శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
ముగిసిన 10 రోజుల చైనా పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పది రోజుల చైనా, హాంకాంగ్ పర్యటన విజయవంతంగా ముగించుకుని బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. సీఎం, ఆయనతోపాటు వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల బృందం ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం హాంకాంగ్ నుంచి బయల్దేరి రాత్రి 8.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడంతోపాటు పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా చైనా వెళ్లిన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడి వివిధ నగరాలను సందర్శించారు. పలు సదస్సులు, సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు.
పెట్టుబడులు పెట్టాల్సిందిగా చైనా, హాంగ్‌కాంగ్‌లోని పారిశ్రామికవేత్తలను సాదరంగా రాష్ట్రానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం నేరుగా అక్కణ్నుంచి ‘మైం హోమ్’ రామేశ్వర్‌రావు షష్టి పూర్తి కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి పదింటికి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కుటుంబీకులతో పాటు మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంఓ అధికారులు స్వాగతం పలికారు.