బీజింగ్‌లో ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’పై సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, వేణుగోపాలాచారి తదితరులు
* బీజింగ్‌లోని చారిత్రక స్థలాల్లో కేసీఆర్ పర్యటన
* చైనా గ్రేట్ వాల్, తియానన్మెన్ స్క్వేర్ సందర్శన
* అక్కడి అందాలను ఆస్వాదించిన ముఖ్యమంత్రి
* ఆదివారం సాయంత్రం షెంజెన్ చేరుకున్న సీఎం బృందం
* నేడు పారిశ్రామికవాడను సందర్శించనున్న కేసీఆర్
* సాయంత్రం హాంకాంగ్‌కు పయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అక్కడి చారిత్రక స్థలాలను సందర్శించి ముగ్ధులయ్యారు. రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని వెంట బెట్టుకొని కేసీఆర్ ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యమిచ్చారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గల బీజింగ్ నగరం ఆధునిక వాస్తుకళ (ఆర్కిటెక్ట్) నైపుణ్యంతోపాటు చారిత్రక ప్రదేశాలకు నిలయంగా కీర్తి గడించింది. నగరంలోని ప్రఖ్యాత తియానన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటించి కేసీఆర్ వాటి అందాలను ఆస్వాదించారు.
తొలుత ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద కూడలిలో ఒకటిగా గుర్తింపు పొందిన తియానన్మెన్ స్క్వేర్‌ను సందర్శించారు. చైనా రాజరిక నగరమైన ‘ఫర్బిడెన్ సిటీ’ని వేరుచేస్తున్న తియానన్మెన్ గేట్‌కు గుర్తుగా ఈ కూడలికి తియానన్మెన్ స్క్వేర్ అనే పేరు స్థిరపడింది. చైనా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించిన విప్లవ వీరుల స్మారక స్తూపాలు, గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్, చైనా జాతీయ మ్యూజి యం, మావో జెడాంగ్ స్మారక హాల్ తదితర చారిత్రక నిర్మాణాలను ఈ స్క్వేర్ వద్ద కేసీఆర్ తిలకించారు.
అనంతరం బీజింగ్‌లో మరో ముఖ్య పర్యాటక ప్రదేశమైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను సందర్శించారు. విదేశీ దాడులు, దండయాత్రల నుంచి రక్షణ కోసం దేశ ఉత్తర సరిహద్దుల్లో తూర్పు నుంచి పశ్చిమ దిశ వైపు రక్షణ కవచంగా నిర్మించిన ఈ గోడకు విశేష చరిత్ర ఉంది. రాళ్లు, ఇటుకలు, మట్టి మిశ్రమం, చెక్క ఇతర పదార్థాలను దీని నిర్మాణంలో వినియోగించారు. ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడం కూడా ఇదే. గ్రేట్ వాల్‌లోని సింహ భాగం మింగ్ రాజవంశం హయాంలో నిర్మితమైంది.
సరిహద్దుల రక్షణ, వస్తు రవాణాపై పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యానికి ప్రోత్సాహంతోపాటు వలసల నియంత్రణ అవసరాల కోసం ఈ గోడ ఉపయోగపడింది. కేసీఆర్ కొన్ని గంటల సమయాన్ని తియానన్మెన్ స్క్వేర్, గ్రేట్ వాల్ సందర్శన కోసం కేటాయించారు. ఈ రెండు చారిత్రక ప్రాంతాల విశేషాలను ఆయన ఆసక్తిగా తెలుసుకున్నారు. సాయంత్రం సీఎంతోపాటు వెంట ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం బీజింగ్ నుంచి షెంజెన్ నగరానికి చేరుకుంది.
నేడు పారిశ్రామికవాడ సందర్శన
సీఎం కేసీఆర్ బృందం సోమవారం షెంజెన్‌లోని హైటెక్ పారిశ్రామికవాడను సందర్శించనుంది. దాదాపు 4 గంటల పాటు ఈ పారి శ్రామికవాడలో గడిపిన అనంతరం హాంకాంగ్ కు పయనం కానుంది. కేసీఆర్ మంగళవారం హాంకాంగ్‌లో పారిశ్రామికవేత్తలతో చర్చలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బుధవారం ఉదయం 11 గంటలకు హాంకాంగ్ నుంచి స్వదేశానికి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.