరికలేకుండా గడిపారు. బీజింగ్‌లో పలు కంపెనీల ప్రతినిధులతో కేసీఆర్ బృందం భేటీ అయింది. చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులను కలిశారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్క్‌ల అభివృద్ధికి ఫార్చూన్ ల్యాండ్ డెవలప్మెంట్ కంపెనీ ఆసక్తి కనబరిచింది. -
షాంఘై చేరుకున్న కేసీఆర్ బృందం
-
తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం
సీఎం కేసీఆర్‌ను కలసిన జిందాల్ ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ర్ట ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. జిందాల్ సా లిమిటెడ్ సీఈవో నీరజ్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్‌కుమార్ తదితరులు గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే పైపులను సరఫరా చేసేందుకు జిందాల్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో పైపుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపనలో జిందాల్ కంపెనీకి ఉన్న అనుభవం దృష్ట్యా బయ్యారం ప్రాంతంలో పరిశ్రమను స్థాపనకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వారికి సూచించారు. వాటర్‌గ్రిడ్‌కు పైపుల సరఫరాపై జిందాల్ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. పరిశ్రమలకు కావలసినంత భూమి, నీరు, తెలంగాణలో అందుబాటులో ఉందని, విద్యుదుత్పత్తి కోసం చేస్తున్న ప్రయత్నాలు రెండేళ్లలో ఫలిస్తాయని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్‌ను మరింత విస్తరిస్తామని, నగర శివార్లలో ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఏరోస్పేస్, ఐటీ పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిందాల్ ప్రతినిధులను సీఎం కేసీఆర్ కోరారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జిందాల్ కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవసింగ్ కూడా పాల్గొన్నారు.